పోటాపోటీగా నిరసనలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 12:33 AM
వైసీపీ, టీడీపీ శ్రేణులు పోటాపోటీ నిరసనలతో గురువారం బందరు హోరెత్తింది. పోలీస్ అధికారులు అంతా హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటనలో ఉండగా, వైసీపీ మహిళా నేతలు మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో చీపుర్లతో నిరసన ప్రదర్శన చేశారు. మంత్రి చిత్రపటాలను నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ విమర్శలు చేశారు. ప్రతిగా తెలుగు మహిళలు పేర్ని నాని ఇంటి సమీపంలో నిరసన ప్రదర్శన చేసి, పేర్ని దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు పార్టీలను అదుపు చేశారు.
- బందరులో రోడ్డెక్కిన వైసీపీ, టీడీపీ శ్రేణులు
- మంత్రి రవీంద్ర ఇంటి సమీపంలో చీపుర్లతో వైసీపీ మహిళల ఆందోళన
- కొల్లు చిత్రపటాలు కిందపడేసి కాళ్లతో తొక్కుతూ వ్యతిరేక నినాదాలు
- ప్రతిగా స్పందించి రోడ్డుపైకి వచ్చిన తెలుగు మహిళలు
- పేర్ని ఇంటి సమీపంలో నాని దిష్టిబొమ్మ దహనం
- వారం రోజులుగా కొనసాగుతున్న ఇరుపార్టీల మాటల యుద్ధం
వైసీపీ, టీడీపీ శ్రేణులు పోటాపోటీ నిరసనలతో గురువారం బందరు హోరెత్తింది. పోలీస్ అధికారులు అంతా హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటనలో ఉండగా, వైసీపీ మహిళా నేతలు మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి సమీపంలో చీపుర్లతో నిరసన ప్రదర్శన చేశారు. మంత్రి చిత్రపటాలను నేలపై వేసి కాళ్లతో తొక్కుతూ విమర్శలు చేశారు. ప్రతిగా తెలుగు మహిళలు పేర్ని నాని ఇంటి సమీపంలో నిరసన ప్రదర్శన చేసి, పేర్ని దిష్టిబొమ్మను దహనం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు పార్టీలను అదుపు చేశారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:
జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం రోజురోజుకు తీవ్ర మవుతోంది. అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యమ్రాలను ప్రజలకు వివరిస్తుంటే, దీనికి పోటీగా వైసీపీ ఆధ్వర్యంలో ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారెంటీ’ పేరుతో నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా వ్యవహరి స్తున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని ఓ అడుగు ముందుకేసి కూటమి అధినాయకులపై, జిల్లాకు చెందిన మంత్రి కొల్లు రవీంద్ర, శాసన సభ్యులపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో మచిలీపట్నానికి చెందిన మంత్రి రవీంద్ర, మాజీ మంత్రి పేర్ని మధ్య వారం రోజులుగా మాటల యుద్ధం నడుస్తోంది.
పామర్రులో ప్రారంభమైన గొడవ..
పామర్రు నియోజకవర్గంలో జరిగిన వైసీపీ నియోజకవర్గస్థాయి సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని రప్పా రప్పా అనడం కాదు, కనుసైగ చేస్తే చీకట్లో పని అయిపోవాలి అంటూ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన పేర్ని నానిపై టీడీపీ నాయకులు మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్‌లలో ఫిర్యాదులు చేశారు. గుడివాడలో జరిగిన వైసీపీ సమావేశానికి వెళుతున్న జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆమె భర్త రామును టీడీపీ నాయకులు అడ్డగించడంతో పరుష పదజాలంతో దూషించి, కారు అద్దాలు పగలకొట్టారని విస్తృతంగా ప్రచారం చేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన జెడ్పీ చైర్‌పర్సన్‌ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు దుర్బాషలాడారని, ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారానికి వాడుకోవాలని మాజీ మంత్రి పేర్ని నాని పార్టీ అధిష్టానంతో ఫోన్‌లో మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. దీంతో వైసీపీ నాయకులు తమ కేడర్‌ను కాపాడుకునేందుకే ఈ తరహా ప్రయోగాలు చేస్తున్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. పెడన నియోజకవర్గంలో జరిగిన వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, కొల్లు రవీంద్రలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌పై టీడీపీ నాయకులు దాడి చేసి, కారు అద్దాలు పగలకొట్టారని చెప్పారు. దీంతో ఈ అంశం మరింత రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్టంలో వైసీపీకి చెందిన జిల్లా పరిషత చైర్మన్‌లు కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్‌ను కలిసి తమ సంఘీభావం తెలిపారు.
మచిలీపట్నంలో దిష్టిబొమ్మల దహనం, చీపుర్లతో నిరసనలు
కూటమి నాయకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పేర్ని నాని దిష్టిబొమ్మను మూడు రోజుల క్రితం చల్లపల్లిలో దహనం చేశారు. మచిలీపట్నంలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో బుధవారం చీపుర్లు చేతపట్టి పేర్ని నాని ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో రామానాయుడుపేట సెంటర్‌లో చీపుర్లతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. హోంమంత్రి వంగలపూడి అనిత మచిలీపట్నంలో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు రావడంతో పోలీస్ అధికారులంతా ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. ఇదే అదనుగా భావించిన వైసీపీ మహిళా విభాగం నేతలు, మేయర్‌లు, డెప్యూటీ మేయర్‌లు మంత్రి కొల్లు రవీంద్ర నివాసానికి సమీపంలోని జవ్వారుపేట సెంటరుకు చీపుర్లు చేతపట్టి వెళ్లి మంత్రి కొల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి ఫొటోలను కిందపడవేసి కాళ్లతో తొక్కారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇదిలా ఉంటే గురువారం సాయంత్రం తెలుగు మహిళలు, టీడీపీ నాయకులు మూకుమ్మడిగా తరలివచ్చి పేర్ని నాని ఇంటి సమీపంలోని రామా నాయుడుపేట సెంటరులో పేర్ని దిష్టిబొమ్మను దహనం చేశారు. రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలతో మచిలీపట్నంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోననే చర్చ నడుస్తోంది. ఇప్పట్లో ఎన్నికలు లేకున్నా, టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం ఒకవైపు, మరోవైపు నిరసన ప్రదర్శనలు జరుగుతుండటంతో పోలీసులకు సవాల్‌గా మారింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని మచిలీపట్నం నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులు తమదైన శైలిలో వ్యవహరించి మచిలీపట్నంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.