ప్రజా ప్రతిపక్షంతోనే విభజన హామీల అమలు సాధ్యం: తులసిరెడ్డి
ABN , Publish Date - Jun 04 , 2025 | 07:37 AM
ఆంధ్రప్రదేశ్ విభజన చట్ట హామీలలో ఇప్పటి వరకు కేవలం 10 శాతం మాత్రమే అమలు కాగా, ప్రజా ప్రతిపక్షంతోనే వాటిని నూరు శాతం అమలు చేయవచ్చని డాక్టర్ ఎన్. తులసిరెడ్డి తెలిపారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
గుంటూరు కార్పొరేషన్, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు గత 11 సంవత్సరాలుగా 10 శాతం మాత్రమే అమలు అయ్యాయని, నిర్మాణాత్మకమైన ప్రజా ప్రతిపక్షం ద్వారానే కేంద్రం మెడలు వంచి విభజన చట్టంలోని హామీలను నూరు శాతం అమలు చేసుకోగలమని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మీడియా కమిటీ చైర్మన్ డాక్టర్ ఎన్.తులసిరెడ్డి అన్నారు. జై ఆంధ్ర డెమోక్రటిక్ ఫోరం ఆధ్వర్యంలో గుంటూరులో ‘అమలు కాని విభజన హామీలు-యువత వలసలు-అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్’ అనే అంశాలపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనుకబడిన 7 జిల్లాలకు బుందేల్ ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీ అందించకుండా, జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిందన్నారు.