Private Degree Colleges: సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:35 AM
డిగ్రీ కాలేజీల ఫీజు బకాయిలు, ఇతర సమస్యలను ఈ నెల 20లోగా పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని, నిరవధికంగా కాలేజీలను మూసివేస్తామని ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజయాన్యాల సంఘాలు ప్రకటించాయి.
ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి
ఫీజుల ఖరారు అధికారం యూనివర్సిటీలకు ఇవ్వాలి
ప్రైవేటు డిగ్రీ కాలేజీల సంఘాల డిమాండ్
డిమాండ్లపై ప్రభుత్వానికి 20 వరకు గడువు
అమరావతి, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల ఫీజు బకాయిలు, ఇతర సమస్యలను ఈ నెల 20లోగా పరిష్కరించకపోతే సమ్మె చేపడతామని, నిరవధికంగా కాలేజీలను మూసివేస్తామని ప్రైవేటు డిగ్రీ కాలేజీ యాజయాన్యాల సంఘాలు ప్రకటించాయి. రెండు ప్రధాన సంఘాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జె.రమణాజీ, సి.విజయభాస్కర్ రెడ్డి, పి.జయరాం, పి.పెద్దిరాజు ఈ మేరకు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. ఫీజుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా డిగ్రీ కోర్సులకు కొత్త ఫీజులు ఖరారు చేయాలని కోరారు. డిగ్రీ కోర్సులకు ఫీజులు నిర్ణయించే అధికారం ఉన్నత విద్య కమిషన్ నుంచి యూనివర్సిటీల పరిధిలోకి మార్చాలని డిమాండ్ చేశారు. డిగ్రీ కాలేజీలకు అఫిలియేషన్ ఐదేళ్లకు పెంచాలని, అన్ని యూనివర్సిటీలకు కామన్ అఫిలియేషన్ విధానం అమలుచేయాలని, డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లలో జరుగుతున్న గందరగోళాన్ని తొలగించాలని పేర్కొన్నారు. పది రోజుల్లో ఈ డిమాండ్లు పరిష్కరించని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగి కాలేజీలు మూసివేస్తామని స్పష్టంచేశారు. దీనిపై సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, విద్యాశాఖ ఉన్నతాధికారులకు వారు లేఖలు రాశారు. గత ఐదేళ్లలో ఉన్నత విద్యకు సరైన తోడ్పాటు లేకపోయినా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎంతో కృషి చేశామన్నారు. గత ప్రభుత్వంలో అశాస్ర్తీయంగా డిగ్రీ కోర్సులకు ఫీజులు ఖరారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం సరైన ఫీజులు నిర్ణయించి, సకాలంలో వాటిని విడుదల చేసిందని, కానీ ఈసారి 16 నెలల్లో కేవలం ఒక్క విడత ఫీజులే కాలేజీలకు అందాయని వివరించారు.
రాష్ట్రంలో ఉన్న 1380 డిగ్రీ కాలేజీల్లో 4.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, ఫీజులు పెండింగ్ వల్ల కాలేజీలు నడపలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. లెక్చరర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామని, నిర్వహణ వ్యయాలు భరించలేకపోతున్నామన్నారు. చివరికి అప్పులు కూడా పుట్టని పరిస్థితి తలెత్తిందన్నారు. అందువల్ల వెంటనే ఫీజులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.