Share News

Vijayawada: డ్రగ్స్‌ కేసులో కొండారెడ్డిపై పీటీ వారెంట్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:06 AM

డ్రగ్స్‌ కేసులో వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిపై పీటీ వారెంట్‌కు విజయవాడ ఎంఎ్‌సజే(మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి) కోర్టు అనుమతి ఇచ్చింది.

Vijayawada: డ్రగ్స్‌ కేసులో కొండారెడ్డిపై పీటీ వారెంట్‌

  • విశాఖ నుంచి బెజవాడకు తీసుకురానున్న పోలీసులు

విజయవాడ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్‌ కేసులో వైసీపీ విద్యార్థి విభాగం నేత కొండారెడ్డిపై పీటీ వారెంట్‌కు విజయవాడ ఎంఎ్‌సజే(మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి) కోర్టు అనుమతి ఇచ్చింది. న్యాయాధికారి ఎ.సత్యానంద్‌ మంగళవారం ఈ ఆదేశాలు ఇచ్చారు. వైజాగ్‌కు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆర్జా శ్రీవాత్సవ్‌, ఆయన ప్రియురాలు హవీలా డిలైట్‌ ఆగస్టులో బెంగళూరు నుంచి ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో ఎండీఎంఏ, ఎల్‌ఎ్‌సడీ డ్రగ్‌ను తరలిస్తూ విజయవాడ మహానాడు కూడలిలో ఈగల్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలకు పట్టుబడ్డారు. వారికి డ్రగ్స్‌ను సరఫరా చేసిన చిత్తూరు జిల్లాకు చెందిన మల్లెల మధుసూదనరెడ్డి(మడ్డీ)ని కొద్దిరోజుల క్రితం మాచవరం పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. అతడితోపాటు రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైజాగ్‌కు చెందిన జోగా లోహిత్‌ యాదవ్‌ను పోలీసులు విచారించగా వైజాగ్‌లో వైసీపీ విద్యార్థి విభాగం నేతగా వ్యవహరిస్తున్న కొండారెడ్డి పేరు వెలుగులోకి వచ్చింది. కొండారెడ్డి ప్రస్తుతం విశాఖ పోలీసులకు డ్రగ్స్‌తో చిక్కి జైల్లో ఉన్నాడు. అతడిని బెజవాడ కోర్టులో హాజరుపరిచేందుకు రెండు రోజుల్లో వైజాగ్‌ నుంచి పీటీ వారెంట్‌పై తీసుకురానున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 06:07 AM