Minister Lokesh: పీపీపీ అంటే ప్రైవేటీకరణ కాదు
ABN , Publish Date - Sep 23 , 2025 | 04:30 AM
పీపీపీ విధానం అంటే ప్రైవేటీకరణ కాదని విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ ఆస్తులను ఎవరికీ అమ్మడం లేదు
2028కల్లా అన్ని మెడికల్ కాలేజీలూ పూర్తి
తన వారి కాంట్రాక్టులు పోతున్నాయనే జగన్ బాధ.. అందుకే అనవసర రాద్ధాంతం
ఇక విద్యాసంవత్సరం ప్రారంభంలోనే డీఎస్సీ
వైసీపీ ఎమ్మెల్యేలు జీతాల కోసం దొడ్డిదారిన దొంగ సంతకాలు చేసి పోతున్నారు
మీడియా చిట్‌చాట్‌లో మంత్రి లోకేశ్
ప్రభుత్వ పాఠశాలల వద్ద ‘నో వేకెన్సీ’ బోర్డులే లక్ష్యం.. శాసనసభలో లోకేశ్
అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ‘పీపీపీ’ విధానం అంటే ప్రైవేటీకరణ కాదని విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. సోమవారం అసెంబ్లీలోని తన చాంబర్‌లో పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. పీపీపీపై వైసీపీది అనవసర రాద్ధాంతమని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు విక్రయించడం లేదన్నారు. 2028 నాటికి అన్ని మెడికల్ కాలేజీల నిర్మాణాలను పూర్తి చేస్తామని, పీపీపీ విధానం వల్ల విద్యార్థులకు ఎలాంటి నష్టం కలుగకుండా చూస్తామని స్పష్టం చేశారు. ‘‘రోడ్లు, విమానాశ్రయాలు అన్నీ పీపీపీ విధానంలోనే అభివృద్ధి చేస్తున్నాం. మరి వాటన్నింటినీ ప్రైవేటు వారికి కట్టబెట్టేసినట్లేనా?. ఇప్పుడు ఇంత గగ్గోలు పెడుతున్న జగన్.. ఐదేళ్ల కాలంలో 5 మెడికల్ కాలేజీలను కూడా ఎందుకు పూర్తి చేయలేదు? కనీసం తన పులివెందులలోనూ పూర్తి చేయలేకపోయారు’’ అని అన్నారు. గతంలో చంద్రబాబు ఇంజనీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చే సమయంలో అప్పటి కాంగ్రెస్ నేతలు ఇలాంటి విమర్శలే చేశారని, అప్పుడు చంద్రబాబు వెనకడుగు వేసి ఉంటే ఇప్పుడు ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేవా? అని ప్రశ్నించారు. ‘‘ప్రిజనరీకి-విజనరీకి ఉన్న తేడా అదే.’’ అని జగన్‌ను ఎద్దేవా చేశారు. ‘‘జగన్ తాను కట్టిన కాలేజీలను చూసి ఆహా.. ఓహో అనాలని అంటున్నారు. అసలు కాలేజీలు ఉంటే కదా అనడానికి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రైవేటును భాగస్వాములను చేస్తే అది ప్రైవేటీకరణ ఎలా అవుతుంది? తన మనుషులకు ఇచ్చిన కాంట్రాక్టులు పోతున్నాయనే జగన్ భయం. అందుకే గగ్గోలు పెడుతున్నారు.’’ అని దుయ్యబట్టారు. ఇంకా ఏమన్నారంటే..
అక్టోబరు నుంచి పెట్టుబడుల వరద
జగన్ ఐదేళ్ల విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం. మరో ఏడాది అయితే కాస్త ఒడ్డున పడతాం. అక్టోబరు నుంచి వరుస పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాం. విశాఖలో ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. టీసీఎస్ ఇప్పటికే నియామకాలు మొదలు పెట్టింది. ఈ ఏడాది జనవరిలో అమరావతిలోని విట్ క్యాంప్‌సలో క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేస్తాం. తర్వాత పూర్తిస్థాయి భవనాన్ని సిద్ధం చేసి అక్కడికి తరలిస్తాం. పరిశ్రమలు తీసుకువచ్చేందుకు మా వద్ద మూడు మంత్రాలున్నాయి. చంద్రబాబు బ్రాండ్, ఆయన విజన్, సమర్థ నాయకత్వం మొదటిది. రెండోది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బజినెస్, మూడోది.. ఏపీ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడంలో స్టార్టప్ కంపెనీలా శ్రమిస్తుంది. పెట్టుబడుల ఆకర్షణలో ఈ మూడూ మా విజయ రహస్యాలు. జీఎస్టీ-2.0 ఆర్థికవృద్ధికి దోహదపడుతుంది. జీఎస్టీ వల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. ఫలితంగా పన్ను చెల్లింపులు పెరుగుతాయి. జీఎస్టీ-2.0 ప్రయోజనాలపై అక్టోబరు మూడోవారంలో భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. దీనికి రావాలని ప్రధానిని కూడా ఆహ్వానించాం.
జగన్ హెలికాప్టర్ ఖర్చు.. 220 కోట్లు
అక్రమనిర్బంధాలకు టీడీపీ వ్యతిరేకం. మా ప్రభుత్వంలో నిర్బంధాలకు తావులేదు. ఉద్యోగుల డీఏ, సరెండర్ లీవులపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. 3 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లిస్తాం. ఏటా విద్యాసంవత్సరం ప్రారంభంలోనే డీఎస్సీ నిర్వహిస్తాం. జగన్ ఐదేళ్లలో చేసిన హెలికాప్టర్ ఖర్చు రూ.220 కోట్లుపైచిలుకు. చంద్రబాబు అందులో 10వ వంతు కూడా ఖర్చు చేయకుండానే జగన్ కన్నా ఎక్కువగా తిరుగుతున్నారు.
పరకామణి చోరీపై సిట్!
తిరుమల పరకామణి చోరీపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) నియమించి విచారణ చేయిస్తామని లోకేశ్ తెలిపారు. ‘‘2023 ఏప్రిల్ 29 రాత్రి 11 గంటలకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, మరుసటి రోజే చార్జిషీట్ వేశారు. పకడ్బందీగా కేసును నిర్వీర్యంచేశారు. ముందుగా చార్జిషీట్ రెడీ చేసుకుని తారీకు మారగానే కోర్టులో వేశారు. శ్రీవారి సొత్తును చోరీ చేస్తే సాదాసీదా నేరం జరిగినట్లు 41(ఏ) కింద నోటీసు ఇచ్చి విచారణ చేసి పంపేశారు. తర్వాత లోక్‌అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యిలో అసలు నెయ్యే లేదని సీబీఐ నిగ్గుతేల్చింది. పరకామణి చోరీపై జగన్‌ను మాట్లాడమనండి. సభకు వచ్చి చర్చించమనండి. కరుణాకర్‌రెడ్డి క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారు. అలాంటి వ్యక్తికి టీటీడీ చైర్మన్ పదవి ఎలా ఇచ్చారు.’’ అని ప్రశ్నించారు.
జీతాల కోసం దొంగ సంతకాలు
వైసీపీ హయాంలో చంద్రబాబు సభకు ఎందుకు రావడం లేదో స్పష్టంగా చెప్పి మరీ వెళ్లారు. ఈ రోజు జగన్, ఆయన ఎమ్మెల్యేలు సభకు రాకపోవడానికి కారణం ఉందా?. వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత గురించి మేం మాట్లాడం. వారు సభకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కనీసం వారి నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించేందుకైనా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలి. మాకు 23 ఎమ్మెల్యేలే ఉన్నా అసెంబ్లీకి వచ్చాం. మండలిలో మెజార్టీ లేకున్నా హాజరయ్యాం. మమ్మల్ని అవమానించినా వెనుకడుగు వేయలేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు జీతాల కోసం దొంగతనంగా వచ్చి సంతకాలు పెట్టి పోతున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు లేని లోటును కూటమి ఎమ్మెల్యేలే భర్తీ చేస్తున్నారు. ఇది మంచి సంప్రదాయం. నిర్మాణాత్మక విమర్శలు ప్రభుత్వానికి చాలా అవసరం.