Share News

Srisailam Visit: 16న శ్రీశైలానికి ప్రధాని మోదీ

ABN , Publish Date - Oct 08 , 2025 | 05:03 AM

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

Srisailam Visit: 16న శ్రీశైలానికి ప్రధాని మోదీ

  • భద్రతా ఏర్పాట్లపై ఉన్నతాధికారుల సమీక్ష

  • హెలీప్యాడ్‌, శివాజీ స్ఫూర్తి కేంద్రం పరిశీలన

  • ప్రధాని రాకతో శ్రీశైలానికి మరింత వైభవం: పీవీఎన్‌ మాధవ్‌

శ్రీశైలం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16న శ్రీశైలం పర్యటనకు రానున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్‌ ఐపీఎస్‌, ఐఏఎస్‌ అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రధాని పర్యటన స్పెషల్‌ అధికారి వీరపాండియన్‌, నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి, శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాసరావు, పోలీసు ఉన్నతాధికారులు, తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సున్నిపెంట హెలీప్యాడ్‌ పరిసరాలను, శ్రీశైలంలోని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడినుంచి మల్లికార్జునస్వామి ఆలయం ఎదురుగా గంగాధర మండపం వద్దకు చేరుకుని ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లపైనా ఆరా తీశారు. మోదీ సున్నిపెంట హెలీప్యాడ్‌ నుంచి రోడ్డుమార్గాన శ్రీశైలానికి రానున్నారు. దీంతో ఈ రహదారికి మరమ్మతులు వేగవంతంగా చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం శ్రీశైలం దేవస్థానం పరిపాలన భవనంలో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలు, ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. కాగా, ప్రధాని మోదీ పర్యటనతో శ్రీశైలం వైభవం మరింత పెరుగుతుందని బీజేపీ రాష్ట్ర ఆధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ అన్నారు. మంగళవారం శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ తొలిసారి ఇక్కడి జ్యోతిర్లింగ క్షేత్రానికి వస్తున్నారని, ఆయన రాకతో ఈ ప్రాంతం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు.

Updated Date - Oct 08 , 2025 | 05:04 AM