Share News

Spiritual Center: శివాజీని ఆకర్షించిన.. శ్రీశైలం..

ABN , Publish Date - Oct 14 , 2025 | 04:14 AM

శ్రీశైలంలో అణువణువూ ఓ అద్భుతమే. ప్రతి అడుగూ ఆధ్యాత్మిక పరవశమే. నల్లమల అటవీ అందాల మధ్య, నిండుకుండలా ఆహ్లాదం పంచే జలాశయం చెంతన భ్రమరాంబ సమేతుడై మల్లికార్జునుడు...

Spiritual Center: శివాజీని ఆకర్షించిన.. శ్రీశైలం..

  • పదిరోజుల పాటు ఇక్కడ బస.. ధ్యానం

  • ఛత్రపతికి మల్లికార్జునుడి ఆశీస్సులు

  • ఖడ్గాన్ని ప్రసాదించిన భ్రమరాంబ అమ్మవారు

  • ఆయన ధ్యానం చేసిన చోటే స్ఫూర్తి కేంద్రం

  • 16న శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన

  • శివాజీ నడయాడిన ప్రాంతాల సందర్శన

జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగి ఉన్న ఏకైక క్షేత్రం శ్రీశైలం. ఈ క్షేత్రానికి ఈ నెల 16నప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్నారు. స్వామి, అమ్మవార్లకు జరిగే ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన శివాజీ మహారాజ్‌ స్ఫూర్తి కేంద్రాన్ని కూడా సందర్శిస్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఆ స్ఫూర్తి కేంద్రం గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. ఆ కేంద్రం.. అందులోని విశేషాలు ఈ కథనంలో..

(నంద్యాల/శ్రీశైలం-ఆంధ్రజ్యోతి)

శ్రీశైలంలో అణువణువూ ఓ అద్భుతమే. ప్రతి అడుగూ ఆధ్యాత్మిక పరవశమే. నల్లమల అటవీ అందాల మధ్య, నిండుకుండలా ఆహ్లాదం పంచే జలాశయం చెంతన భ్రమరాంబ సమేతుడై మల్లికార్జునుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆధ్యాత్మిక, పౌరాణిక గ్రంథాల్లోనే కాదు.. చరిత్ర పుటల్లోనూ మల్లన్న వైభవం కనిపిస్తూనే ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను కూడా ఈ దివ్యక్షేత్రం ఎంతో ఆకర్షించింది. 1677 ప్రాంతంలో దక్షిణ భారతదేశంపైకి ఆయన దండయాత్ర మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన తొలిసారిగా శ్రీశైలానికి చేరుకుని మల్లన్న ఆశీస్సులు తీసుకున్నారని చరిత్ర చెబుతోంది. శ్రీశైలంలో దాదాపు పది రోజుల పాటు ఉండి దండయాత్రకు సంబంధించిన కార్యాచరణ రూపొందించారు. స్వతహాగా అమ్మవారి భక్తుడు కావడంతో ఆ సమయంలో చేసిన సాధనకు మెచ్చి భ్రమరాంబికా దేవి సాక్షాత్కరించి శివాజీ మహారాజ్‌కు దివ్య ఖడ్గాన్ని ప్రసాదించారని ఆలయ చరిత్ర చెబుతోంది.


shivaji.jpg

శివాజీ రాజగోపురం... స్ఫూర్తి కేంద్రం

శ్రీశైలంలో ఉండగా మల్లన్న ఆలయ ఉత్త రాజగోపురాన్ని నిర్మించాలని శివాజీ మహారాజ్‌ సంకల్పించారు. ఇందుకోసం రామచంద్ర పంత్‌ అనే తన మంత్రిని రెండేళ్లపాటు ఇక్కడే ఉంచి రాజగోపుర నిర్మాణాలను పూర్తి చేయించారు. శివాజీ మహారాజ్‌ అప్పట్లో ఎక్కడైతే ధ్యానం చేశారో.. ఆ ప్రాంతంలోనే శివాజీ మహారాజ్‌ ధ్యాన స్ఫూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 1975లో శివాజీ మెమోరియల్‌ కమిటీ ఏర్పాటైంది. ఆ తర్వాత 1983లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వసంత దాదాపాటిల్‌ ఆధ్వర్యంలో శివాజీ స్ఫూర్తి కేంద్రానికి పునాదిరాయి వేశారు. సుమారు 19 ఏళ్ల పాటు సాగిన ఈ నిర్మాణం పూర్తిస్థాయిలో 2004లో భక్తులకు అందుబాటులోకి వచ్చింది. 1994లో శివాజీ మహారాజ్‌ కాంస్య విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు.


రాజదర్బార్‌ను మైమరపించే స్ఫూర్తి కేంద్రం

ఈ స్ఫూర్తి కేంద్రంలో శివాజీ మహారాజ్‌ పట్టాభిక్తుడైనట్లు ఉన్న కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు. పది మందితో కూడిన మంత్రి మండలిని స్ఫురించేలా రాజదర్బార్‌ను రూపొందించారు. శివాజీ మహారాజ్‌ సింహాసనంపై ఠీవీగా కూర్చున్న కాంస్య విగ్రహం బరువు ఛత్రంతో కలిపి 12 అడుగుల ఎత్తు ఉండగా, 4.5 టన్నుల బరువు ఉండటం విశేషం. స్ఫూర్తి కేంద్రంలోకి వెళ్తే ప్రస్తుత కాలాన్ని మరిచి రాజుల కాలం నాటి దర్బార్‌లో ఉన్నట్లుగా అనిపించేలా మందిరాన్ని నిర్మించారు. అంతేకాకుండా ఈ మందిరంలో శివాజీ మహారాజ్‌ చేసిన దండయాత్రలు, విజయాలకు గుర్తుగా త్రీడీ చిత్రాలను ఏర్పాటు చేశారు. పలు భాషల్లో శివాజీ మహారాజ్‌ చరిత్ర విశేషాలను ఇందులో చూడవచ్చు. ఆ పక్కనే శివాజీ ధ్యానం చేసిన స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. ఈ ధాన్యకేంద్రంలోకి వెళ్లగానే సమస్యలన్నీ మర్చిపోతారని, మనసు తేలికపడుతుందని సందర్శకుల నమ్మకం.

Updated Date - Oct 14 , 2025 | 07:07 AM