AP Govt: బనకచర్లపై ఆచితూచి
ABN , Publish Date - Sep 07 , 2025 | 04:33 AM
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆచితూచి ముం దుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దూకుడుగా కాకుండా, వివాదాలకు తావివ్వకుండా ప్రాజెక్టు పూర్తిచేసే మార్గాలపై అన్వేషణ సాగిస్తోంది.
హడావుడి పడొద్దని ప్రభుత్వ యోచన
వివాదాలకు చోటివ్వకుండా ముందుకు
కేంద్ర కమిటీకి సభ్యుల పేర్లు పంపని వైనం
ఈలోపు చిన్న ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి
10 వేల కోట్ల ఖర్చుతో భారీగా జలఫలాలు
వాటికి ప్రాధాన్యమివ్వాలంటున్న నిపుణులు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఆచితూచి ముం దుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దూకుడుగా కాకుండా, వివాదాలకు తావివ్వకుండా ప్రాజెక్టు పూర్తిచేసే మార్గాలపై అన్వేషణ సాగిస్తోంది. ‘బనకచర్ల’ ప్రాజెక్టు తెలంగాణలో రాజకీయ అంశంగా మారిన సంగతి తెలిసిందే. గోదావరి నుంచి వందల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిసిపోతున్నాయని... అందులో నుంచి ఏటా 200 టీఎంసీలను మళ్లించేలా ‘పోలవరం-బనకచర్ల’ అనుసంధానం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ... దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అక్కడి ప్రభుత్వంతోపాటు విపక్షాలకూ ఇది ఒక అస్త్రంగా మారింది. బనకచర్లతోపాటు గోదావరి, కృష్ణా ప్రాజెక్టులపై సమీక్షకు ఏర్పాటుచేయాలనుకుంటున్న కేంద్ర కమిటీకి సభ్యులను ప్రతిపాదించాలంటూ కేంద్ర జలశక్తి శాఖ రాసిన లేఖపై తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. ఆ ప్రాజెక్టు తమకు అసలు ఆమోదయోగ్యం కాదని... అందువల్ల సభ్యులను ప్రతిపాదించే ఆస్కారం లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైతం ఈ విషయంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. సభ్యుల పేర్లను పంపించే ప్రతిపాదనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. సమీక్ష కోసం సభ్యుల పేర్లు పంపాలని గత నెల 12వ తేదీన కేంద్ర జలశక్తి శాఖ సంయుక్త కార్యదర్శి ప్రదీ్‌పకుమార్ అగర్వాల్ ఉభయ రాష్ట్రాలకూ లేఖ రాశారు. ఈ లేఖ రావడానికి ముందే.. రాష్ట్రప్రభుత్వం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్, సలహాదారు ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తిలను ఎంపిక చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో... కమిటీకి పేర్లను పంపించే అంశాన్ని పక్కనపెట్టింది.
‘పెండింగ్’ పని పడదాం...
బనకచర్ల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.81 వేల కోట్లు! ఎన్నేళ్లకు పూర్తవుతుందో తెలియని ఈ ప్రాజెక్టును చేపట్టడంకంటే... ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. ‘బనకచర్ల వరమా... భారమా’ శీర్షికన ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ ఒక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. రూ.పది వేల కోట్లలోపు వ్యయం చేస్తే రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని నిపుణులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో... బనకచర్లపై అన్ని వివాదాలు కొలిక్కి వచ్చేలోగా పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ద్వారా శ్రీశైలం జలాశయం నుంచి 738 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో ఇటీవలే కృష్ణా జలాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎగువ నుంచి శ్రీశైలం జలాశయానికి వరద నీరు చేరుతుండడం.. అందులో కొంత పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్.. మల్యాల ఎత్తిపోతల గుండా కాలువలకు విడుదల చేస్తుండడంతో చెరువులు నిండుతున్నాయి. దీంతో కరువు పీడిత రాయలసీమలో హర్షం వ్యక్తమవుతోంది. చంద్రబాబు గత ఏడాది సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రూ.3,850 కోట్లతో హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులు పూర్తిచేసి సీమకు.. కుప్పం నియోజకవర్గం వరకు వరద నీటిని తరలించారు. దశాబ్దాల కలను నెరవేర్చారు. ఈ నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేస్తే అందే జల ఫలాలపై సర్కారులో ఆలోచన మొదలైంది. వరదల సమయంలో చెరువులన్నింటినీ నింపగలిగితే.. వర్షాభావ సమయంలో తాగు, సాగుకు పుష్కలంగా జలాలు అందుబాటులో ఉంటాయని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడ్రోజుల్లో సాగునీటి యాజమాన్య సంఘాలు, జల వనరుల శాఖ అధికారులతో సమావేశం కావాలని భావిస్తున్నారు.