Share News

ప్రైవేటు బస్సుల దందా!

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:44 AM

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల దందా నడుస్తోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి సెలవుల్లో టికెట్‌ ధరలు ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కేవలం సీటుకే సుమారు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల వరకు దండుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులను నడపటంతో అవి ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తున్నాయి. ఆ సమయంలో ప్రత్యామ్నాయ సర్వీసు ఏర్పాటు చేయాల్సి ఉన్నా యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన ప్రయాణికులపై ట్రావెల్స్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు బస్సుల దందా!

- సీజన్లలో పెంచేస్తున్న టికెట్‌ ధరలు

- ఫిట్‌నెస్‌ లేని బస్సులతో రాకపోకలు

- మార్గమధ్యలో మొరాయిస్తున్న సర్వీసులు

- ప్రశ్నిస్తున్న ప్రయాణికులపై దురుసు ప్రవర్తన

- పట్టించుకోని రవాణా శాఖ అధికారులు

ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల దందా నడుస్తోంది. పండగలు, పెళ్లిళ్ల సీజన్‌, వేసవి సెలవుల్లో టికెట్‌ ధరలు ఒక్కసారిగా పెంచేస్తున్నారు. కేవలం సీటుకే సుమారు పదిహేను వందల రూపాయల నుంచి రెండు వేల వరకు దండుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులను నడపటంతో అవి ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తున్నాయి. ఆ సమయంలో ప్రత్యామ్నాయ సర్వీసు ఏర్పాటు చేయాల్సి ఉన్నా యాజమాన్యాలు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి. ఇదేంటని ప్రశ్నించిన ప్రయాణికులపై ట్రావెల్స్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.

విజయవాడ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి):

ఉమ్మడి కృష్ణాజిల్లాలో సుమారు 30 వరకు ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు ఉన్నాయి. వీటి పరిధిలో 500 వరకు సర్వీసులు నడుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలకు విజయవాడ కేంద్రంగా ప్రయాణికులను చేరవేస్తున్నాయి. విజయవాడ - విశాఖపట్నం, విజయవాడ - హైదరాబాద్‌కు సాధారణ రోజుల్లో ఐదు వందల నుంచి ఏడు వందల రూపాయల వరకు ధరలు ఉంటాయి. అయితే సీజన్లలో మాత్రం ఈ ధరలు సాధారణ రోజుల్లో కంటే రెండు, మూడింతలు ఎక్కువగా ఉంటాయని ప్రయాణికులు చెబుతున్నారు. అదే దూరం అదే బస్సుకు ఎందుకంత డబ్బు వసూలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు. ధరలను నియంత్రించాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలకు అడ్డులేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. బస్సు సీట్లకు కవర్లు కూడా ఉండవని, కనీసం శుభ్రపరిచే పరిస్థితి కూడా లేకపోవడంతో అనేక బస్సుల్లో సీట్లు దుర్వాసన వస్తున్నాయని ప్రయాణికులు అంటున్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌ ప్రయాణికుల కనీస సదుపాయాలు కల్పించకపోయినా అధికారులు కళ్లకు గంతలు కట్టుకుని చూస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మొరాయిస్తున్న బస్సులు

ఓ సంస్థకు చెందిన ప్రైవేటు బస్సు సోమవారం రాత్రి 10 గంటలకు విజయనగరానికి బయలుదేరింది. సుమారు రాత్రి 12 గంటల సమయంలో హనుమాన్‌ జంక్షన్‌ టోల్‌గేట్‌ దాటాక బ్రేక్‌ ఫెయిలై ఆగిపోయింది. ఆ సమయంలో రోడ్లపై వెళ్తున్న వాహనాలను ఆపి అందులో ప్రయాణికులను సర్దుబాటు చేసి పంపించారు. బస్సు మొరాయిస్తే తామేం చేయగలమని, మరో బస్సు కావాలంటే ఉదయం 5 గంటల వరకు వేచి ఉండాలని, లేకపోతే ఈ దారిలో వచ్చిన వాహనాల్లో సర్దుకుని ప్రయాణించాలని సమాధానం చెప్పారు.

ఒక్కోసారి గంటల తరబడి రోడ్లపైనే..

ప్రైవేటు బస్సులు మార్గమధ్యంలో మొరాయిస్తున్నాయని, అలాంటి సందర్భాల్లో రోడ్లపైనే గంటల తరబడి వేచి ఉంచుతున్నారని పలువురు చెబుతున్నారు. లగేజీ, పిల్లలతో ప్రయాణిస్తున్న తమను మధ్యలో రోడ్లపైనే ఉంచడంతో అర్ధరాత్రి వేళ ఏం చేయాలో తెలియని స్థితిలో అయోమయానికి గురవుతున్నామని వాపోతున్నారు. ఆ మార్గంలో వచ్చే బస్సుల్లో ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారే తప్ప తమ సంస్థకు చెందిన మరో బస్సును ఏర్పాటు చేయడం లేదని చెబుతున్నారు. ఒక వేళ డ్రైవర్లను ప్రశ్నిస్తే బస్సు ఆగిపోతే మేమేం చేస్తామని, కావాలంటే వేరే బస్సు వచ్చేంతవరకు ఉండండి లేకపోతే మీకు నచ్చింది చేసుకోండని దురుసుగా సమాధానం చెబుతున్నారంటున్నారు.

ప్రత్యామ్నాయ సర్వీసుల్లేవ్‌!

మార్గమధ్యలో బస్సుల్లో సాంకేతిక లోపాలు వచ్చినప్పుడు సదరు సంస్థ ప్రత్యామ్నాయంగా మరో బస్సును ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే వారి వద్ద ఉన్న బస్సులన్నీ సర్వీస్‌ చేస్తుండటంతో ప్రయాణిస్తున్న బస్సుల్లో ఏదైనా ఆటంకం వస్తే ప్రయాణికులను ఆ మార్గంలో వచ్చే మరో బస్సులో పంపించాల్సిన పరిస్థితి నెలకొంది. అత్యవసరంగా వెళ్లాల్సిన వారి పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంటుంది. వారికి ఏ బస్సు దొరికితే ఆ బస్సులో ఖాళీ లేకపోయినా సీట్ల మధ్య ఖాళీ స్థలంలోనో, డ్రైవర్‌ పక్కనో గేర్‌బాక్స్‌ దగ్గర సర్దుకుని ప్రయాణించాల్సిన దుస్థితి. అయితే ట్రావెల్స్‌ యజమానులు బస్సులు బయలుదేరే ముందు తనిఖీ చేయకుండా కాలం చెల్లిన బస్సులను వినియోగిస్తుండడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు.

భయపెడుతున్న అగ్నిప్రమాదాలు

ఇటీవల విజయవాడ నగరంలో ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఫిట్‌నెస్‌ లేని బస్సుల వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు డొక్కు బస్సులు నడుపుతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి.

కమీషన్ల కోసం అడ్డమైన హోటల్స్‌ వద్ద నిలుపుదల

ఉదయం, రాత్రి వేళల్లో భోజనం కోసం ట్రావెల్స్‌ డ్రైవర్లు కొన్ని హోటల్స్‌ వద్ద ఆపుతారు. అయితే హోటల్‌ యాజమానుల దగ్గర కమీషన్‌ కోసం ఆహారం బాగా లేకపోయినా కొన్ని హోటల్స్‌ వద్ద నిలుపుదల చేస్తున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. భారీగా చార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌ యజమానులు బస్సుల్లో కనీస సౌకర్యాలు కల్పించడంలేదని విమర్శిస్తున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులతో ప్రయాణిస్తున్న సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవాలన్నా వాహనాన్ని ఆపరని చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రైవేటు బస్సులను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి, నిబంధనలు పాటించని యజమానులపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:44 AM