Share News

Proddutur: సిబ్బంది కళ్లు గప్పి.. గోడదూకి.. రిమాండ్‌ ఖైదీ పరార్‌

ABN , Publish Date - Aug 17 , 2025 | 05:20 AM

ప్రొద్దుటూరు సబ్‌ జైలు నుంచి మహ్మద్‌ రఫీ అనే రిమాండ్‌ ఖైదీ శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో సిబ్బంది కళ్లు గప్పి గోడ దూకి పరారయ్యాడు.

Proddutur: సిబ్బంది కళ్లు గప్పి.. గోడదూకి.. రిమాండ్‌ ఖైదీ పరార్‌

  • ప్రొద్దుటూరు సబ్‌ జైలులో భద్రతా వైఫల్యం

  • పలు జిల్లాల్లో 25కు పైగా దొంగతనం కేసులు

  • 3 రోజుల క్రితమే ఓ చోరీ కేసులో అరెస్టు

  • సబ్‌జైలును సందర్శించిన జైళ్ల శాఖ ఐజీ

  • విచారణకు ఆదేశం.. గాలింపు ముమ్మరం

ప్రొద్దుటూరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): ప్రొద్దుటూరు సబ్‌ జైలు నుంచి మహ్మద్‌ రఫీ అనే రిమాండ్‌ ఖైదీ శనివారం ఉదయం 6.30 గంటల సమయంలో సిబ్బంది కళ్లు గప్పి గోడ దూకి పరారయ్యాడు. దీంతో సబ్‌జైలులోని భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా.. వైఎస్సార్‌ కడప జిల్లా దువ్వూరు మండలం జిల్లెల గ్రామానికి చెందిన మహ్మద్‌ రఫీ మూడు రోజుల క్రితం రాజుపాళెం మండలం టంగుటూరులో పట్టపగలే ఓ ఇంట్లో దూరి చోరీ చేసి ఇంటి యజమానిపై దాడిచేసి పారిపోతుండగా గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. దీంతో 13వ తేదీన మహ్మద్‌ రఫీని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ప్రొద్దుటూరు సబ్‌జైలులో ఇతడితో పాటు మరో నలుగురు మాత్రమే రిమాండ్‌ ఖైదీలు ఉన్నారు. ప్రస్తుతం హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరావు ఇన్‌చార్జ్‌ జైలు సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం బ్యారక్‌ను శుభ్రం చేస్తుండగా క్షణాల వ్యవధిలో మహ్మద్‌ రఫీ వెంటిలేటర్‌ను పట్టుకుని గోడదూకి పరారయ్యాడు. ఈ విషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. జైళ్ల శాఖ ఐజీ రవికిరణ్‌ ప్రొద్దుటూరు వచ్చి సబ్‌ జైలు ఆవరణను పరిశీలించారు. ఆయన ఆదేశాలతో కడప జైలర్‌ అమర్‌ బాషా విచారణ చేపట్టారు. ప్రొద్దుటూరు త్రీటౌన్‌ సీఐ గోవిందరెడ్డి సబ్‌ జైలును సందర్శించి ఇతర రిమాండ్‌ ఖైదీలను, సిబ్బందినీ విచారించి కేసు నమోదు చేశారు. రఫీని పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసుల బృందాలతో గాలింపు చేపట్టారు. రఫీ 2021లో జమ్మలమడుగు సబ్‌జైలు నుంచి కూడా తప్పించుకుని పారిపోయాడు. అయినా జైలులో సిబ్బంది అప్రమత్తంగా ఉండకపోవడం వల్లే పరారైనట్లు తెలుస్తోంది.

Updated Date - Aug 17 , 2025 | 05:21 AM