Pulivendula Police: సునీత దంపతులపై కేసు పెట్టించిన అధికారుల విచారణ
ABN , Publish Date - Nov 09 , 2025 | 04:34 AM
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై తప్పుడు కేసు నమోదులో ప్రమేయం ఉన్న అప్పటి పోలీసు అధికారులను పులివెందుల...
కేసు నమోదు చేసిన పులివెందుల పోలీసులు
గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
కర్నూలు డీఐజీకి ఓ వ్యక్తి ఫిర్యాదు కూడా
వివేకా కుమార్తెపై కేసు పెట్టడం వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు
నాడు కేసు నమోదులో ప్రమేయమున్న ఏఎస్ఐ, రిటైర్డ్ ఏఎస్పీల విచారణ
వీరిద్దరూ వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితులే
అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి కుమారుడికి
ఎంబీబీఎస్ సీటును ఉచితంగా ఇప్పించిన వైనం
పులివెందుల, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌పై తప్పుడు కేసు నమోదులో ప్రమేయం ఉన్న అప్పటి పోలీసు అధికారులను పులివెందుల పోలీసులు విచారించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతోపాటు కుళ్లాయప్ప అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పులివెందుల పోలీసులు తాజాగా కేసు కట్టారు. దీంతో త్వరలోనే సదరు అధికారులను విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. పులివెందులకే చెందిన కుళ్లాయప్ప.. గత నెల 22నే సునీత దంపతులు సహా రామ్‌సింగ్‌పై తప్పుడు కేసు పెట్టిన వారిని విచారించాలని కోరుతూ.. కర్నూలు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లోనే కర్నూలు పోలీసులు ‘జీరో ఎఫ్‌ఐఆర్’ నమోదు చేసి.. అనంతరం దీనిని పులివెందులకు బదిలీ చేశారు.
ఏం జరిగింది?
వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంట్లో 2019, మార్చి 15న దారుణ హత్యకు గురయ్యారు. దీనిపై మొదట సిట్ దర్యాప్తు చేపట్టింది. అనంతరం దర్యాపు సరిగా లేదంటూ వివేకా కుమార్తె సునీత కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం సీబీఐ విచారణకు ఆదేశించింది. దీంతో సీబీఐ అఽఽధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించారు. అయితే, తనను సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్ తనను తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరిస్తున్నారంటూ వివేకా పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు రివర్స్ ఫిర్యాదు చేశారు. దీంతో 2023, డిసెంబరు 24న పులివెందుల పట్టణ పోలీసులు ఆ ముగ్గురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై సునీత కోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తీవ్రంగా పరిగణించి కేసును క్వాష్ చేసింది. ఇదిలావుంటే, సునీత దంపతులు సహా రామ్‌సింగ్‌పై కేసు పెట్టడానికి వెనుక అసలు ఏం జరిగింది?. తెరవెనుక ఎవరున్నారు?. అనే విషయాలను తేల్చాలని కోరుతూ.. ప్రభుత్వం గతంలోనే పులివెందుల డీఎస్పీని ఆదేశించింది. మరోవైపు పులివెందులకు చెందిన కుళాయప్ప అనే వ్యక్తి కూడా గత నెల 22న కర్నూలు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేశారు. అప్పట్లో ఈ ముగ్గురిపై కేసు నమోదు చేయడంలో ప్రమేయం ఉందని ఏఎస్పీ, ప్రస్తుతం రిటెరైన రాజేశ్వర్‌రెడ్డి, అదేవిధంగా ప్రస్తుత రాజుపాళెం ఏఎ్‌సఐ రామకృష్ణారెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో వారిని పులివెందుల పోలీసులు విచారించనున్నారు.
నాడు కేసు వెనుక ఆ ఇద్దరి హస్తం
కుళాయప్ప ఫిర్యాదులో పేర్కొన్న మేరకు.. ‘‘సునీత, రాజశేఖర్‌రెడ్డి, ఎస్పీ రామ్‌సింగ్‌పై కేసు నమోదు చేయడం వెనుక అప్పట్లో నెల్లూరులో ఏఎస్పీగా పనిచేసిన రాజేశ్వర్‌రెడ్డి, అప్పట్లో సింహాద్రిపురం మండలంలో ఏఎస్ఐగా పనిచేసిన రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉంది. రామకృష్ణారెడ్డి పులివెందుల చుట్టుపక్కల మండలాల్లోని పోలీస్ స్టేషన్లలో పనిచేస్తూ పులివెందులలో నివాసం ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వివేకా హత్య జరిగిన రోజు రక్తపు మరకలు తుడిచే విషయంలో కూడా ఈయన ప్రమేయం ఉంది. అనంతరం వివేకా పీఏ వెంకటకృష్ణారెడ్డి ఇంట్లో.. ఆయనతో రాజేశ్వర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. వివేకా ఘటనపై ఫిర్యాదు ఎలా చేయాలో?. ఎవరిమీద చేయాలో? వీరిద్దరూ చెప్పారు. ఆ ప్రకారం అప్పట్లో వివేకా పీఏ పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి రాజుపాళెంలో పనిచేస్తుండగా రాజేశ్వర్‌రెడ్డి రిటైర్ అయ్యారు. ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి.’’ అని కుళాయప్ప ఫిర్యాదులో పేర్కొన్నారు.
సంబంధం లేకున్నా ‘ముఖ్య నేత’ కోసం
ఏఎస్ఐ రామకృష్ణారెడ్డి, అప్పటి ఏఎస్పీ రాజేశ్వర్‌రెడ్డి పులివెందులలోని వైసీపీ ముఖ్య నేతలకు సన్నిహితులని సమాచారం. ఈ కారణంగానే వివేకా హత్య జరిగిన రోజున తనకు సంబంధం లేకపోయినా రామకృష్ణారెడ్డి వివేకా ఇంటికి వెళ్లారని, రక్తపు మరకలు తుడిచేందుకు సాయం చేశారని సమాచారం. రాజేశ్వర్‌రెడ్డి కుమారుడికి నాటి వైసీపీ పెద్దలు ఎంబీబీఎస్ సీటు ఉచితంగా ఇప్చించారని తెలిసింది. రామకృష్ణారెడ్డి బావమరిదికి రాజేశ్వర్‌రెడ్డి కుమార్తెను ఇచ్చి పెళ్లిచేశారు. దీంతో వీరిద్దరి మధ్య బంధుత్వం ఏర్పడింది.