BJP President Madhav: వైద్య విద్యలో పీపీపీ అవసరం
ABN , Publish Date - Sep 13 , 2025 | 05:07 AM
వైద్య విద్యలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం నిర్వహించిన సారథ్యం కార్యక్రమంలో...
6 నెలల్లో టారిఫ్ సమస్యకు పరిష్కారం
వైసీపీతో బీజేపీకి చీకటి ఒప్పందాలు లేవు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్
భీమవరం, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం నిర్వహించిన సారథ్యం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలో నిర్వహించిన శోభాయాత్రకు జిల్లా నలుమూలల నుంచి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అనంతరం స్థానిక డీఎన్‌ఆర్ కళాశాలలో చాయ్‌పే చర్చా కార్యక్రమంలో, పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాధవ్ మాట్లాడారు. ఆక్వా రైతుల సమస్య తాత్కాలికమేనని భరోసా ఇచ్చారు. భారత్ కొత్తగా 20 దేశాలతో ఒప్పందాలు చేసుకుంటోందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులకు విశేషమైన మార్కెట్ ఉంటుందని చెప్పారు. భారత్ స్వయం సమృద్ధి దేశంగా మారాలని, స్వదేశీ ఉద్యమం ద్వారా అగ్రరాజ్యాల పెత్తనాన్ని నియంత్రించవచ్చని పేర్కొన్నారు. టారిఫ్ సమస్యలు మరో ఆరు నెలల్లో పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేవాలయాలపై వైసీపీ నాయకుడు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు దాచి నాని మాట్లాడటం సరికాదన్నారు. ఆలయాల్లో అపచారం చేస్తే సహించబోమని ఆయన హెచ్చరించారు. పంచారామాల ఆధ్యాత్మిక యాత్రకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తాయని స్పష్టం చేశారు. వైసీపీతో బీజేపీకి ఎటువంటి చీకటి ఒప్పందాలు లేవని తేల్చిచెప్పారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడిందని మాధవ్ గుర్తుచేశారు.