Minister Anita: ప్రజాస్వామ్యబద్ధంగానే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 06:55 AM
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు.
పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో ఎవరి ప్రమేయమూ లేదు: మంత్రి అనిత
అమరావతి, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలను పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగానే నిర్వహిస్తామని హోం మంత్రి అనిత తెలిపారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘పోలింగ్ బూత్‌లు ఏర్పాటు ఈసీ నియమావళి ప్రకారమే జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ప్రమేయం ఏమీ లేదు. అయినా ప్రతిపక్ష పార్టీ రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై, సీఎంపై బురద జల్లేలా మాట్లాడటం విడ్డూరం. 2021లో స్థానిక ఎన్నికలప్పుడు టీడీపీ అభ్యర్థుల నామినేషన్లు వేయకుండా పత్రాలను లాక్కుని, అప్రజాస్వామికంగా ఎన్నికలు నిర్వహించిన వైసీపీ ఇప్పుడు గగ్గోలు పెడుతోంది. ఇప్పుడు పులివెందుల జడ్పీటీసీకి 11 నామినేషన్లు దాఖలైనాయి. వివేకాందరెడ్డి కేసుపై పునర్విచారణ కోరే హక్కు వైఎస్ సునీతకు ఉంది. ఆమెకు ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తాం’ అని మంత్రి అనిత అన్నారు.