Share News

సంగీత, సాహిత్య రంగాలకు ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 24 , 2025 | 11:38 PM

టీడీపీ హయాంలో సాహిత్య, సంగీత, నాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని టీజీవీ కళక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు.

   సంగీత, సాహిత్య రంగాలకు ప్రాధాన్యం
మహమ్మద్‌ మియాను సత్కరిస్తున్న కళాక్షేత్రం అధక్షుడు పత్తి ఓబులయ్య, కళాక్షేత్రం కళాకారులు

టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య

కర్నూలు కల్చరల్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): టీడీపీ హయాంలో సాహిత్య, సంగీత, నాటక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని టీజీవీ కళక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య అన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో కొనసాగుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 75వ జన్మదిన వజ్రోత్సవ సాంస్కృతిక వారోత్సవాలలో ఐదోరోజు గురువారం ‘సినీ సంగీత విభావరి’, ‘కళాకారులకు సత్కారాలు’ నిర్వహించారు. చంద్రబాబు చిత్రపటానికి కళాకారులు క్షీరాభిషేకం చేశారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన నగరపాలక సంస్థ మేనేజర్‌ చిన్న రాముడు జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏపీ నాటక అకాడమీ ఛైర్మన గుమ్మడి గోపాలకృష్ణ చంద్రబాబు నాయుడుపై రాసిన ‘పుడతారు మహానుభావులు ఎందరో’ అనే గీతాన్ని అలపించారు. అనతరం కళారత్న పురస్కార గ్రహీత పత్తి ఓబులయ్య మాట్లాడుతూ కర్నూలు నగరంలో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవ సాంస్కృతిక వారోత్సవాలు వారం రోజుల పాటూ కన్నుల పండువగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లలిత కళాసమితి పూర్వ అధ్యక్షుడు పి. దస్తగిరి, కళాక్షేత్రం సభ్యులు రాజారత్నం, ఎస్‌ఎండీ ఇనాయతుల్లా, యాగంటీశ్వరయ్య, సంగా ఆంజనేయులు, శ్రీనివాస రెడ్డి, రిటైర్డ్‌ హెచఎం ఎర్రమ పాండురంగయ్య, ఎస్‌డీవీ అజీజ్‌ తదితరులు పాల్గొన్నారు.

అలరించిన సంగీత విభావరి: సినీ సంగీత విభావరి ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంది. గజల్‌ గాయకుడు మహమ్మద్‌ మియా, ప్రముఖ గాయని సుధారాణిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గాయకులు ఇబ్రహీం, హబీబ్‌, శ్రీనివాసులు, ఆర్‌కే ప్రసాద్‌, బాల వెంకటేశ్వర్లు, ఖాజావలి, సుజాత తదితరులు ఎంపిక చేసిన పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.

నేడు నృత్య విభావరి: టీజీవీ కళాక్షేత్రంలో శుక్రవారం ఆరో రోజు కార్యక్రమాల్లో భాగంగా కూచిపూడి, జానపద నృత్య విభావరి ఉంటుంది. ఈ కార్యక్రమానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవుతారు.

‘గజల్‌ మియా’కు సత్కారం

ప్రముఖ గజల్‌ గాయకుడు, జడ్పీ హైస్కూల్‌ హెచఎం మహమ్మద్‌ మియాను టీజీవీ కళాక్షేత్రంలో గురువారం రాత్రి ఘనంగా సత్కరించారు. గాయకుడిగా, సంగీత కళాకారునిగా, నటుడిగా, ఉపాధ్యాయుడిగా ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ టీజీవీ కళాక్షేత్రం పక్షాన ఈ సత్కరం ఏర్పాటు చేశారు. కళాక్షేత్రం అధ్యక్షుడు పత్తి ఓబులయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహమ్మద్‌ మియాకు పూలదండలు వేసి, శాలువలు కప్పి, జ్ఞాపిక ప్రదానం చేస్తూ కళాకారులు అభినందించారు. ప్రతిభ విద్యాసంస్థల అధ్యక్షుడు డాక్టర్‌ అరుణాచలం రెడ్డి, పలువురు ఉపాధ్యాయులు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2025 | 11:38 PM