Share News

Pulses Scam Exposed: పప్పులు కాజేసి.. కోట్లు వెనకేసి..

ABN , Publish Date - Oct 20 , 2025 | 04:52 AM

రైతులు పండించిన పప్పు ధాన్యాలకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేసి సామాన్యులకు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆశయం..! అయితే అవినీతి అధికారుల చేతుల తడిపి ఆ నిత్యావసరాలను...

Pulses Scam Exposed: పప్పులు కాజేసి.. కోట్లు వెనకేసి..

  • పక్కా ప్రణాళికతో వందల కోట్లు కొల్లగొట్టిన పప్పు వ్యాపారులు

  • గత ప్రభుత్వాధికారులతో కుమ్మక్కు

  • నకిలీ సహకార సొసైటీలు సృష్టి

  • కోట్లు కొల్లగొట్టిన వెంకటేశ్వరరావు, దేశ మురళి, మస్తాన్‌రావు

  • ఐటీ అధికారుల సోదాల్లో 500కోట్లకు పైగా అక్రమాలు వెలుగులోకి

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

రైతులు పండించిన పప్పు ధాన్యాలకు గిట్టుబాటు ధర చెల్లించి కొనుగోలు చేసి సామాన్యులకు అందించాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆశయం..! అయితే అవినీతి అధికారుల చేతుల తడిపి ఆ నిత్యావసరాలను నల్లబజారుకు తరలించి కోట్లు కొల్లగొట్టాలనేది బడా వ్యాపారుల లక్ష్యం..! వారికి సహకరించి ఎన్నికల ఖర్చుల కోసం కోట్లాది రూపాయలు లాగేయాలన్నది వైసీపీ నేతల స్వార్థం..! పై మూడింట్లో రెండు నెరవేరాయి..! సామాన్యులకు సరసమైన ధరలకు నిత్యావసరాలు లభించడం మినహా... పప్పుధాన్యాల వ్యాపారులకు వందల కోట్ల ఆదాయం.. వైసీపీ నేతలకు పదుల కోట్లలో ఎన్నికల వ్యయం.. సమకూరాయి..! మరోవైపు అవినీతి అధికారులకూ ఆశించిన స్థాయిలోనే ముడుపులు అందాయి..! గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పప్పుధాన్యాల ధరల పెరుగుదల వెనుక ఉన్న అక్రమార్కుల బండారం బయటపడింది. విజయవాడ, గుంటూరు, వినుకొండ, తెనాలి, కర్నూలు, విశాఖపట్నంలోని పప్పు వ్యాపారుల అక్రమాలకు సంబంధించిన ఆధారాలు ఆదాయపుపన్ను శాఖకు లభించాయి. ఏపీతో పాటు హైదరాబాద్‌లోనూ ఏకకాలంలో 25 బృందాలు జరిపిన సోదాల్లో విస్తుపోయే రహస్యాలు వెలుగులోకి వచ్చాయి. పప్పు వ్యాపారులు పచ్చిపప్పు, పెసరపప్పును పక్కదారి పట్టించి 500 కోట్లకు పైగా కొల్లగొట్టినట్లు తేలింది. ఈ దందాకు సహకరించిన మాజీ మంత్రి ద్వారా గతేడాది ఎన్నికల ముందు భారీగా నగదు విత్‌డ్రా చేసినట్లు బ్యాంకు స్టేట్‌మెంట్లు లభించాయి. అక్రమంగా సంపాదించిన వందల కోట్లు విదేశాలకు తరలించి అమెరికాలోనూ ఆస్తులు పోగేసుకున్నట్లు ఆదాయ పన్ను శాఖ గుర్తించింది. నలుగురు కీలక వ్యాపారుల ఆర్థిక లావాదేవీలు, వ్యాపార రికార్డులు, బిల్లులు కావాలంటూ ఐటీ శాఖను ఈడీ వివరాలు అడిగింది. దీంతో ఏ క్షణంలోనైనా మనీలాండరింగ్‌ కేసు మీదపడే అవకాశం ఉందంటూ ఏపీలోని పప్పు వ్యాపారుల వెన్నులో వణుకు మొదలైంది.


దోపిడీ ఎలా జరిగిందంటే..

నిత్యావసర వస్తువుల ధరలు సమాన్యుడికి అందుబాటులో ఉంచేందుకు వీలుగా కేంద్రం నేషనల్‌ కో ఆపరేటివ్‌ కన్జుమర్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎన్‌సీసీఎ్‌ఫ)ను స్థాపించింది. వివిధ రాష్ట్రాల్లో రైతులు పండించే వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సహకార సంఘాల ద్వారా సామాన్యులకు సరఫరా చేయడమే దీని లక్ష్యం. ఆహారధాన్యాలు, పప్పులు, చక్కెర, నూనెలు తదితర నిత్యావసరాలు, ప్రజలకు ప్రభుత్వాలు అందించే పీడీఎ్‌సతోపాటు అంగన్‌వాడీ కేంద్రాలకు సైతం ఎన్‌సీసీఎఫ్‌ సహకార సంఘాల ద్వారానే సరఫరా చేస్తుంది. అయితే రాష్ట్రంలోని కొందరు పప్పుధాన్యాల బడా వ్యాపారులు ఎన్‌సీసీఎఫ్‌ అధికారులతో కుమ్మక్కై వందల కోట్లు దోచేశారు. రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించి కేంద్రం సేకరించిన పప్పును సామాన్యులకు సరసమైన ధరలకు విక్రయించాల్సిన కోఆపరేటివ్‌ వ్యవస్థను చేతుల్లోకి తీసుకుని బ్లాక్‌ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించారు. ఏపీలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఈ బాగోతం గురించి హైదరాబాద్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ అసోసియేషన్‌ లిమిటెడ్‌ (హాకా)కు వరుసగా ఫిర్యాదులు అందాయి. వారిని ఏపీ పప్పు వ్యాపారలు ఏ విధంగా మోసగిస్తున్నారో ఫిర్యాదుల్లో స్పష్టంగా ఉండటంతో ఇది తమ పరిధి కాదని పేర్కొంటూ ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉన్నతాధికారికి ఆ ఫిర్యాదులను ఫార్వర్డ్‌ చేశారు. వాటిని పరిశీలించిన ఎఫ్‌సీఐ అధికారులు దీనిలో ఎన్‌సీసీఎఫ్‌ ఉన్నతాధికారుల పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీనిపై ప్రధాన మంత్రి కార్యాలయానికి నివేదిక ఇవ్వడంతో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఏపీ, తెలంగాణల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టి భారీగా అక్రమాలు, ఆదాయానికి మించిన ఆస్తులను గుర్తించారు. మరోవైపు ఎన్నికల ముందు వందల కోట్ల రూపాయలు విత్‌డ్రా చేయడాన్ని పసిగట్టారు. ఆ సొమ్ము వైసీపీ నేతల ఎన్నికల ఖర్చులకు కొంత ఇచ్చినట్లు తెలిసింది. మరికొంత విదేశాలకు తరలినట్లు ఐటీ అధికారులు అనుమానిస్తున్నారు.


ఆ బడా వ్యాపారులు ఎవరు..

వేల కోట్ల రూపాయల టర్నోవర్‌ చేసే బడా వ్యాపారుల్లో గుంటూరుకు చెందిన కమీషన్‌ ఏజెంట్‌ సకల వెంకటేశ్వరరావు, విజయవాడకు చెందిన వ్యాపారి దేశ మురళి, విశాఖపట్నానికి చెందిన పలక, బలపం వ్యాపారి మస్తాన్‌రావు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు. సంక్షేమ హాస్టళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు సరఫరా చేసేందుకు గత వైసీపీ ప్రభుత్వంలో టెండర్లు వేయడంతోనే ఈ ముగ్గురు రింగ్‌ మాస్టర్ల దోపిడీకి బీజం పడింది. గత ప్రభుత్వంలో ముగ్గురు మంత్రుల సహకారం, కొందరు బ్యూరోక్రాట్ల సహాయంతో వీరు టెండర్లు దక్కించుకునేవారు. ఎన్‌సీసీఎఫ్‌ ద్వారా తక్కువధరకు పప్పుధాన్యాలు దక్కించుకుని మార్కెట్‌ ధరకు బయట విక్రయిస్తే భారీగా సంపాదించవచ్చని వారు ఎత్తుగడ వేశారు. దేశ మురళి గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి సహకారం తీసుకుంటే.. మస్తాన్‌ రావు బ్యూరోక్రాట్ల అవసరాలు తీర్చి వారిని బుట్టలో వేసుకున్నాడు. వెంకటేశ్వరరావు ఎన్‌సీసీఎఫ్‌ నుంచి పప్పులు తెచ్చుకోవడానికి అవసరమైన నకిలీ కోఆపరేటివ్‌ సొసైటీలను సృష్టించాడు. ముగ్గురూ కలిసి తక్కువ ధరకు శనగ పపు, పెసర పప్పు కొనుగోలు చేసి 10 నుంచి 15 శాతం ప్రభుత్వానికి సరఫరా చేసి మిగతాదంతా బయటి మార్కెట్లో అధిక లాభాలకు విక్రయించారు.


అక్రమ సొమ్ముతో దేవుడికి నగలు.. అమెరికాలో ఆస్తులు

పప్పు ధాన్యాల వ్యాపారంలో అక్రమంగా సంపాదించిన సొమ్ములో నుంచి దేవుడి వాటాగా వెంకటేశ్వరస్వామికి విశాఖపట్నానికి చెందిన పలక, బలపం వ్యాపారి బరువైన బంగారు హారం బహుమతిగా అందజేసినట్లు అధికారులు చెబుతున్నారు. విజయవాడ వ్యాపారి వందల కోట్ల ఆస్తులు పోగేసి.. అమెరికాలో అన్న పేరుతో ఆస్తులు సమకూర్చినట్లు తెలుస్తోంది. గుంటూరు వ్యాపారి ఎవరెవరితో ఎలాంటి లావాదేవీలు జరిపారనే వివరాలు కూడా సేకరిస్తున్నారు. ఎటువంటి సహకార సంఘాలు లేకున్నా ఈ ముగ్గురి నకిలీ సొసైటీలను సిఫారసు చేసిన ఏపీ వ్యవసాయ, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు మొదలుకొని నేరుగా ఎన్‌సీసీఎఫ్‌ ఉన్నతాధికారితోనే తరచూ వెంకటేశ్వరరావు జరిపిన సంబాషణలు, అంతర్గత లావాదేవీలన్నీ ఈడీ అధికారులు వెలికి తీస్తారని చెబుతున్నారు.

Updated Date - Oct 20 , 2025 | 04:53 AM