CS Vijay Anand: జల, థర్మల్ విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం
ABN , Publish Date - Sep 26 , 2025 | 05:05 AM
విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను కోరారు.
జెన్కో, ట్రాన్స్‌కో అధికారులతో సీఎస్ సమీక్ష
అమరావతి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులను కోరారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపై ఆయన గురువారం సచివాలయంలో ట్రాన్స్‌కో, జెన్కో యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. వాతావరణ మార్పుల కారణంగా సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిపై ఎక్కువ ఆధారపడకూడదని, వాటికి ప్రత్యామ్నాయంగా జల, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ఏడాది జూలై నుంచి సగటున రోజుకి 15.5 మిలియన్ యూనిట్ల జల విద్యుదుత్పత్తి జరుగుతోందని, విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుందని తెలిపారు. అక్టోబరు నెలలో పండుగలు, వ్యవసాయానికి అనువైన కాలం కావడంతో, విద్యుత్ డిమాండ్‌ను అందుకోవడానికి సంసిద్ధంగా ఉండాలని సీఎస్ కోరారు. వినియోగదారులకు 24/7 నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని సూచించారు. సమావేశంలో జెన్కో ఎండీ నాగలక్ష్మి, ట్రాన్స్‌కో ఇన్‌చార్జి జేఎండీ పృధ్వీతేజతో పాటు ట్రాన్స్‌కో డైరెక్టర్లు ఏకేవీ భాస్కర్, జేవీరావు, ఎన్‌వీ రమణమూర్తి, జెన్కో డైరెక్టర్లు సుజయ్‌కుమార్, అశోక్‌కుమార్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.