APSRTC Promotions: పదోన్నతుల ఫైలు కదిలేదెన్నడో
ABN , Publish Date - Oct 12 , 2025 | 06:10 AM
ప్రజా రవాణా శాఖ(పీటీడీ)లో పదోన్నతుల ఫైలుకు మోక్షం లభించడం లేదు. ఏపీఎస్ ఆర్టీసీలో కండక్టర్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకూ దాదాపు 3వేల మందికి పైగా ప్రమోషన్ల కోసం సుదీర్ఘ కాలం...
నిరీక్షణలో 3 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు
ఐదేళ్ల పాటు పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం
ఆగస్టులోనే ఆమోదించిన సీఎం చంద్రబాబు
దాటవేత ధోరణిలో ఆర్టీసీ ఉన్నతాధికారులు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ప్రజా రవాణా శాఖ(పీటీడీ)లో పదోన్నతుల ఫైలుకు మోక్షం లభించడం లేదు. ఏపీఎస్ ఆర్టీసీలో కండక్టర్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకూ దాదాపు 3వేల మందికి పైగా ప్రమోషన్ల కోసం సుదీర్ఘ కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. వీరి పదోన్నతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టులోనే పచ్చజెండా ఊపినా ఇంతవరకూ ఆ దిశగా అడుగు ముందుకు పడలేదు. ఎప్పటికప్పుడు ఫైళ్లు క్లియర్ చేయాలని సీఎం పదేపదే హెచ్చరిస్తున్నా ఆర్టీసీ ఉన్నతాధికారులు మాత్రం దాటవేత ధోరణి అవలంబిస్తున్నారని సిబ్బంది ఆరోపిస్తున్నారు. పదోన్నతుల ఫైలు ముందుకు కదలాలంటే తాము రోడ్డెక్కడం తప్ప మరో మార్గం కనిపించడం లేదని వాపోతున్నారు. నిత్యం 45లక్షల మందికి పైగా ప్రయాణికుల్ని 11వేలకు పైగా బస్సుల్లో గమ్యానికి చేరుస్తున్న ఆర్టీసీలో సుమారు 47వేల మంది వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వీరికి బోర్డు ఆమోదంతో ఎప్పటికప్పుడు పదోన్నతులు లభించేవి. అయితే 2020లో బస్సులు, ఆస్తులను ఆర్టీసీలో.. సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేశారు. అప్పటినుంచి కార్పొరేషన్ నిబంధనలు వర్తించబోవని, ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే పదోన్నతులు లభిస్తాయంటూ పదోన్నతుల కమిటీ(డీపీసీ) మెలిక పెట్టింది. పలుమార్లు మార్గదర్శకాలు సవరించి పంపినా వైసీపీ సర్కారు ఐదేళ్ల పాటు పట్టించుకోలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీ సిబ్బంది పదోన్నతులు త్వరగా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు మాటిచ్చారు. అందుకు అనుగుణంగా ఆర్టీసీ ఉన్నతాధికారులు పంపిన మెరిట్ రేటింగ్ రిపోర్టు(ప్రభుత్వ శాఖల్లో ఏసీఆర్)లకు ఒకటి, రెండు సవరణల తర్వాత ఎట్టకేలకు డీపీసీ ఆమోదం లభించింది. ఆ వెంటనే ప్రమోషన్ల ఫైలుపై సీఎం కూడా సంతకం చేశారు. దీంతో డిపో మేనేజర్ నుంచి ఈడీ వరకూ 110 మంది అధికారులతో సహా 3వేల మందికి పదోన్నతులు వచ్చేసినట్లేనని ఈయూ, ఎన్‌ఎంయూ, ఎస్‌డబ్ల్యూఎఫ్ తదితర అసోసియేషన్లు హర్షం వ్యక్తం చేశాయి. వినాయక చవితితో పాటు పదోన్నతుల శుభాకాంక్షలు కూడా సిబ్బంది తెలియజేసుకున్నారు. ఆ తర్వాత దసరా వెళ్లిపోయి త్వరలో దీపావళి కూడా వస్తోంది. వరుసగా పండుగలు అయితే వస్తున్నాయి.. పోతున్నాయి.. కానీ పదోన్నతుల జాబితాతో కూడిన జీవో మాత్రం వెలువడటం లేదని ఆర్టీసీ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇన్‌చార్జిలే దిక్కు
ఆసియాలోనే గొప్ప పేరు తెచ్చుకున్న ఏపీఎస్ ఆర్టీసీ పరిస్థితి అత్యంత దయనీయంగా తయారైంది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఎండీగా కొనసాగుతుంటే కీలకమైన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల పోస్టుల్లో అందరూ ఇన్‌చార్జిలే ఉన్నారు. విజయనగరం జోన్ ఈడీ కేఎస్‌బీ రెడ్డి మినహా ఇతర జోన్ల ఈడీలతో పాటు కీలకమైన అడ్మిన్, ఆపరేషన్స్, ఇంజనీరింగ్ విభాగాలకు ఇన్‌చార్జిలే దిక్కయ్యారు. రవాణా మంత్రి సొంత జిల్లా కడపతో పాటు నెల్లూరు, విజయవాడ ఈడీలదీ అదే పరిస్థితి. ఆర్టీసీ హెడ్ ఆఫీ్‌సలో చీఫ్ పర్సన్ మేనేజర్లు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్, చీఫ్ ఇంజనీర్లు, సీసీవోఎస్ ఇలా అంతటా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. విజయవాడ మినహా రీజినల్ మేనేజర్లందరూ ఇన్‌చార్జిలే. రాష్ట్రవ్యాప్తంగా 129 బస్ డిపోలు ఉంటే సుమారు 35చోట్ల డిపో మేనేజర్లుగా ఇన్‌చార్జిలు కొనసాగుతున్నారు. స్వయంగా రవాణా శాఖ మంత్రి సొంత నియోజకవర్గం రాయచోటి బస్ డిపో మేనేజర్ కూడా ఇన్‌చార్జే కావడం గమనార్హం. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయాలంటే తక్షణమే పదోన్నతులు కల్పించడంతో పాటు ఇన్‌చార్జిల స్థానంలో పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించి పనితీరుపై సమీక్షిస్తేనే పలితం ఉంటుందని ఆర్టీసీ హౌస్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.