Share News

Kolusu Parthasarathy: పేదలకు రుణాలిస్తే ఎగ్గొడతారన్న బ్యాంక్‌ల ముందు ధర్నా చేయండి

ABN , Publish Date - Sep 29 , 2025 | 03:32 AM

పరిశ్రమల పేరుతో రూ.వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టినా ఏమీ చేయని బ్యాంకులు.. పేదవాళ్లు ఇంటికోసమో, పిల్లల వివాహాల కోసమో, చిన్నపాటి వ్యాపారాల కోసమో రుణం అడిగితే ఎగ్గొడతారని...

Kolusu Parthasarathy: పేదలకు రుణాలిస్తే ఎగ్గొడతారన్న బ్యాంక్‌ల ముందు ధర్నా చేయండి

  • ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు, లోకేశ్‌ కృషి

  • మంత్రి కొలుసు పార్ధసారథి వెల్లడి

పిడుగురాళ్ల, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): పరిశ్రమల పేరుతో రూ.వేల కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టినా ఏమీ చేయని బ్యాంకులు.. పేదవాళ్లు ఇంటికోసమో, పిల్లల వివాహాల కోసమో, చిన్నపాటి వ్యాపారాల కోసమో రుణం అడిగితే ఎగ్గొడతారని చెబుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి కొలుసు పార్ధసారథి అన్నారు. అలాంటి బ్యాంకుల ముందు ధర్నాలు చేయాలని పేదలకు సూచించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో ఆదివారం జరిగిన ‘అనుగురాజు యాదవ్‌’ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీవనాధారం కోసంగొర్రెలు కొనుగోలు చేసుకోవాలనుకునే వారికి రుణాలిచ్చేందుకు కొన్ని బ్యాంక్‌లు సవాలక్ష కొర్రీలు వేస్తున్నాయని విమర్శించారు. అదే సమయంలో పారిశ్రామిక వేత్తలకు రూ.వేల కోట్ల అప్పులు ఇస్తున్నాయని తెలిపారు. వీటిని తీసుకున్నవారు తర్వాత కాలంలో ఎగ్గొట్టినా బ్యాంకులు ఏమీ చేయలేవన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనకు తగ్గట్టుగా బీసీ యువత ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని సూచించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకు చంద్రబాబు, లోకేశ్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. పిల్లలను బాగా చదివించి ఉన్నత స్థితికి తీసుకొచ్చేందుకు యాదవ సామాజికవర్గం పెద్దలు తోడ్పాటునందిస్తారన్నారు. ఈ సమావేశంలో గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు సభ్యుడు జంగా కృష్ణమూర్తి, చీరాల ఎమ్మెల్యే కొండయ్య యాదవ్‌, పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్‌ నూకసాని బాలాజీ యాదవ్‌, రాష్ట్ర యాదవ సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ గోళ్ల నరసింహులు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2025 | 03:33 AM