Share News

AP CM Chandrababu: ప్రజలు మెచ్చాలి

ABN , Publish Date - Dec 18 , 2025 | 04:02 AM

మీరు బాగా పనిచేశామని అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. మీ పనితీరును ప్రజలు మెచ్చడం లేదు.

AP CM Chandrababu: ప్రజలు మెచ్చాలి

  • నాకైనా అదే కొలమానం.. కలెక్టర్ల పనితీరుపై ‘సంతృప్తి’ లేదు

  • ఎక్కడో తేడా ఉన్నట్లుంది..చెక్‌ చేసుకోండి: సీఎం

  • పౌరులతో ప్రవర్తించే తీరు మారాల్సిందే

  • గ్రామంలో ప్రతి వర్గాన్నీ టచ్‌ చేయాలి

  • పెట్టుబడుల క్లియరెన్స్‌లో జాప్యం చేయొద్దు

  • మన విధానాలు చూసి రాష్ట్రానికొస్తున్నారు

  • అనుమతుల కోసం తిప్పించుకోవద్దు

  • ప్రెస్‌మీట్‌లు, సోషల్‌ మీడియాతోనే లక్ష్యాలు సాధించలేరు

  • చేతల్లో ప్రభుత్వంపై నమ్మకం తీసుకు రండి

  • జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం

ఏదైనా విషయంలో ఒక రాష్ట్రం మనకంటే బాగా చేసిందంటే అప్‌సెట్‌ అవుతాను. మనం ఎలా మిస్‌ అయ్యామనేది సమీక్షించుకుంటా. తిరిగి పురోగతి సాధించేవరకూ విశ్రమించను. ఇదీ నా స్వభావం. మీరు కూడా అలాంటి విధానం పెట్టుకోండి. సమష్టిగా పనిచేసి ఉత్తమ విధానం సృష్టిద్దాం.

దేశంలో ఆర్థిక సంస్కరణలు వచ్చాకే మనుషుల ఆలోచనా విధానం మారింది. సంస్కరణలు రాకముందు ప్రతి ఒక్కరూ సిద్ధాంతాలు మాట్లాడారు. కానీ అవి మనుషులకు తిండిపెట్టవు. సిద్ధాంతాలు, విలువలు వేర్వేరు. మెరుగైన జీవన ప్రమాణాలు అందాలంటే రోడ్లు, విద్యుత్‌, విద్యా సౌకర్యాలు బాగుండాలి.

- సీఎం చంద్రబాబు

అమరావతి, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘మీరు బాగా పనిచేశామని అనుకుంటున్నారు. నేను కూడా అదే అనుకుంటున్నా. కానీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదు. మీ పనితీరును ప్రజలు మెచ్చడం లేదు. ఏ ప్రజల కోసం మీరు పనిచేస్తున్నారో...వారే మిమ్మల్ని మెచ్చుకోవడం లేదంటే ఎక్కడో ఏదో తేడా ఉంది. అదేమిటో గుర్తించండి. లోపాలు సరిదిద్దుకొని, జాగ్రత్తగా పనిచేయండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లకు హితబోధ చేశారు. తన సహజశైలికి విరుద్ధంగా కలెక్టర్ల పనితీరుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన అనేక సమస్యలను పరిష్కరించుకుంటూనే ఒక వైపు ప్రజలకు సంక్షేమం అందిస్తున్నాం. మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం. కానీ కలెక్టర్ల పనితీరుపై ప్రజల్లో ఆశించిన స్పందన లేదు.’’ అంటూ స్పష్టమైన గణాంకాలు వినిపించారు. బుధవారం సచివాలయంలో మొదలైన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ కలెక్టర్లు, ఇతర అధికారులపై పల్లెత్తు మాట అనని, వారిపై మాట పడనివ్వని చంద్రబాబు, దానికి భిన్నంగా తొలిసారి వారి విషయంలో వాస్తవిక పరిస్థితి ఏమిటనేది స్పష్టం చేశారు. కలెక్టర్ల పనితీరు, జిల్లాల్లో ప్రజా సంతృప్తి స్థాయి, సంక్షేమ పథకాల అమలు, ఇంకా పరిపాలన, ఈ-ఫైల్‌ విధానం, రెవెన్యూ అంశాలపై సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం ఏమన్నారనేది...ఆయన మాటల్లోనే...


సంతృప్తి స్థాయే ముఖ్యం...

‘‘సుస్థిర అభివృద్ధి సాధన కోసం జరిగే పాలనలో ప్రజల సంతృప్తి స్థాయే ముఖ్యం. కానీ ప్రజా సంతృప్తితో సంబంధం లేకుండా మనం పనిచేస్తున్నాం. అందుకే నాతో సహా అందరం మనం చేసే పని వల్ల ప్రజలు మనతో కలిసి వస్తున్నారా, లేదా లేనేది చూడాలి. మీ జిల్లా, గ్రామీణ డేటా అంతా మీకు అందుబాటులో ఉంది. ఎక్కడ ఏ సమస్య ఉందో తెలుసుకోవడం చాలా సులభం. హార్డ్‌ వర్క్‌ కాదు..స్మార్ట్‌ వర్క్‌ చేసి ప్రజలను మెప్పించాలి.’’

క్లియరెన్స్‌ల్లో మీ స్పీడ్‌ చూస్తా..

‘‘కూటమి ప్రభుత్వంపై విశ్వాసం, నమ్మకంతో రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయు. వేగంగా ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం. కానీ వాటికి అవసరమైన క్లియరెన్స్‌లన్నీ ఆలస్యమవుతున్నాయి. ప్రాజెక్టుల కోసం కొంతమంది తిరిగీ తిరిగీ మానేస్తున్నారు. ఇకపై ఏ కలెక్టరు ఏ ప్రాజెక్టును ఎంత స్పీడ్‌గా తీసుకెళ్లారో చూస్తా. పెట్టుబడులను పెట్టేవారిని తక్కువగా చూడటం సరికాదు. ఏ రాష్ట్రానికీ రాని పెట్టుబడులు ఇక్కడకు వస్తున్నాయంటే మన విధానాలే అందుకు కారణం కలెక్టర్లుగా మీరు బాగా పనిచేస్తే అది ఆచరణలో కనిపించాలి. అది ప్రజలకు స్పష్టంగా, ప్రభావవంతంగా కనిపించాలి. అలా కాకుండా ఏదో పనిచేశామని 4 సార్లు ప్రెస్‌ మీట్‌లు పెట్టి చెప్పడం వల్ల ఏం ఉపయోగం? ఇది నాకు కూడా వర్తిస్తుంది. నేను ఇప్పుడు మాట్లాడినదానిపై తర్వాత రివ్యూ చేసుకుంటా. ప్రతి నిమిషం చెక్‌ చేసుకుంటా. మీరు కూడా పనిచేసిన తర్వాత ఆ ఫలితం ఎలా ఉంది....ప్రజలకు చేరిందా, లేదా.. అనేది సమీక్ష చేసుకోండి.’’


ప్రభుత్వానికి పేరు తీసుకురావాలి..

‘‘జిల్లాల్లో సానుకూల వాతావరణం ఏర్పడాలంటే అది కలెక్టర్లపైనే ఆధారపడి ఉంటుంది. మంత్రులు ప్లానింగ్‌ బోర్డు చైర్మన్‌లుగా, రాజకీయ పెద్దలుగా (పొలిటికల్‌ హెడ్‌) ఉంటారు. ప్రభుత్వ పనితీరు, ఫలితాలు మంత్రి ద్వారానే జిల్లాలోని ప్రజలకు చేరాలి. బెస్ట్‌ కలెక్టర్‌గా మీరుండాలి. అలాగే ప్రభుత్వానికి పేరు రావాలి. ఈ రెండూ జరగాలి. లేదంటే, మీరు బాగా పనిచేయవచ్చుగానీ, దానివల్ల ఫలితం ఉండదు. ఓ కంప్యూటర్‌ చిప్‌లా ఆలోచించాలి. ఒకప్పుడు ఆంధ్ర అంటే రైటాఫ్‌. ఇప్పుడు ఏపీ అంటే... ‘అక్కడ అభివృద్ధి జరుగుతోంది... గూగుల్‌ వచ్చింది... పరిపాలన బాగుంది... సీఐఐ సమ్మిట్‌ బాగా జరిగింది... ఇప్పుడిప్పుడే ఓ ప్రభావం కనిపిస్తోంది..’ అని అనుకుంటున్నారు. ఏపీ గురించి దేశమంతా మాట్లాడుకోవాలి. ప్రపంచం అంతా మనవైపు చూసే పరిస్థితి రావాలి. ఏపీలో ఏఐ ఉంది. డేటా సెంటర్లు వస్తున్నాయి. క్వాంటమ్‌ కంప్యూటర్‌, వాటి ఉత్పత్తి వస్తోంది. స్పేస్‌, డ్రోన్‌, ఎలకా్ట్రనిక్‌, ఏరో స్పేస్‌ సిటీలు, సెమీకండక్టర్‌ లు వస్తున్నాయి. ప్రపంచంలో డేటాలేక్‌ పెట్టి సమాచారాన్ని ఒక్క ఏపీలోనే ఇంటిగ్రేట్‌ చేయడం జరుగుతోంది.’’

రోడ్‌ బ్లాకర్‌గా మారొద్దు

‘‘అభివృద్ధికి అడ్డుగా ఉన్న రోడ్‌ బ్లాక్‌లను క్లియర్‌ చేస్తున్నాం. కానీ మీరే రోడ్‌బ్లాక్‌గా తయారు కావొద్దు. సానుకూల దృక్పఽథాన్ని అలవాటు చేసుకోండి. ప్రభుత్వంలో నేను, పవన్‌ కల్యాణ్‌, బీజేపీ వ్యక్తిగత ఇష్టాయిష్టాల కంటే పనితీరుతో కూడిన పరిపాలనకే ప్రాధాన్యం ఇస్తాం. మాకు రాగద్వేషాలు లేవు. పారదర్శకత కోసమే కలెక్టర్ల సదస్సును లైవ్‌ ఇస్తున్నాం. ఇది జిల్లా యంత్రాంగం చూడాలని ఆన్‌లైన్‌లోకి తీసుకున్నాం. రహస్యంగా మీ 26 మందితో మాట్లాడి, మేం 100 మందిమి మిమ్మల్ని ఒత్తిడి చేసే బదులు, పారదర్శకంగా ఉండాలనే లైవ్‌ ఇస్తున్నాం. వచ్చే జనవరి నుంచి ప్రభుత్వంలో ఫైళ్లన్నీ ఆన్‌లైన్‌ పరిధిలోకి వస్తాయి. రాబోయేది డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే విధానం. దాని ఆధారంగానే కీలక నిర్ణయాలు ఉంటాయి.’’


నమ్మకం చేతలతోనే వస్తుంది

‘‘ప్రభుత్వంపై నమ్మకం మాటలతో కాదు, చేతలతోనే వస్తుంది. ఒక వ్యక్తి లేదా కంపెనీ, ప్రభుత్వానికి విశ్వసనీయత ఉంటుంది. దీంతో కాలానుగుణంగా ఓ నమ్మకం వస్తుంది. దాన్ని మనం నెలకొల్పాలి. ఇన్ని పెట్టుబడులు వచ్చాయంటే అది మనపై ఉన్న విశ్వాసంతోనే సాధ్యం అయింది. నమ్మకాన్ని పెంచుకోవాలంటే రైట్‌వర్క్‌ చేయాలి. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం లేదు.’’

మంత్రులు, కలెక్టర్లకు ఇదే గీటురాయి

‘‘మీ జిల్లాలో ప్రజా సంతృప్తి స్థాయిని చూస్తే మంత్రులుగా మీ నాయకత్వం ఎలా ఉందో తెలిసిపోతుంది. రాష్ట్రంలో అత్యధిక సంతృప్తిస్థాయి పింఛన్‌లపైనే ఉంది. 92ుగా నమోదైంది. కలెక్టరుగా ప్రతి వర్గం ప్రజలను, గ్రామాన్ని టచ్‌ చేయాలి. ప్రభుత్వానికి కావాల్సింది ఫలితాలు. ఈ విషయం అండర్‌లైన్‌ చేసుకోవాలి. జిల్లాలో పౌరుల సంతృప్తి స్థాయినే కలెక్టర్‌ పనితీరుకు కొలమానంగా ఉంటుంది. మిగతావేవి కావు.’’

Updated Date - Dec 18 , 2025 | 06:41 AM