Public Interest Litigation: వైద్య కళాశాలల పీపీపీపై పిల్
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:35 AM
రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
అమరావతి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 10 మెడికల్ కాలేజీలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించి గతనెల 9న ప్రభుత్వం జారీ చేసిన జీవో 590ని రద్దు చేయాలని కోరుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి. గౌతమ్‌కుమార్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పీపీపీ విధానం అమలుతో కలిగే సామాజిక, ఆర్థిక, రాజ్యాంగపరమైన ప్రభావాలను సమగ్రంగా సమీక్షించి, ప్రజా సంప్రదింపులు జరిపేవరకు టెండర్, బిడ్డింగ్ ప్రక్రియలను నిలుపుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన 10 కళాశాలలతో పాటు రాష్ట్రంలో చేపట్టిన మొత్తం 17 వైద్య కాలేజీలను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ కళాశాలల్లో ఉన్న అన్ని సీట్లలో రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లు అమలు చేయాలని అభ్యర్థించారు. పేద, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో ఉండేలా ఏడాదికి గరిష్ఠ ఫీజు రూ.50 వేలకు మించకుండా పరిమితం చేయాలన్నారు. టెండర్ ప్రక్రియ, మార్కెట్ విలువకు విరుద్ధంగా వైద్య కళాశాలలకు భూముల బదిలీ, ప్రజాధనం దుర్వినియోగంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో కమిషన్‌ను ఏర్పాటు చేసి 6 నెలల్లో నివేదిక ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. వైద్య కళాశాలలపై విద్యార్థి సంఘాలు, వైద్య నిపుణులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు, భాగస్వాములు, పౌర సంఘాలతో సంప్రదింపులు జరిపేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని విన్నవించారు. జీవో 590 ఆధారంగా తదుపరి చర్యలు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, ఏపీఎంఎ్‌సఐడీసీ చైర్మన్, వీసీ, ఎండీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.