Private Finance Company: వృద్ధ దంపతులపై ‘ఫైనాన్స్’ ఆగడాలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:51 AM
గిరిజన వృద్ధ దంపతులను ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ రోడ్డున పడేసింది. సకాలంలో వాయిదాలు చెల్లించలేదంటూ సంస్థ ఏజెంట్లు ఇంట్లో సామా ను బయటకు విసిరేసి తాళం వేశారు.
తండ్రి ఇంటి పత్రాలతో కొడుక్కి రుణం
వాయిదా చెల్లించలేదని ఇంటికి తాళాలు
ఇంట్లో నుంచి బయటికి లాగేసిన ఏజెంట్లు
20 రోజులుగా ఆరుబయటే గిరిజన దంపతులు
సింగరాయకొండ, జూన్ 22 (ఆంధ్రజ్యోతి): గిరిజన వృద్ధ దంపతులను ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ రోడ్డున పడేసింది. సకాలంలో వాయిదాలు చెల్లించలేదంటూ సంస్థ ఏజెంట్లు ఇంట్లో సామా ను బయటకు విసిరేసి తాళం వేశారు. వారి కుమారుడు రుణం తీసుకుని వాయిదా చెల్లించలేదని ఈ దారుణానికి ఒడిగట్టారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండలో 20రోజుల క్రితం జరిగిన ఈ అమానవీయ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధిత దంపతుల కథనం ప్రకారం.. మండలంలోని బింగినపల్లి ఎస్టీ కాలనీకి చెందిన పొట్లూరి వెంకటాద్రి తన తల్లిదండ్రులైన వెంకటేశ్వర్లు, వెంకాయమ్మకు చెందిన ఇంటి పత్రాలను ఫైనాన్స్ కంపెనీలో తనఖా పెట్టి ఏడాదిన్నర కితం రూ.2.5లక్షలు రుణాన్ని తీసుకున్నారు.
వెంకటాద్రి హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తూ నెలకు రూ.7,300 వాయిదా సొమ్మును చెల్లిస్తూ వస్తున్నారు. అనారోగ్యం కారణంగా మూడు నెలల నుంచి వాయిదా సొమ్ము చెల్లించలేదు. దీంతో కంపెనీ రికవరీ ఏజెంట్లు 20రోజుల క్రితం వెంకటాద్రి ఇంటికి వెళ్లి ఇంటిని ఖాళీ చేయాలని వెంకటాద్రి తండ్రి వెంకటేశ్వర్లుకు హుకుం జారీ చేశారు. కొంత సమయమిస్తే డబ్బు చెల్లిస్తామని దంపతులు వేడుకున్నా కనికరించలేదు. ఇంట్లో ఉన్న వృద్ధులిద్దరినీ బలవంతంగా బయటికి లాగి పడేశారు. అప్పటి నుంచి బాధితులు ఇంటి బయటే ఉంటూ అక్కడే వండుకుని తింటూ లోలోన కుమిలిపోతూ మానసిక క్షోభకు గురవుతున్నారు. ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకుంటున్నారు.