Share News

DNA Evidence: అమరావతిలో ఎన్‌ఎఫ్ఎస్‌యూ

ABN , Publish Date - Dec 10 , 2025 | 05:30 AM

తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండాలో వేలాది మంది జనం మధ్యలో ఉన్న ఓ వ్యక్తిని దుండగుడు కాల్చి చంపాడు. రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో తనను ఎవరూ గుర్తుపట్టలేరన్న ధీమాతో తాపీగా ఇంటికి వెళ్లిపోయాడు.

DNA Evidence: అమరావతిలో ఎన్‌ఎఫ్ఎస్‌యూ

  • సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు ఇచ్చాం

  • భూములు అప్పగిస్తే వెంటనే కార్యకలాపాలు

  • కీలక కేసుల్లో దర్యాప్తు సంస్థలకు సహకారం: వీసీ వ్యాస్‌

(అహ్మదాబాద్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండాలో వేలాది మంది జనం మధ్యలో ఉన్న ఓ వ్యక్తిని దుండగుడు కాల్చి చంపాడు. రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో తనను ఎవరూ గుర్తుపట్టలేరన్న ధీమాతో తాపీగా ఇంటికి వెళ్లిపోయాడు. హంతకుడి ఆచూకీ కనిపెట్టడంలో విఫలమైన ఉగాండా పోలీసులు నేషనల్‌ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ యూనివర్సిటీ (ఎన్‌ఎఫ్ఎస్‌యూ)ను సంప్రదించారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న వర్సిటీ అధికారులు.. ఘటన జరిగిన ప్రాంతంతో పాటు చుట్టుపక్కల పరిసరాల్లోని సీసీ టీవీ ఫుటేజీలను పలుమార్లు విశ్లేషించి, అనుమానితుల జాబితాను సిద్ధం చేశారు. వారిలో ఎరుపు రంగు దుస్తులు ధరించిన ఓ వ్యక్తి కదలికలు సందేహాస్పదంగా ఉండటంతో అతడిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. హత్య జరిగిన సమయంలో అతను ధరించిన దుస్తుల నుంచి సేకరించిన డీఎన్‌ఏను, నిందితుడి డీఎన్‌ఏతో పోల్చిచూడటం ద్వారా హంతకుడి ఆచూకీని గుర్తించారు. శ్రీనగర్‌, ఢిల్లీలో ఉగ్రవాదుల కాల్పుల కేసుల్లోనూ ఈ వర్సిటీ బృందాలు నిందితులను గుర్తించాయి. ఎన్‌ఎఫ్ఎసయూ సాధించిన విజయాల్లో ఇవి కొన్ని మాత్రమే. ఇటువంటి ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ త్వరలో ఏపీ రాజధాని అమరావతిలోనూ ఏర్పాటు కానుంది. దీనికి కేంద్ర హోంశాఖ ఇప్పటికే ఆమోదం తెలిపిందని వ్యవస్థాపక వైస్‌ చాన్సలర్‌ జేఎం వ్యాస్‌ చెప్పారు. గుజరాత్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వైజ్ఞానిక రంగం, విద్య తదితరాలపై అధ్యయనం చేసేందుకు ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) తరఫున అమరావతి నుంచి మీడియా ప్రతినిధుల బృందం అక్కడకు వెళ్లింది.


ఈ బృందం రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం గాంధీనగర్‌లోని ఎన్‌ఎఫ్ఎసయూను సందర్శించింది. ఈ సందర్భంగా బృందం ప్రతినిధులతో వర్సిటీ వీసీ వ్యాస్‌ మాట్లాడారు. అమరావతిలో జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీ ఏర్పాటకు సంబంధించి సీఎం చంద్రబాబుకు ప్రతిపాదనలు ఇచ్చామని చెప్పారు. శాశ్వతంగా భూములు కేటాయించేలోగా తాత్కాలికంగా తమకు భూములు అప్పగిస్తే వెంటనే కార్యకలాపాలు ప్రారంభిస్తామని వ్యాస్‌ స్పష్టం చేశారు. ‘‘ప్రధాని మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న సమయంలో 2008లో గాంధీనగర్‌ ఫోరెన్సిక్‌ వర్సిటీని ఏర్పాటు చేశారు. 11ఏళ్ల తర్వాత దీన్ని జాతీయ ఫోరెన్సిక్‌ సైన్సెస్‌ వర్సిటీగా మార్పు చేశారు. ఈ వర్సిటీ మాత్రం కేంద్ర హోంశాఖ నియంత్రణలో ఉంటుంది’’ అని వ్యాస్‌ తెలిపారు. ‘‘హత్యలు, బాంబు పేలుళ్ల ఘటనల్లో ఆధారాల సేకరణ, దర్యాప్తునకు మాత్రమే ఎన్‌ఎ్‌ఫఎ్‌సయూ పరిమితం కాలేదు.ప్రస్తుతం ఫోరెన్సిక్‌ విభాగంలో 72 కోర్సులు అందిస్తోంది’’ అని వీసీ వెల్లడించారు.

Updated Date - Dec 10 , 2025 | 05:32 AM