Home Minister Anitha: శ్రీకాంత్‌కు పెరోల్‌పై దర్యాప్తు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:35 AM
నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చిన వారంలోనే రద్దు చేసి అతడ్ని జైలుకు పంపామని హోమంత్రి వంగలపూడి అనిత తెలిపారు.
దీని వెనుక ఎంతటి స్థాయి అధికారులు ఉన్నా చర్యలు
ఇలాంటి అసాంఘిక శక్తులను పెంచి పోషించిన జగన్
కూటమి ప్రభుత్వంలో వారి ఆటలు సాగవు:హోంమంత్రి అనిత
అమరావతి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): నెల్లూరు సెంట్రల్ జైలులో యావజ్జీవ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్‌కు పెరోల్ ఇచ్చిన వారంలోనే రద్దు చేసి అతడ్ని జైలుకు పంపామని హోమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంగళవారం అమరావతి సచివాలయంలో ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జైళ్ల శాఖపై సమీక్ష సందర్భంగా క్రిమినల్ రికార్డు ఉన్న శ్రీకాంత్‌కు పెరోల్ వచ్చిందన్న విషయాన్ని శాఖ సూపరింటెండెంట్ తన దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. అతనికి పెరోల్ ఇవ్వడానికి ఎవరు సహకరించారు, దీని వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ జరుగుతోందని తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాత ఇందులో ఎంత స్థాయి అధికారులు ఉన్నా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అనిత పేర్కొన్నారు. శ్రీకాంత్ ఎస్కార్ట్ సిబ్బందిపైనా చర్యలు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా అరుణ నేపథ్యంపైనా విచారణ జరుగుతోందన్నారు. నాలుగు రోజుల క్రితం హోంమంత్రి పేషీ నుంచి అంటూ ఆమె ఒక సీఐకి ఫోన్ చేసి బెదిరించిన అంశం తమ దృష్టికి వచ్చిందని, దానిపై కూడా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఆమెపై రెండు కేసులు ఉన్నాయని చెప్పారు. సిఫారసు చేసిన ఎమ్మెల్యేలు ఎవరని విలేకరులు ప్రశ్నించగా మంత్రి స్పందిస్తూ... ప్రజా ప్రతినిధుల దగ్గరకు ఎవరైనా వస్తారని, కొన్ని సందర్భాల్లో ఒవర్ లుక్ అయ్యే అవకాశం ఉందన్నారు. అతనికి పెరోల్ ఎలా వచ్చిందో నివేదిక వచ్చిన తర్వాత చెబుతామని తెలిపారు. గత ప్రభుత్వంలో అతనికి ‘వెరీ గుడ్’ అంటూ 30రోజులు పెరోల్ మంజూరు చేశారని, తర్వాత మరో 15 రోజులు పొడిగించారని గుర్తుచేశారు. మాజీ సీఎం జగన్ ఇలాంటి అసాంఘిక శక్తులను పెంచి పోషించారని, కూటమి ప్రభుత్వంలో వాటి ఆటలు సాగనివ్వబోమని హోంమంత్రి హెచ్చరించారు. అరాచక శక్తులు, రౌడీలు, ముఠాలను ఎలా అరికట్టాలో సీఎం చంద్రబాబుకు బాగా తెలుసని అనిత పేర్కొన్నారు.