Higher Education Council: దాచాలంటే కుదరదు
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:18 AM
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల సమాచారంపై ఉన్నత విద్యామండలి కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలల సమాచారం సైట్‌లో!
అడ్మిషన్ల నుంచి ఆడిట్ వరకు ఫీజులు, విరాళం, ఖర్చులు కూడా
కోర్సులు, ఫ్యాకల్టీ, వీసీ వివరాలు,క్యాంపస్ విస్తీర్ణం కూడా చెప్పాల్సిందే
లాగిన్, పాస్‌వర్డ్‌లకు చాన్స్ లేదు
ఉన్నత విద్యామండలి కీలక ఆదేశం
యూజీసీ మార్గదర్శకాలతో చర్యలు
సమాచారం అప్‌లోడ్‌కు 31 ఆఖరు తేదీ
అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల సమాచారంపై ఉన్నత విద్యామండలి కీలక ఆదేశాలు జారీ చేసింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా యూజీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇకపై ప్రతి యూనివర్సిటీ, అన్ని ఉన్నత విద్యా సంస్థలు తమ సమాచారాన్ని తప్పనిసరిగా ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. ఈ నెల 31 నాటికి ఈ ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం ఆయా విద్యా సంస్థలకు సంబంధించిన సమాచారం మొత్తం వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. అడ్మిషన్లు, ఫీజులు, ఫ్యాకల్టీ, మౌలిక సదుపాయాలు, ఉన్నత విద్యా సంస్థ ఆర్థిక పరిస్థితి ఇలా అన్ని వివరాలను ప్రజలు, విద్యార్థులు చూసి తెలుసుకునేందుకు వీలుగా.. వారికి అర్ధమయ్యేలా పేర్కొనాలి. ప్రస్తుతం ప్రైవేటు విద్యా సంస్థలు తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచుతున్నాయి. ప్రతి విషయానికీ విద్యార్థులు ఆయా సంస్థల అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. పైగా ఏ కాలేజీ ఎలాంటి స్థితిలో ఉందో తెలుసుకునే సమాచారం కూడా విద్యార్థులకు అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా అడ్మిషన్ తీసుకునే సమయంలో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో యూజీసీ ఆదేశాలను అనుసరించి సమగ్ర సమాచారాన్ని వెబ్‌సైట్‌లో ఉంచాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. విద్యా సంస్థ చిరునామా, ఆ సంస్థకు అఫిలియేషన్ ఎవరు ఇచ్చారు?, సంస్థ గవర్నింగ్ బాడీ, వీసీ, ప్రిన్సిపాల్, హెచ్‌వోడీలు, డైరెక్టర్లు, హెచ్‌ఆర్, ఫైనాన్స్ వివరాలు అందుబాటులో ఉంచాలి.
కోర్సులు.. క్రెడిట్లు కూడా..
ఆయా విద్యాసంస్థలలో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటికి క్రెడిట్ల పంపిణీ, అభ్యసన ఫలితాలు, పరిశ్రమలతో అనుసంధానం, స్కిల్ కోర్సులు, అకడమిక్ పార్టనర్‌షిప్ వివరాలను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచాలని ఉన్నత విద్యామండలి తెలిపింది. ఎంత మంది ఫ్యాకల్టీ ఉన్నారు? వారిలో నిపుణులు, సంస్థ పరిశోధన అంశాలు కూడా అందుబాటులో ఉంచాలి. అడ్మిషన్ల పాలసీ, ప్రవేశ పరీక్షలు, సీట్ల వివరాలు, ఫీజులు, ఉపకార వేతనాలు, విదేశీ సంస్థలతో ఒప్పందాలు, అంతర్జాతీయ విద్యార్థుల వివరాలను కూడా స్పష్టం చేయాలి. అలాగే, క్యాంపస్ ఎంత విస్తీర్ణంలో ఉంది?. అందులో భవనాల విస్తీర్ణం ఎంత?. తరగతి గదుల పరిమాణం, లైబ్రరీ, డిజిటల్ ఇన్‌ఫ్రా, గ్రీన్ క్యాంపస్, సీసీటీవీలు, విద్యార్థినుల భద్రత వివరాలు కూడా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. విద్యా సంస్థ వార్షిక బడ్జెట్, గత మూడు సంవత్సరాల ఆడిట్ స్టేట్‌మెంట్లు, ఆదాయ మార్గాలు, గ్రాంట్లు, ఫీజులు, విరాళాలు, వాటిని ఎలా వినియోగించారు అనే సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచాలి. విద్యా సంస్థలకు న్యాక్, ఎన్‌బీఏ, ఇతర జాతీయ సంస్థల ర్యాంకింగ్ వివరాలు కూడా వెల్లడించాలి. ఈ వివరాలను చూసుకునేందుకు ఎలాంటి లాగిన్, పాస్‌వర్డ్ వంటివి పెట్టకూడదు. ప్రజలకు సులభంగా కనిపించేలా సమాచారం ఉండాలని మండలి స్పష్టం చేసింది. ప్రతి సెమిష్టర్‌కు సమాచారాన్ని అప్‌డేట్ చేయాలని పేర్కొంది. చివరిసారిగా ఎప్పుడు అప్‌డేట్ చేశారో కూడా పేర్కొనాలి. అలాగే ఈ సమాచారం డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని కూడా స్పష్టం చేసింది.