Veligonda Project: వెలిగొండ పనుల్లో వేగం
ABN , Publish Date - Sep 24 , 2025 | 05:20 AM
ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.
రెండో సొరంగం లైనింగ్‌కు ఏర్పాట్లు
పెద్ద దోర్నాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం జీవనాడి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తిచేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సొరంగం అంతర్భాగంలో చేపట్టిన లైనింగ్‌పనుల్లో అక్కడక్కడా సమస్యలు ఎదురవుతున్నాయి. సొరంగం లోపలి దరి(లూజ్‌సాయిల్) పటిష్ఠంగా లేకపోవడంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎంతవరకు లూజ్ సాయిల్ ఉందో జియాలజిస్టులను రప్పించి పరిశీలించగా.. 125 మీటర్ల వరకు పటిష్ఠంగా లేనట్లు గుర్తించారు. ఈ పరిస్థితుల్లో నిర్మాణ పనులు ఏ విధంగా చేయాలో మార్గనిర్దేశం చేయాలని ఇంజనీరింగ్ అధికారులు.. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించారు. 300 మీటర్ల వరకు నిలిపివేసి.. లైనింగ్ పనులు ప్రారంభించారు. మరోవైపు.. రెండో సొరంగంలో పై పెచ్చులూడి పనులకు ఆటంకం ఏర్పడిందని, కార్మికులు ఆందోళనకు గురై పరుగులు తీశారని సోషల్ మీడియాలో మంగళవారం వైరల్ అయింది. దీనిపై వెలిగొండ ఈఈ కృష్ణారెడ్డి స్పందించారు. గత నెలలో సొరంగం అంతర్భాగంలో లైనింగ్ పనులు చేస్తుండగా 15.595 కిలోమీటరు వద్ద లూజ్ సాయిల్ ఉండడంతో పెచ్చులు ఊడిపడ్డాయని.. అది పనుల్లో భాగంగా జరిగిందని తెలిపారు. భయపడాల్సిన అవసరం లేదన్నారు.