Share News

CM Chandrababu Naidu: ప్రగతికి మార్గం పీపీపీలే

ABN , Publish Date - Sep 24 , 2025 | 04:04 AM

అనుకున్న ప్రగతిని త్వరితగతిన సాధించాలంటే పీపీపీ విధానమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పీపీపీ మెడికల్‌ కాలేజీల్లో పేదలకు పూర్తి ఉచితంగా వైద్యం లభిస్తుందన్నారు.

CM Chandrababu Naidu: ప్రగతికి మార్గం పీపీపీలే

  • పేదలకు ఆరోగ్య భద్రత మా బాధ్యత

  • ప్రైవేటుకు ఇవ్వడం లేదు.. పీపీపీ కింద మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం

  • నిర్మించి, నిర్వహించి, 33 ఏళ్ల తర్వాత తిరిగిస్తారు.. వైసీపీలా కట్టాలంటే 23 ఏళ్లు పడుతుంది

  • మేం రెండేళ్లలోనే పూర్తిచేసి చూపిస్తాం.. పైగా అప్పటికంటే ఎక్కువ సీట్ల లభ్యత

  • ఫేక్‌ ప్రచారాలు నమ్మొద్దు.. ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల ఆస్పత్రి నిర్మిస్తాం

  • 90శాతం సిజేరియన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లోనే.. ఇది ప్రమాదకర ధోరణి.. వెంటనే కట్టడిచేయాలి: సీఎం

దేశంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనప్పటినుంచీ పీపీపీ విధానం ఉంది. ఈ సంస్కరణలకు ముందు మిశ్రమ ఆర్థిక విధానం అమలైంది. అప్పట్లో ప్రభుత్వం పెట్టుబడులు పెడితే, ఫలితాలు కనిపించేవి కాదు. ఆర్థిక సంస్కరణల్లో భాగంగా ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించాం. దానివల్ల సంపద భారీగా పెరిగింది. ఆదాయమూ పెరిగింది. ఇప్పుడు మనం సూపర్‌ జీఎస్టీ, సూపర్‌ పొదుపు వరకు వచ్చాం. దేశం అంతా ఇలా ఒక దారిలో వెళ్తుంటే, వైసీపీ నేతలు మాత్రం మరో దారిలో ఉన్నారు.

- అసెంబ్లీలో ఆరోగ్య శాఖపై చర్చలో సీఎం చంద్రబాబు

అమరావతి, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): అనుకున్న ప్రగతిని త్వరితగతిన సాధించాలంటే పీపీపీ విధానమే మార్గమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. పీపీపీ మెడికల్‌ కాలేజీల్లో పేదలకు పూర్తి ఉచితంగా వైద్యం లభిస్తుందన్నారు. ‘‘నేను సీఎంగా ఉండగా గతంలో జేగురుపాడు పవర్‌ ప్లాంట్‌ను పీపీపీ విధానంలో జీవీకే కంపెనీకి అప్పగించాను. దానిని పూర్తి చేసి తిరిగి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు. అదీ పీపీపీ మోడల్‌ పవర్‌. ఇదే విధానంలో మెడికల్‌ కాలేజీలను నిర్మించనున్నాం. ఆస్తి ప్రభుత్వానిది.. నిర్వహణ ప్రైవేటుది. బాగా నిర్వహించి, వచ్చిన లాభాలతో అప్పులు చెల్లించి, మిగిలినదానిలో కొంత లాభం వారు తీసుకుంటారు. 33 ఏళ్ల తర్వాత ఆ ఆస్తిని ప్రభుత్వానికి తిరిగిచ్చేస్తారు’’ అని చంద్రబాబు వివరించారు. మంగళవారం అసెంబ్లీలో ఆరోగ్య శాఖపై జరిగిన లఘుచర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణంపై తలెత్తుతున్న అనుమానాలను ఈ సందర్భంగా నివృత్తి చేశారు. ఆరోగ్యాంధ్ర లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. సిజేరియన్లు అధికంగా ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతున్నాయని, ఈ విధానాన్ని ప్రభుత్వం సమర్థించబోదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..


‘పులివెందుల’కు మాత్రమే మెడికల్‌ కళ

‘‘గత ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలు కట్టినట్లు కడితే మరో 23 ఏళ్లు పడుతుంది. అంతకాలం మనుషులు బతికి ఉండాలి... అప్పుడుగానీ కాలేజీలు సిద్ధం కావు. కానీ, మేం అలా కాదు. పీపీపీ విధానంలో పూర్తి చేస్తాం. 17 మెడికల్‌ కాలేజీలు కట్టేశామని గొప్పలు చెప్పుకొని, ఫేక్‌ మాట్లాడి ప్రజల్ని గత వైసీపీ ప్రభుత్వం మభ్య పెట్టాలని చూసింది. ఇది సరికాదు. వాస్తవాలను వాస్తవాలుగానే చూడాలి. 17 మెడికల్‌ కాలేజీలు పెడతామని ఆనాడు ప్రకటించి, వీళ్లు (వైసీపీ) ఖర్చు చేసింది కేవలం రూ.1550 కోట్లు. అవన్నీ పూర్తి కావాలంటే మొత్తం రూ. 8480 కోట్లు ఖర్చు చేయాలి. అంటే వీళ్లు ఐదేళ్లలో వ్యయం చేసింది 17శాతమే. మేం రాగానే రూ.783 కోట్లు (తొమ్మిదిశాతం) విడుదల చేశాం. రాజమండ్రి మెడికల్‌ కాలేజీకి రూ.487 కోట్లకుగాను నాడు కేవలం రూ.81 కోట్లు ఖర్చు చేశారు. మేం 82 కోట్లు ఇచ్చాం. జగన్‌ ఊరు కాబట్టి పులివెందుల మెడికల్‌ కాలేజీకి రూ.500 కోట్ల గాను రూ.396 కోట్లు ఖర్చు పెట్టారు. పార్వతీపురానికి రూ.600 కోట్లు కావాల్సి వస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. వాస్తవం ఇది కాగా, ‘కాలేజీ కట్టేశాం.. మీరు దానిని ప్రైవేటుకు ఇస్తున్నారు’ అని ఆరోపిస్తున్నారు. వీళ్లను ఏమనాలో తెలియడం లేదు. మనం ఆనాడు విజయనగరంలో ట్రైబల్‌ యూనివర్సిటీ పెట్టాలని నిర్ణయించాం. ఎయిర్‌పోర్టు దగ్గర మంచి వర్సిటీ వస్తుందని భావించాం. కానీ దాన్ని గత పాలకులు సాలూరికి తీసుకువెళ్లారని చెప్పారు. సాలూరుకు తీసుకువెళ్లారని దానిని అడ్డుకోను. సాలూరులో ట్రైబర్‌ వర్సిటీ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌కు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలూ చెల్లించాం.’’


ఆరోగ్యం మెరుగు.. పేద విద్యార్థులకు సీట్లు

‘‘ఆనాడు అన్ని విభాగాలను ధ్వంసంచేశారు. వాటిని సరిచేయడానికి చాలా సమయం పడుతుంది. అనుభవం ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. లేదంటే పిచ్చి బట్టి పారిపోయే పరిస్థితి. స్వభావరీత్యా నేను విధ్వంసాలకు దూరం. ఆనాడు వైద్యరంగాన్ని అభివృద్ధి చేయకపోగా.. మేం ఆ పని చేస్తుంటే వీళ్లు అబద్ధాలు చెబుతున్నారు. పీపీపీ కొత్తగా మనం తెచ్చింది కాదు. యూపీ, ఒడిశా, జార్ఖండ్‌లో పీపీపీకి ఇస్తున్నారు. ఐఐటీ చెన్నై, ఉదయపూర్‌ ఐఐఎం, నాగపూర్‌ ఐఐటీలో మౌలిక సదుపాయాల కల్పనను ప్రైవేటుకు అప్పగించారు. పీపీపీ విధానంలో ప్రతి పేదవాడి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. పేద విద్యార్థులకు ఎక్కువ సీట్ల వస్తాయి. ఎమ్మెల్యేలు ఈ విధానం గురించి తెలుసుకోవాలని కోరుతున్నాను. రాష్ట్రంలో 1995-96 నాటికి ఆరు మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. 2004నాటికి, అంటే పదేళ్లలో నా హయాంలో ఎనిమిది కాలేజీలు తెచ్చాను. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వరంగంలో 18, ప్రైవేటురంగంలో 18, ఎయిమ్స్‌ 1, గీతం 1 మొత్తం కలిసి 38 కాలేజీలున్నాయి. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పేదఇంటికి ప్రపంచంలో ఉండే ఆధునిక విజ్ఞానం చేరవేయడమే సంజీవని కార్యక్రమం లక్ష్యం. దీనిని కచ్చితంగా అమలు చేస్తే నా జీవతంలో ఇంతకంటే మంచి కార్యక్రమం మరొకటి ఉండదు. క్వాలిటీ చెక్‌పలో 70.7 శాతం సంతృప్తి ఉంది. బెంచ్‌మార్కులో 80 శాతం కచ్చితంగా ఉండాలి. 90 ప్లస్‌కు చేరాలి.’’


ఆరోగ్యాంధ్రే లక్ష్యం...

’’అందరికీ ఆరోగ్యం మన లక్ష్యం. రాష్ట్ర జనాభా 5.37 కోట్లు. 2047 నాటికి 5.41 కోట్లకు చేరతాం. 2047 నాటికి భారతదేశ జనాభా 162 కోట్లకు చేరుతుంది. దేశంలో యువకుల సమస్య పొంచి ఉంది. రాష్ట్రంలో 1.54 శాతం జననాల రేటు ఉంది. అది 2.1 శాతం కంటే తగ్గితే రాబోయే రోజుల్లో జనాభా తగ్గుతుంది. 2047నాటికి 1.35 శాతం మాత్రమే ఉంటుంది. మన ప్రయత్నం 2.1 శాతం చేరుకోవాలని.. భారతీయ ప్రభుత్వ వైద్య ప్రమాణాల ప్రకారం ఆరోగ్య పరంగా మనం మెరుగ్గా ఉన్నాం. డబ్లూహెచ్‌వో నిబంధనల ప్రకారం వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది విషయంలోను మనం ఫరవాలేదు. ఆరోగ్యాంధ్రే లక్ష్యం.’’


పది టాస్క్‌ఫోర్స్‌లు వేస్తాం..

‘‘రాష్ట్రంలో ప్రధానంగా గుర్తించిన పది వ్యాధుల నివారణపై దృష్టిపెట్టాం. దీనికోసం మన దగ్గర ఉన్న ఉత్తమ వైద్యులు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి వైద్య నిపుణులను తెచ్చి 10 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటుచేస్తాం. ఆయా వ్యాధులు ఏ జిల్లాలో ఉన్నాయో గుర్తించి ముందుకెళతాం. టాటా, బిల్‌గ్రేట్స్‌తో కలిసి ఆరోగ్య సంరక్షణ కోసం పని చేస్తున్నాం. ’రియల్‌ టైమ్‌ మోనిటరింగ్‌ - పర్సనలైౖజ్‌ హెల్త్‌ కేర్‌ ఫర్‌ ఆల్‌ రెసిడెన్స్‌’’.. లక్ష్యంతో ముందుకెళుతున్నాం. పేదవాళ్లందరికీ రూ.25 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నాం.’’


అన్నీ అసత్యాలే..

‘‘కాలేజీలు, సీట్ల గురించి మొత్తం అసత్యాలే చెబుతున్నారు. పాత మెడికల్‌ కాలేజీల్లో 15 శాతం ఆల్‌ ఇండియా కోటా, 85 శాతం సీట్లు ప్రభుత్వానికి వస్తాయి. కొత్త కాలేజీల్లో ఆల్‌ ఇండియా కోటా 22 సీట్లు (15శాతం) వెళ్లగా, కన్వీనర్‌ కోటా 64 సీట్లు (42.5శాతం), సెల్ఫ్‌ ఫైనాన్స్‌ (మేనేజ్‌మెంట్‌ కోటా) 45 సీట్లు (29.75శాతం), ఎన్‌ఆర్‌ఐ కోటా 19 సీట్లు (12.75) ఉండేలా గత ప్రభుత్వంలో కేటాయింపులు చేశారు. మా ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీలో ఆలిండియా కోటా సున్నా, కన్వీనర్‌ కోటా 75 సీట్లు (50శాతం), సెల్ఫ్‌ ఫైనాన్స్‌ 53 సీట్లు, ఎన్‌ఆర్‌ఐ కోటా 22 సీట్లు ఇస్తున్నాం. 11 సీట్లు (కన్వీనర్‌ కోటా) అదనంగా ప్రతి కాలేజీలో ఇస్తున్నాం. ఇంకెక్కడ మేం పేదలకు అన్యాయం చేశామో చెప్పాలి. నోరుంది. ఏదైనా మాట్లాడతా.. ఫేక్‌ న్యూస్‌ పెడతాం... మీరు ఏదైనా చేయండని అంటున్నారు. అసలు మనం ఎక్కడికి పోతున్నాం? మీరు కడితే 23 ఏళ్లు పడుతుంది. మేం రెండేళ్లలో పూర్తిచేసి చూపిస్తాం. ప్రైవేటుకు ఇవ్వడం కాదు.. పీపీపీ విధానంలో నిర్మాణాలకు ఇస్తున్నాం. పీపీపీ కింద తయారైన మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తాం. మందులు ఉచితం. ఎన్టీఆర్‌ వైద్య సేవ అమలు చేస్తాం. వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తాం. పేద వాళ్లకు అన్యాయం జరగకుండా చికిత్స, సీట్లలో వారికి అండగా నిలుస్తాం.’’


డిప్యూటీ స్పీకర్‌కూ వర్తిస్తుంది..

‘‘ప్రధాని మంత్రి నరేంద్రమోదీకి 75 ఏళ్లు. నాకంటే ఆరు నెలలు చిన్న. దేశం కోసం ఈ వయసులో ఆయన అద్భుతంగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన లీవ్‌ తీసుకులేదు. నేను కూడా లీవ్‌ తీసుకోలేదు. ఆరోగ్యమే ఔషధం.. వంటిల్లే వైద్యశాల.. అనేది నేను ఎప్పుడూ చెబుతుంటాను. దానిని అనుసరిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. రామ్‌దేవ్‌ బాబాను కలిసినప్పుడు.. 120 ఏళ్ల పాటు తినాల్సిన ఆహారం 40 ఏళ్లలోనే తినేస్తున్నారని ఆయన తెలిపారు. ఇది డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజుకు కూడా వర్తిస్తుంది. (సరదాగా. సభలో నవ్వులు..) గతంలో మా ట్రస్ట్‌ ద్వారా న్యూట్రి ఫుడ్స్‌ ప్రారంభించాం. ఇప్పుడు ఏడు లక్షల మంది సభ్యులు ఉన్నారు. న్యూట్రి ఫుడ్స్‌ విధానం కింద పరీక్షలుచేసి.. సలహాలు ఇస్తున్నాం. మూడు నెలలకు ఒకసారి 41 రకాల పరీక్షలు చేసుకుని చాలామంది ఆహారనియంత్రణ పాటిస్తున్నారు.’’


సిజేరియన్‌ తగ్గాలి...

‘రాష్ట్రంలో 52 నుంచి 62 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయి. ఇందులో 90 శాతం ప్రైవేటు ఆస్పత్రుల్లోనే జరుగుతున్నాయి. ఎన్టీఆర్‌ వైద్య కింద జరిగే ఆపరేషన్లలో సిజేరియన్ల కోసం 4.12 శాతం ఖర్చుపెడుతున్నాం. డెలివరీ డేట్‌ నెల ముందే చెబుతున్నారు. ముహూర్తం పెడుతున్నారు.. ఇది చాలా తప్పు. ప్రమాదకర ధోరణి. డాక్టర్లు డబ్బుల కోసం సిజేరియన్‌ను ప్రోత్సహిస్తున్నారు. దీంతో సిజేరియన్లు మన రాష్ట్రంలోనే అధికంగా ఉంటున్నాయి. ఆరోగ్యశాఖ మంత్రి వారితో మాట్లాడాలి. దేవుడిచ్చిన సహజసిద్ధ శరీరాన్ని కోయడం సరికాదు. వేరే ఆరోగ్య సమస్యలు ఉంటే తప్ప, సాధారణ డెలివరీలనే ప్రోత్సహించాలి.’’

Updated Date - Sep 24 , 2025 | 04:05 AM