ZPTC By Election: నేడే జడ్పీటీసీ ఉప ఎన్నికలు
ABN , Publish Date - Aug 12 , 2025 | 05:19 AM
ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ
జగన్ ఇలాకా పులివెందులలో ఉత్కంఠ.. తొలిసారి టీడీపీ నుంచి పెను సవాల్
వైసీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
బెంగళూరు నుంచే జగన్ వ్యూహరచన
గెలిపించే బాధ్యత అవినాశ్‌రెడ్డికి
ఓటర్లకు రూ.5 వేలు, చీరల పంపిణీ
15 పోలింగ్ కేంద్రాల్లో 10 అత్యంత సమస్యాత్మకం
ఒంటిమిట్టలో ఓటు రూ.3 వేలు
కడప, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లూ చేసింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికలను టీడీపీ, వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక వైసీపీకి చావోరేవుగా మారింది. ఇక్కడ టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీచేస్తుండగా.. వైసీపీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. పులివెందులలో నిన్నటిదాకా జగన్ కుటుంబం చెప్పిందే వేదం. వారు చెప్పినవారే ప్రజాప్రతినిధులు అన్నట్లుగా ఏకపక్షంగా జరిగేది. ఈసారి పరిస్థితి పూర్తిగా మారింది. పులివెందులలో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసి ఓడించే స్థాయికి టీడీపీ మొట్టమొదటిసారి చేరింది. గెలుస్తామని వైసీపీ నేతలే ధీమాగా చెప్పుకోలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఓటుకు రూ.5 వేల చొప్పున పంపిణీ చేశారు. ఏ పరిస్థితుల్లోనూ గెలవాలని జగన్ బెంగళూరు నుంచే వ్యూహాలు రచిస్తూ.. అమలు బాధ్యత ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డికు అప్పగించారు. జిల్లా పార్టీ నేతలతో పాటు అవినాశ్‌రెడ్డి తొలిసారి ఇంటింటికీ వెళ్లి ఓట్లడిగారు. ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఓటు రేటు అనూహ్యంగా రూ.5 వేలకు పెంచేశారు. మహిళా ఓటర్లకు సోమవారం సాయంత్రం కీలకమైన నల్లపురెడ్డిపల్లెలో డబ్బుతో పాటు చీరలు కూడా పంచారు. ఇరు పార్టీలూ కేవలం ఓట్ల కోసమే రూ.10 కోట్లకు పైగా వెచ్చించారని ప్రచారం జరుగుతోంది. ఒంటమిట్టలో నోటుకు రూ.3 వేల చొప్పున పంపిణీ చేశారని అంటున్నారు.
కీలక నేతలకు జగన్ ఫోన్?
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఈ స్థాయిలో గట్టి సవాల్ విసురుతుందని వైసీపీ నేతలు ఊహించలేదు. దీంతో అవినాశ్‌రెడ్డి పులివెందుల మండలంలోని కీలక నేతలకు జగన్‌తో ఫోన్ చేయించి మాట్లాడిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికలకు ముందే పులివెందులలో టీడీపీ, వైసీపీ పరస్పరం దాడులు చేసుకున్నాయి. దీంతో పోలింగ్‌రోజు ఏం జరుగుతుందోనన్న ఆందోళన ఉంది. ఈ నేపథ్యంలో పులివెందులలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పులివెందులలో 10,600 మంది ఓటర్లు..
పులివెందులలో 11 మంది బరిలో ఉన్నారు. మొత్తం ఓట్లు 10,600. 15 పోలింగ్ కేంద్రాల్లో 10 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకంగా గుర్తించారు. 700 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఒంటిమిట్టలో టీడీపీ నుంచి అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, వైసీపీ నుంచి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీలో ఉన్నారు. ఇక్కడా 11మంది బరిలో ఉన్నారు. 24,600 ఓట్లు ఉన్నాయి. 30 పోలింగ్ కేంద్రాల్లో 15 కేంద్రాలను సమస్యాత్మకంగా గుర్తించారు. 700 మంది పోలీసులను మోహరించారు.
‘పులివెందుల ర్యాలీ’ నిందితులపైరేపటి వరకు తొందరపాటు చర్యలొద్దు
పోలీసులకు హైకోర్టు ఆదేశం
అనుమతులు లేకుండా పులివెందులలో వైసీపీ నేతలు ర్యాలీ నిర్వహించారనే ఆరోపణలతో నమోదైన కేసులో నిందితులందరిపై బుధవారం (13వ తేదీ) వరకు ఎలాంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి సోమవారం ఉత్తర్వులిచ్చారు. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి ఎలాంటి అనుమతీ తీసుకోలేదంటూ ఎంపీడీవో కృష్ణమూర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అవినాశ్‌రెడ్డి, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీశ్‌కుమార్‌రెడ్డి, మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టివేయాలని కోరుతూ పలువురు వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిగింది.