ప్రగతి పరుగులు
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:10 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది. అసమాన వృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. తొలి అర్ధసంవత్సరంలోనే గతేడాది జీడీడీపీని దాటేసింది. రాష్ట్ర ఆర్థికవృద్ధిలో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తోంది. తలసరి ఆదాయం కూడా భారీగా పెరిగింది. నియోజకవర్గాల వారీగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో విశేష వృద్ధిని సాధించింది. ఈ ఏడాది సేవా రంగంలో ఎన్టీఆర్ జిల్లా దూసుకుపోతోంది. సేవా రంగాల్లో ఐటీ, కమ్యూనికేషన్స్, ఆతిథ్య రంగాలు ప్రధానంగా ఉన్నాయి. వీటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత వృద్ధి నమోదవుతుంది.
- అసమాన వృద్ధి దిశగా ఎన్టీఆర్ జిల్లా
- తొలి అర్ధ సంవత్సరంలోనే గతేడాది జీడీపీ దాటివేత
- ప్రస్తుత జీడీడీపీ రూ. 1,12,057 కోట్లుగా నమోదు
- రాష్ట్ర ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర!
- తలసరి ఆదాయం పెరుగుదల రూ.4,17,412
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా ఘనమైన ఆరంభాన్ని ఇచ్చింది. అసమాన వృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. తొలి అర్ధసంవత్సరంలోనే గతేడాది జీడీడీపీని దాటేసింది. రాష్ట్ర ఆర్థికవృద్ధిలో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు వేస్తోంది. తలసరి ఆదాయం కూడా భారీగా పెరిగింది. నియోజకవర్గాల వారీగా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో విశేష వృద్ధిని సాధించింది. ఈ ఏడాది సేవా రంగంలో ఎన్టీఆర్ జిల్లా దూసుకుపోతోంది. సేవా రంగాల్లో ఐటీ, కమ్యూనికేషన్స్, ఆతిథ్య రంగాలు ప్రధానంగా ఉన్నాయి. వీటి మీద ప్రత్యేక దృష్టి సారిస్తే మరింత వృద్ధి నమోదవుతుంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
స్థూల జిల్లా దేశీయ ఉత్పత్తి (జీడీడీపీ)లో ఎన్టీఆర్ జిల్లా దూసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన స్వర్ణాంధ్ర-2047 లక్ష్యాలలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా 2025- 26 ఆర్థిక సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించింది. జిల్లా స్థూల దేశీయ ఉత్పత్తి ప్రస్తుత నెలకు చూస్తే రూ. 1,12,057 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇదే జీడీడీపీ రూ.94,561 కోట్లుగా ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియటానికి ఇంకా చాలా నెలలు ఉంది. తొలి అర్ధ సంవత్సరం ముగియటానికి మరో రెండు నెలల సమయం ఉంది. రెండవ అర్ధ సంవత్సరం ఇంకా మిగిలే ఉంది. దీనిని బట్టి చూస్తే ఈ ఏడాది రాష్ట్ర వృద్ధిలో ఎన్టీఆర్ జిల్లా గణనీయమైన పాత్ర పోషించబోతున్నట్టు అర్థమవుతోంది. ఎన్టీఆర్ జిల్లా తలసరి ఆదాయం కూడా బాగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 4,17,412లుగా తలసరి ఆదాయం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం రూ. 3,53,150లు మాత్రమే ఉంది. ఈ వృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లటానికి వీలుగా నియోజకవర్గాల స్థాయిలో ప్రభుత్వం తరఫున చేపట్టవలసిన ప్రణాళికలను కూడా ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం రూపొందించింది. వ్యవసాయ, పరిశ్రమలు, సేవా రంగాలను బలోపేతం చేసే ప్రాజెక్టులను ప్రతిపాదిస్తోంది.
మూడు ప్రధాన రంగాల్లో వృద్ధి
వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో ఎన్టీఆర్ జిల్లా గణనీయంగా అభివృద్ది చెందింది. అన్ని రంగాల్లో కూడా స్థూల విలువ జోడింపు (జీవీఏ) పెరిగింది. వ్యవసాయ అనుబంధ రంగాల్లో రూ.12,632 కోట్లు వృద్ధి సాధించింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,895 కోట్లు జీవీఏ సాధించింది. పరిశ్రమల రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి రూ. 21,021 కోట్లు జీవీఏ సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.17,728 కోట్లు మాత్రమే జీవీఏ సాధించింది. సేవా రంగంలో ఈ ఆర్థిక సంవత్సరం అత్యధికంగా రూ.69,220 కోట్ల జీవీఏ సొంతం చేసుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.58,628 కోట్ల ఆదాయం సాధించింది. తొలి అర్ధసంవత్సరం లోపే మూడు ప్రధాన రంగాల్లో స్పష్టమైన వృద్ధిని సాధించింది.
నియోజకవర్గాల వారీగా ప్రగతి
జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల వారీగా సాధించిన వృద్ధి గణాంకాలను కూడా ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం సమర్పించింది. తిరువూరు నియోజకవర్గంలో వ్యవసాయ రంగంలో రూ.4,110 కోట్లు, పరిశ్రమల రంగంలో రూ.2,487 కోట్లు, సేవా రంగంలో రూ.4,705 కోట్ల జీవీఏ సాధించగా.. రూ.3,97,140 తలసరి ఆదాయాన్ని పొందింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వ్యవసాయ, పరిశ్రమలు, సేవా రంగాల్లో రూ.42 కోట్లు, రూ. 2,406 కోట్లు, రూ.16,979 కోట్లు ఆదాయం లభించగా, రూ.4,65,241 తలసరి ఆదాయం ఉంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వరుసగా రూ.141 కోట్లు, రూ.2,858 కోట్లు, రూ.13,809 కోట్ల జీవీఏ సాధించగా, రూ.3,98,657 తలసరి ఆదాయం ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో రూ.48 కోట్లు, రూ.2,817 కోట్లు, రూ.11,623 కోట్ల జీవీఏ సాధించగా.. రూ.4,73,803 తలసరి ఆదాయం ఉంది. మైలవరం నియోజకవర్గం పరిధిలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వరుసగా రూ.3,199 కోట్లు, రూ.4,135 కోట్లు, రూ.8211 కోట్లు జీవీఏ సాధించగా.. రూ.4,12,803 తలసరి ఆదాయం లభించింది. నందిగామ నియోజకవర్గంలో పై రంగాలలో వరుసగా రూ. 2,106 కోట్లు , రూ. 2,119 కోట్లు, రూ.4,720 కోట్లు జీవీఏ సాధించగా రూ. 3,43,328 తలసరి ఆదాయం సాధించింది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో పై మూడు రంగాలలో వరుసగా రూ. 2604 కోట్లు, రూ. 3324 కోట్లు, రూ.5545 కోట్లు జీవీఏ సాధించగా.. రూ. 3,75,099 ల తలసరి ఆదాయాన్ని సాధించటం జరిగింది.