Share News

Former IAS Vijay Kumar: డిప్యూటీ సీఎంపై దర్యాప్తు జరిపించండి

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:16 AM

ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ...

Former IAS Vijay Kumar: డిప్యూటీ సీఎంపై దర్యాప్తు జరిపించండి

  • చిత్ర ప్రమోషన్‌లో అధికార దుర్వినియోగం

  • హైకోర్టులో మాజీ ఐఏఎస్‌ విజయ్‌కుమార్‌ పిటిషన్‌

  • నోటీసుల జారీకి కోర్టు నిరాకరణ.. విచారణ వాయిదా

అమరావతి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ‘హరిహర వీరమల్లు’ సినిమా ప్రమోషన్‌లో ప్రభుత్వ నిధులు, అధికార యంత్రాంగాన్ని వినియోగించారని, ఆయనపై స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలంటూ మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.ప్రభుత్వ భద్రతా సిబ్బంది, అధికారిక వాహనాలు, ఇతర వనరులను సినిమా కార్యక్రమాలకు వినియోగించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. ఉపముఖ్యమంత్రి సినిమాల్లో నటన కొనసాగించడాన్ని అనైతికం,రాజ్యాంగవిరుద్ధమై చర్యగా ప్రకటించాలని కోరారు. ఇక పై పవన్‌ కల్యాణ్‌ సినిమాల్లో నటించకుండా నిరోధించాలని అభ్యర్థించారు.ఈ వ్యాజ్యం సోమవారం హైకోర్టు ముందు విచారణకు వచ్చింది. విచారణ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ తరఫు ప్రభుత్వ న్యాయవాది జయంతి స్పందిస్తూ...ఉపముఖ్యమంత్రిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చడంపై అభ్యంతరం తెలిపారు. వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందని, అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తారన్నారు. వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్‌ జోతిర్మయి ప్రతాప సీబీఐ, ఏసీబీ తరపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల పేర్లను కేసుల విచారణ జాబితాలో (కాజ్‌లిస్ట్‌) పేర్కొనకపోవడాన్ని తప్పుపట్టారు. వారి పేర్లను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను తోసిపుచ్చారు. ఈ దశలో ఎలాంటి నోటీసులు జారీ చేయలేమని, ప్రాథమిక విచారణ అనంతరం తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు. విచారణను వారంరోజులకు వాయిదా వేశారు.

Updated Date - Aug 19 , 2025 | 05:17 AM