Peaceful Polling: పులివెందులకు ఓట్ల స్వాతంత్య్రం
ABN , Publish Date - Aug 13 , 2025 | 04:27 AM
పులివెందులలో ఏ ఎన్నిక జరిగినా రక్తం చిందించాల్సిందే. అయితే ఈసారి చరిత్ర మారింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే అరుదైన అవకాశం నాలుగు దశాబ్దాల...
4 దశాబ్దాల తర్వాత స్వేచ్ఛగా పోలింగ్
ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న యంత్రాంగం
ఓటర్లలో ధైర్యం నింపేలా ముందస్తు చర్యలు
పోలింగ్‌కు ముందే ఎంపీ అవినాశ్ అరెస్టు
ఆసాంతం పర్యవేక్షించిన డీఐజీ, ఎస్పీ
దీంతో చేతులెత్తేసిన వైసీపీ.. ఓటే వేయని పార్టీ అభ్యర్థి
మీది వైసీపీ అయితే.. మాది ఖాకీ.. కాల్చిపారేస్తా
తాగి దూషిస్తున్నవారికి డీఎస్పీ స్ర్టాంగ్ వార్నింగ్
జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో 76.44శాతం పోలింగ్
ఒంటిమిట్టలో 81.53శాతం.. రేపు ఫలితాలు
కడప, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పులివెందులలో ఏ ఎన్నిక జరిగినా రక్తం చిందించాల్సిందే. అయితే ఈసారి చరిత్ర మారింది. జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా స్వేచ్ఛగా ఓటు వేసుకునే అరుదైన అవకాశం నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి పులివెందుల వాసులకు లభించింది. పులివెందుల ఉప ఎన్నికలను టీడీపీ, వైసీపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయో అధికార యంత్రాంగం కూడా అంతే పట్టుదలగా తీసుకోవడంతో చెదురుమదురు ఘటనలు తప్ప పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కడప జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగాయి. పులివెందుల టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి పోటీ చేయగా, వైసీసీ నుంచి హేమంత్‌రెడ్డి బరిలో ఉన్నారు. పోలింగ్ సన్నాహాల్లో అధికార యంత్రాంగం చివరివరకు అప్రమత్తంగా వ్యవహరించింది. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్‌కుమార్ సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించారు. నామినేషన్ల అనంతరం పులివెందుల లో టీడీపీ, వైసీపీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో పులివెందులలో పోలింగ్ రోజున 700 మందితో బందోబస్తు నిర్వహించారు. డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అశోక్‌కుమార్ భద్రతను పర్యవేక్షించారు. డ్రోన్ కెమెరాలు, ఫాల్కన్‌తో నిఘా, చెక్‌పోస్టులవద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటుచేశారు. ఎంపీ అవినాశ్‌రెడ్డిని, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని పోలింగ్‌కు ముందే అరెస్టు చేశారు.
అవినాశ్‌రెడ్డి వైసీపీ కార్యాలయంలో ఉండగా, ప్రశాంత ఎన్నికల కోసం ప్రివెంట్ యాక్ట్ కింద అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అయితే ఆయన పోలీసు వాహనం ఎక్కేందుకు ససేమిరా అంటూ అడ్డం తిరిగారు. చివరికి పోలీసులు బలవంతంగా ఆయనను వాహనంలోకి ఎక్కించి ఎర్రగుంట్లకు తరలించారు. ఇక ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేసి ఆర్‌కే వ్యాలీకి తరలించారు. పులివెందుల జడ్పీటీసీ పరిధిలో మొత్తం 10,600 ఓట్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7గంటలకే పోలింగ్ మొదలైంది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. ఎర్రిపల్లెలో పోలింగ్ ప్రారంభం కాకముందే టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ సాగింది. ఓటు వేసేందుకు వస్తున్న టీడీపీ కార్యకర్తల వాహనంపై వైసీపీ మూకలు రాళ్ల దాడి చేశాయి. ఎర్రబల్లెలో కూడా టీడీపీ, వైసీపీ మధ్య చిన్నపాటి ఘర్షణ జరిగిం.ది. అయితే పోలీసులు రంగప్రవేశం చేసి ఘర్షణను సద్దుమణిగేలా చేశారు.
అవినాశ్, రాంగోపాల్‌రెడ్డి అరెస్టు..
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గాను పోలీసులు వైసీపీకి చెందిన ఎంపీ అవినాశ్‌రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డిలను అరెస్టు చేశారు. అవినాశ్‌రెడ్డిని ఎర్రగుంట్లకు తరలించారు. ఆ తర్వాత విడుదల చేశారు. ఆయన అక్కడ జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఇంటికి వెళ్లి తిరిగి మధ్యాహ్నానికే పులివెందులలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పోలింగ్ బూత్ వద్దకు అవినాశ్‌రెడ్డి వస్తారని ప్రచారం సాగింది. దీంతో డీఐజీ కోయ ప్రవీణ్ నేరుగా ఎంపీ కార్యాలయానికి వెళ్లారు.ఆయనతోపాటు డీఎస్పీ మురళీనాయక్ ఉన్నారు. అక్కడ వైసీపీ కార్యకర్తలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం మత్తులో దూషిస్తుండడంతో... డీఎస్పీ మురళీనాయక్ తీవ్రస్వరం వినిపించారు. ‘‘మీరు వైసీపీ కార్యకర్తలైతే..నాది ఖాకీ యూ నిఫాం.. కాల్చిపారేస్తా’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
వైసీపీ హ్యాండ్సప్
పులివెందుల అంటే వైసీపీ గడ్డ అంటూ ప్రచారం చేసుకునేవారు. జడ్పీటీసీ ఎన్నికల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. నామినేషన్ల ముందు వరకు కూడా టీడీపీ బలహీనంగానే ఉంది. అయితే ఆ మండల వాసులను ఎన్నో ఏళ్లుగా వేధిస్తున్న ప్రధాన సమస్యలు పరిష్కరిస్తామని కూటమి హామీ ఇవ్వడం, పలువురు వైసీపీ ముఖ్య నేతలు చేరడంతో టీడీపీ బలం పుంజుకుంది. ఎర్రిపల్లె, ఎర్రబల్లె, అచ్చివెల్లి బూత్‌లలో పోలింగ్ ప్రారంభం కాకముందు చిన్నపాటి ఘర్షణలు మాత్రమే జరిగాయి. అయితే వైసీపీకి ఏజంట్లే కరువయ్యారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి కూడా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు ‘‘మనకు చేయాల్సినంత డామేజీ చేశారు. మనకు టైం వస్తుంది, అప్పుడు చూపిద్దాం, మౌనంగా ఉండండి’’ అంటూ నిర్వేదంగా కార్యకర్తలను శాంతింపజేశారు. కాగా, ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి గుమ్మళ్ల హేమంత్‌రెడ్డి పోటీ చేశారు. ఈయనకు తుమ్మళ్లపల్లె 1వ బూత్‌లో సీరియల్ నంబర్ 538గా ఓటు నమోదైంది. అయితే ఆయన అక్కడ ఓటు వేయలేదు. పులివెందులలో మొత్తం 10,600 ఓట్లు ఉండగా.. ఉపఎన్నికలో 76.44శాతం ఓటింగ్ నమోదైంది. గురువారం ఓట్లు లెక్కించి, ఫలితాలు ప్రకటిస్తారు.
ఇన్నేళ్లకు ప్రశాంతంగా ఓటు వేశాం
‘‘మాది ఎర్రిపల్లె గ్రామం. ఈరోజు ప్రశాంతంగా నా ఓటు వేసుకున్నాను. ఇప్పటివరకు ఇంత ప్రశాంతంగా పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేసుకోవడం చాలా అరుదు. ఏదైన గొడవ జరిగితే ఓటు వేయకపోతే ఏం అవుతుందిలే...అనుకొని ఓటు వేసేవారం కాదు. కానీ ఇప్పుడు ప్రశాంతంగా ఓటువేశాను.’’
- సూర్యశేఖర్‌రెడ్డి, ఎర్రిపల్లె గ్రామం

తొలిసారి ఓటు వేశా..
‘‘ఇప్పటి వరకు ఓటు వేయలేదు. ఈ రోజు మొదటిసారి ఓటు వేశాను. అచ్చవెల్లి పోలింగ్‌కేంద్రం పరిధిలోని కానేపల్లె గ్రామానికి వచ్చి ఓటు వేశాను. గొడవలు జరిగితే గతంలో ఓటు వేయడానికి వెళ్లేదానిని కాదు. ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి వెళ్లి ఓటు ఏం వేస్తాంలే అని ఊరుకునేదానిని. కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో ఓటు వేశాను.
- షమీన, కానేపల్లె

గొడవలు లేకుండా ఎన్నికలు
‘‘ఓట్లంటేనే ఏదొక గొడవ. కానీ ఈ రోజు మా వీధిలో ఓటు వేసే చోట ఎలాంటి గొడవలూ లేవు. నేను ఓటు వేసేందుకు ఇక్కడకు వచ్చాను. నా ఓటు నేను ప్రశాంతంగా వేసుకున్నాను.’’
- కోరా శకుంతలమ్మ,
ఓటర్, ఆర్.తుమ్మలపల్లె
