AMRUT 2.0 Tenders: ప్రగతి పనుల్లో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:04 AM
అమృత్ 2.0 పథకం కింద మున్సిపాలిటీల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయనున్నది.
రాష్ట్రంలో తొలిసారిగా పీపీపీ విధానంలో అమృత్ టెండర్లు
రూ.1,092 కోట్లతో మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి పనులు
కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో టెండర్ వాయిదా
నరసరావుపేట, జూలై 22 (ఆంధ్రజ్యోతి): అమృత్ 2.0 పథకం కింద మున్సిపాలిటీల్లో చేపట్టే అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. రాష్ట్రంలోనే తొలిసారిగా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులను భాగస్వామ్యం చేయనున్నది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల పరిధిలో అమృత్ 2.0 కింద రూ.1,092.60 కోట్లతో చేపట్టే ప్రగతి పనుల కోసం ఒకే ప్యాకేజీ కింద ప్రజారోగ్యం, మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖ గత నెల 24న టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తాగునీటి పథకాల విస్తరణ, మురుగునీటి శుద్ధి ప్లాంట్ల నిర్మాణం, చెరువుల ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు పీపీపీ విధానంలో టెండర్లు పిలిచింది. ఈనెల 21న టెండర్లు దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించింది. అయితే ఎవరూ టెండర్లు దాఖలు చేయకపోవడంతో వచ్చే నెల 7వ తేదీ వరకు గడువును పొడిగించింది.
పీపీపీ విధానంలో ఇలా..
పీపీపీ విధానంలో చేసిన పనులకు ప్రభుత్వం 50 శాతం నిధులను పనిపూర్తయ్యే లోపు ఇస్తుంది. మిగిలిన 50 శాతం కాంట్రాక్టర్ భరించాల్సి ఉంటుంది. సదరు ప్రైవేటు వ్యక్తి లేదా సంస్థ ఖర్చు చేసే 50 శాతం నిధులను వడ్డీతో కలిపి మూడు నెలలకు ఒకసారి చొప్పున పదేళ్ల పాటు 40 వాయిదాల్లో ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ విధానంలో కాంట్రాక్టర్ 10 ఏళ్ల పాటు సంబంధిత అభివృద్ధి పనుల నిర్వహణ కూడా చేయాల్సి ఉంటుంది.
ముందుకు రాని కాంట్రాక్టర్లు
రహదారులు వంటి ప్రగతి పనులకు ఎలాంటి లోపాలు చోటుచేసుకున్నా.. కాంట్రాక్టరే మూడేళ్ల పాటు మరమ్మతు చేయాలనే నిబంధన ఉంది. పని పూర్తయ్యేలోపు కాంట్రాక్టర్‌కు టెండర్ ప్రకారం పూర్తి బిల్లులు చెల్లించేవారు. అయితే కొత్త పీపీపీ విధానంలో కాంట్రాక్టర్ ఖర్చు చేసిన 50 శాతానికి 10 ఏళ్ల లోపు చెల్లించే విధానాన్ని అమలు చేయడంతో అమృత్‌కు టెండర్లు దాఖలు చేసేందుకు పెద్ద కాంట్రాక్టర్లు సహా ఎవరూ ముందుకు రాలేదు. పని పూర్తయ్యాక నిధుల చెల్లింపులో జాప్యం జరిగితే నష్టపోతామని వారు భావిస్తున్నారు. అయితే పెద్ద నిర్మాణ సంస్థ ఒకటి అమృత్ టెండర్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. వచ్చే నెల 7 లోపు టెండర్లు దాఖలు కాకపోతే.. పనుల్లో జాప్యం తప్పదు!