Share News

CM Chandrababu: పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుదే

ABN , Publish Date - Nov 22 , 2025 | 03:50 AM

పీపీపీ పద్ధతిలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలపై పర్యవేక్షణ, అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టం చేశారు.

CM Chandrababu: పీపీపీ కాలేజీల నియంత్రణ సర్కారుదే

  • కొత్త మెడికల్‌ కాలేజీలపై సీఎం స్పష్టీకరణ

  • నాణ్యమైన వైద్య సేవలకే పీపీపీ విధానం

  • ఒక్కో మెడికల్‌ కాలేజీకి 50 ఎకరాలు.. 25 ఎకరాల్లో కాలేజీ, ఆస్పత్రి

  • 25 ఎకరాల్లో పారా మెడికల్‌ , నర్సింగ్‌.. పేదలకు ఉచితంగా 70ు పడకలు

  • యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో తగ్గనున్న వైద్య భారం.. సమీక్షలో చంద్రబాబు

అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): పీపీపీ పద్ధతిలో కొత్తగా నిర్మిస్తున్న మెడికల్‌ కాలేజీలపై పర్యవేక్షణ, అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు సృష్టం చేశారు. శుక్రవారం ఉదయం సచివాలయంలో ఆయన ఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణం, కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలు, యూనివర్సల్‌ హెల్త్‌ స్కీమ్‌ తదితర అంశాలపై అధికారులతో సీఎం సుదీర్ఘంగా చర్చించారు. పేదలకు ఉచితంగా, మెరుగైన సేవలు అందించేందుకు మెడికల్‌ కాలేజీల నిర్మాణం చేపడుతున్నామని తెలిపారు. పీపీపీ తొలి విడతలో చేపడుతున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందులలోని మెడికల్‌ కాలేజీల నిర్మాణ ప్రక్రియపై ఆయన ఆరాతీశారు. ప్రస్తుతం టెండరు ప్రక్రియలోభాగంగా నాలుగు దశలు దాటామని, వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని, దానివల్ల నగరాలు, పట్టణ ప్రాంతాలకే పరిమితమైన ఆధునిక వైద్య సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకూ అందుతాయని వివరించారు. ప్రజలకు, విద్యార్థులకు మెడికల్‌ కాలేజీలతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఒక్కో మెడికల్‌ కాలేజీ కోసం 50 ఎకరాలు కేటాయించామని, ఇందులో 25 ఎకరాల్లో మెడికల్‌ కాలేజీ, దానికి అనుబంధంగా ఆస్పత్రి నిర్మాణం జరిగితే, మిగతా 25 ఎకరాల్లో నర్సింగ్‌, పారా మెడికల్‌, డెంటల్‌ ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్‌, యోగా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్నింటినీ అనుసంధానించాలని సీఎం సూచించారు. మెడికల్‌ కాలేజీల అనుబంధ ఆస్పతుల్లో 70 శాతం పడకలు పేదలకు ఉచితంగా కేటాయిస్తామని, వైద్య సేవలు కూడా ఉచితంగానే అందుతాయని వివరించారు. దేశవ్యాప్తంగా వివిధ నమూనాల్లో నిర్వహిస్తున్న ఆస్పత్రులపై అధ్యయనం చేయాలని సూచించారు. ప్రభుత్వ ప్రమాణాలు, నీతీ ఆయోగ్‌ మార్గదర్శకాల ప్రకారం వైద్య కళాశాలలు పనిచేసేలా చూడాలని, ఉత్తమ కార్యాచరణ కలిగిన వాటికి రేటింగ్‌ ఇవ్వాలని అధికారులకు నిర్దేశించారు.


సంజీవని గేమ్‌ చేంజర్‌..: కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్న సంజీవని ప్రాజెక్ట గేమ్‌ చేంజర్‌గా మారనుందని, ఆరోగ్య రంగంలో దేశం మొత్తానికి ఓ దిక్సూచిలా ఈ ప్రాజెక్టు నిలవనున్నదని సీఎం అన్నారు. ఈ విధానంలో డిజిటల్‌ హెల్త్‌ రికార్డులు నిర్వహించడం ద్వారా ప్రజారోగ్యాన్ని పర్యవేక్షిస్తామని వివరించారు. కుప్పంలో 3.38 లక్షల మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించాలని చంద్రబాబు సూచించగా, కుప్పంలో రిజిస్టర్‌ అయిన ప్రజలకు పరీక్షలు నిర్వహించి వ్యాధుల ప్రొఫైల్స్‌ సిద్ధం చేస్తున్నామని, 49 వేల మంది డేటాను సేకరించామని అధికారులు తెలిపారు. జనవరి 1నుంచి చిత్తూరు జిల్లా మొత్తానికి ప్రాజెక్టును వర్తిస్తున్నట్టు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టును విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని బాబు ఆదేశించారు.

ఏప్రిల్‌ నుంచి యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌..

యూనివర్సల్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విధానాన్ని 2026 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం 12 లక్షల క్లయిమ్‌లు ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు వస్తున్నాయని, వీటికోసం నెలకు రూ.330 కోట్లు వ్యయం చేస్తున్నామని అధికారులు తెలిపారు. ఏ ప్రాంతంలో, ఏ వ్యాధికి ఎంత వ్యయం చేస్తున్నామో విశ్లేషించాలని, ప్రివెంటివ్‌, క్యూరేటివ్‌ విధానాల ద్వారా ఆరోగ్యరంగంపై ప్రభుత్వం చేస్తున్న వ్యయంతోపాటు ప్రజల వ్యక్తిగత వ్యయం కూడా తగ్గేలా చూడాలని సీఎం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి సత్యకుమార్‌ పాల్గొనగా, ఆ శాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్‌, కమిషనర్‌ వీరపాండియన్‌, ఎండీ గిరీశ నేరుగా పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 07:56 AM