Raghavulu: ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలి: రాఘవులు
ABN , Publish Date - Jun 17 , 2025 | 05:00 AM
బీజేపీ పాలనలో రాజ్యాంగ పునాదులపై ఉద్దేశపూర్వక దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలి అని సీపీం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు
అమరావతి, జూన్ 16(ఆంధ్రజ్యోతి): ‘బీజేపీ పాలనలో రాజ్యాంగ పునాదులపై ఉద్దేశపూర్వక దాడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో లౌకిక, ప్రజాస్వామ్యవాదులు అప్రమత్తం కావాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలను ఉధృతం చేయాలి’ అని సీపీం పొలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు పిలుపునిచ్చారు. విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల (వర్క్‌షాపు)ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘భారత్ నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించబోతోందంటూ ఊదరగొడుతున్న కేంద్ర పెద్దలు దేశంలో పెరుగుతున్న అసమానతలు, కార్మికులకు జీవనోపాధి, సంక్షోభం తదితర వాస్తవిక అంశాలను కూడా బయట పెట్టాలి. పాకిస్థాన్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో అమెరికా అధ్యక్షుడి పాత్రతో కాల్పుల విరమణ జరిగిందన్న విషయంపై వాస్తవాలు చెప్పేందుకు, ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించడానికి మోదీ సర్కార్ నిరాకరిస్తోంది. ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ప్రమాదకరమైన కేంద్ర విధానాలకు వంత పాడుతూ.. లౌకిక, ప్రజాస్వామ్య ఫెడరల్ వ్యవస్థలకు, రాష్ట్ర ప్రయోజనాలకు హాని చేస్తోంది’ అని విమర్శించారు. పొలిట్ బ్యూరో మరో సభ్యుడు యు.వాసుకి, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, కె.లోకనాథం తదితరులు పాల్గొన్నారు.