వంశీని వెంటాడుతున్న పీటీ వారెంట్లు
ABN , Publish Date - May 19 , 2025 | 01:07 AM
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను పీటీ వారెంట్లు వెంటాడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ మంజూరవుతుందనే సరికి మరో కొత్త కేసు చుట్టుకుంటోంది. బెయిల్ వస్తుందని ఆశలు రేకెత్తే సమయానికి పోలీసులు పీటీ వారెంట్లను పైకి తీస్తున్నారు. ఇప్పటికే వివిధ కేసుల్లో అరెస్టయిన వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
ఒక కేసులో బెయిల్ వచ్చే లోగా మరో కేసు రెడీ
తాజాగా తెరపైకి అక్రమ మైనింగ్ కేసు పీటీ వారెంట్
త్వరలో కోర్టులో దాఖలు చేసే అవకాశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌ను పీటీ వారెంట్లు వెంటాడుతున్నాయి. ఒక కేసులో బెయిల్ మంజూరవుతుందనే సరికి మరో కొత్త కేసు చుట్టుకుంటోంది. బెయిల్ వస్తుందని ఆశలు రేకెత్తే సమయానికి పోలీసులు పీటీ వారెంట్లను పైకి తీస్తున్నారు. ఇప్పటికే వివిధ కేసుల్లో అరెస్టయిన వంశీ విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ముదునూరి సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చే సమయానికి నకిలీ ఇళ్లపట్టాల కేసు చుట్టుకుంది. ఆ తర్వాత వెంటనే గన్నవరం, బాపులపాడు మండలాల్లో జరిగిన అక్రమ మైనింగ్ కేసు సిద్ధమైంది. గన్నవరంలో వంశీ బినామీ పేర్లతో అనుమతులు తీసుకుని అక్రమ మైనింగ్ చేశారని, తద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.195కోట్ల నష్టం వాటిల్లిందని భూగర్భ గనుల శాఖ అధికారులు గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరుస కేసులతో వంశీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆరు కేసుల్లో విచారణ ఎదుర్కొంటున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా వంశీ అడ్డగోలుగా వ్యవహరించారు. చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగతంగా దూషణలు చేయడంతో పాటు గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేయించడం, ఆ కేసు నుంచి తప్పుకునేందుకు ఫిర్యాదుదారుడిగా ఉన్న సత్యవర్ధనను కిడ్నాప్ చేసిన ఘటనలపై కేసులు నమోదయ్యాయి. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ 71వ నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు నుంచి బయటపడేందుకు వంశీ అత్యుత్సాహం చూపారు. ఫిర్యాదుదారుడు సత్యవర్థనను బెదిరించి కేసును ఉపసంహరించుకునేలా చేశారు. ఈ కేసులో వంశీ ఇరుక్కుపోయారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు. ఈ కేసులో అరెస్టయిన వంశీకి బయటకు వచ్చే దారులు మూసుకుపోతున్నాయి.
తెరపైకి వస్తున్న పెండింగ్ కేసులు
ఆ తర్వాత నుంచి పెండింగ్‌లో ఉన్న అన్ని కేసుల్లోనూ పీటీ వారెంట్లను సిద్ధం చేశారు. గన్నవరంలో హైకోర్టు న్యాయవాది స్థలాన్ని కబ్జా చేసిన కేసులో కొద్దిరోజుల క్రితమే బెయిల్ మంజూరైంది. తర్వాత తాజాగా టీడీపీ కార్యాయలంపై దాడి కేసు, సత్యవర్థన్ కిడ్నాప్ కేసుల్లో బెయిల్ వచ్చింది. ఒక్కో కేసులో బెయిల్ వస్తున్నా బయటకు వచ్చే అవకాశం కనిపించడం లేదు. వంశీపై ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న కేసులన్నీ ఇప్పుడు పైకి వస్తున్నాయి. బాపులపాడు మండలంలో నకిలీ పట్టాలతో ప్రజలను మోసం చేశారంటూ నమోదైన కేసులో ఆయన రిమాండ్ ఖైదీ అయ్యారు. ఈ కేసులో ఆయన నూజివీడు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కేసులో పీటీ వారెంట్‌ను గన్నవరం పోలీసులు సిద్ధం చేస్తున్నారు. ఈ పీటీ వారెంట్‌ను గన్నవరం కోర్టులో దాఖలు చేస్తారా, విజయవాడ ఏసీబీ కోర్టులో దాఖలు చేస్తారా అన్న విషయంలో సందిగ్ధత ఉంది. అక్రమ మైనింగ్‌పై ఇప్పటికే విజిలెన్స్ అధికారులు నివేదికను రూపొందించారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిన కేసు కాబట్టి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలోనే పీటీ వారెంట్ దాఖలయ్యే సూచనలు ఉన్నాయి.