Sri Sathya Sai District: మరో ట్రావెల్ బస్సు దూకుడు
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:07 AM
వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రైవేటు ట్రావెల్ బస్సుల దూకుడుకు మాత్రం కళ్లెం పడడం లేదు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలో...
మీతిమీరిన వేగంతో వ్యాన్‌ను ఢీకొని బోల్తా
మహిళా టెకీ దుర్మరణం.. 8 మందికి గాయాలు
శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర ప్రమాదం
చెన్నేకొత్తపల్లి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): వరుస ప్రమాదాలు జరుగుతున్నా ప్రైవేటు ట్రావెల్ బస్సుల దూకుడుకు మాత్రం కళ్లెం పడడం లేదు. తాజాగా శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి సమీపంలో 44వ నంబరు జాతీయ రహదారిపై ప్రైవేటు ట్రావెల్ బస్సు ఐషర్ వ్యాన్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళా టెకీ మృతి చెందారు. మరో ఎనిమిది మంది గాయపడి ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు, ప్రయాణికుల కథనం మేరకు.. జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ఎన్‌ఎల్ 01, బి33382 నంబరు గల స్లీపర్ కోచ్ బస్సు సోమవారం రాత్రి 30 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరింది. అర్ధరాత్రి 1.55 గంటల సమయంలో (మంగళవారం తెల్లవారుజామున) దామాజిపల్లి హైవే జంక్షన్ వద్దకు రాగానే ముందు వెళుతున్న ఐషర్ వాహనాన్ని బస్సు బలంగా ఢీకొట్టి బోల్తా పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని, స్థానికుల సాయంతో బస్సులో ఉన్నవారిని బయటకు తీశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బెంగళూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సురక్ష(32)ను ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. గాయపడిన ఆమె భర్త వినీత్, మూడేళ్ల కూతురు నిధి, వినోద్, ముజఫర్ ఖాన్, అసలా, వెంకట్, శిరీష గౌడ్, మాలిని అనంతపురం, చెన్నేకొత్తపల్లి ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. భార్య మృతిచెందడంతో వినీత్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్వల్పంగా గాయపడిన కూతురిని భుజాన వేసుకుని, ఆస్పత్రిలో విషణ్ణవదనంతో కూలబడిపోయారు. బస్సు డ్రవర్ నిర్లక్ష్యం, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు, ప్రయాణికులు తెలిపారు. జబ్బార్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్లు ఇర్ఫాన్, మాలిక్‌లతోపాటు, వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి భర్త వినీత్ ఫిర్యాదు మేరకు ట్రావెల్ బస్సు ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌కు మకాం మార్చే క్రమంలో..
బెంగళూరుకు చెందిన వినీత్ హైదరాబాద్‌లోని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ప్రమాదంలో మృతిచెందిన ఆయన భార్య సురక్ష ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న ఆమె, ఇటీవల కంపెనీ నుంచి వర్క్‌ఫ్రం హోం అనుమతి తీసుకున్నారు. అందరూ హైదరాబాద్‌లో ఉండాలని నిర్ణయించుకుని జబ్బార్ ట్రావెల్ బస్సులో బయలుదేరారు. ఇన్నాళ్లూ అక్కడొకరు, ఇక్కడొకరు గడిపిన దంపతులు ఇకపై ఒక్కచోట ఉండాలని సంతోషంగా వెళుతుండగా ఈ దారుణం జరిగిందని వారి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఆందోళన కలిగిస్తున్న బస్సు ప్రమాదాలు
తెలుగు రాష్ర్టాల్లో వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ప్రధానంగా 44వ నంబరు జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే భయపడుతున్నారు. ప్రతి రోజూ ఈ హైవేపై హైదరాబాద్-బెంగళూరు మధ్య 250కిపైగా ప్రైవేటు బస్సులు నడుస్తున్నాయి. ఇటీవల కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద బస్సు ప్రమాదానికి గురై 19 మంది సజీవదహనయ్యారు. అలాగే, తెలంగాణలోని చేవెళ్లలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో సోమవారం 19 మంది మృతిచెందారు. అదేరోజు ఏలూరులో ఓ ప్రైవేటు బస్సు బోల్తా పడింది. తాజాగా చెన్నేకొత్తపల్లి వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. మితిమీరిన వేగం వల్లే ప్రమాదాలు జరుగుతున్నా యని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు.