Share News

Pulichintala Project: నిండుకుండలా పులిచింతల

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:59 AM

ఎగువన నాగార్జునసాగర్‌ నుంచి వస్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 41.58 టీఎంసీల నీరు చేరడంతో 12 గేట్లను మూడు అడుగులకు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువనున్న ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు.

Pulichintala Project: నిండుకుండలా పులిచింతల

  • వచ్చిన నీరు వచ్చినట్టే దిగువకు విడుదల

  • ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎగువన నాగార్జునసాగర్‌ నుంచి వస్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. 41.58 టీఎంసీల నీరు చేరడంతో 12 గేట్లను మూడు అడుగులకు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టు దిగువనున్న ప్రకాశం బ్యారేజీకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 3,01,167 క్యూసెక్కులు ఉంది. గంట గంటకూ సాగర్‌ నుంచి ప్రవాహం పెరుగుతోందని పులిచింతల ప్రాజెక్టు డీఈ వెంకట్‌ తెలిపారు. జూలై ఆఖరుకే పులిచింతల ప్రాజెక్టు నిండటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారీగా వరద వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. నదీ తీరాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 94,679 క్యూసెక్కులు ఉందని, ఇది 3 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని తెలిపింది. కాగా.. శ్రీశైలం డ్యాంకు వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి 2,89,670 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది. దీంతో 8 స్పిల్‌వే గేట్ల ద్వారా దిగువకు 2,16,520 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 20 వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 33,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 30,643 క్యూసెక్కులు మొత్తం 3,02,478 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. శ్రీశైలం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.80 అడుగులకు చేరుకుంది. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు 2,82,364 క్యూసెక్కుల వరద చేరుతోంది. 26 గేట్ల ద్వారా 2,65,816 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 31 , 2025 | 07:00 AM