CM Chandrababu Naidu: మోదీ సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లు
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:22 AM
ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లుగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ 21వ శతాబ్దం ఆయనదేనన్నారు. గురువారం కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్‌టీ-సూపర్ సేవింగ్స్ సభలో...
21వ శతాబ్దం ఆయనదే: ముఖ్యమంత్రి
సూపర్ సిక్స్, సూపర్ జీఎస్టీతో సూపర్‌గా పొదుపు
ఒక్కో కుటుంబానికి రూ.15,000 వరకూ ఆదా
డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ ప్రయోజనాలు
16 నెలలుగా రాష్ట్రానికి మోదీ సాయం మరువలేం
కేంద్రం సహకారంతోనే అమరావతిని నిలబెట్టాం
పోలవరాన్ని గాడిన పెట్టాం.. విశాఖ ఉక్కును కాపాడాం
భారీ పెట్టుబడులొచ్చాయ్.. మోదీ వల్లే క్వాంటమ్ వ్యాలీ
సీమకు ఎన్నెన్నో పరిశ్రమలు.. త్వరలోనే హైకోర్టు బెంచ్
బిహార్ ఎన్నికల్లో ఎన్‌డీయేదే గెలుపు: చంద్రబాబు
మోదీ 21వ శతాబ్దపు నేత. నేను ఎందరో ప్రధానులతో కలిసి పనిచేసినా ఆయనలాంటి వ్యక్తిని చూడలేదు. నిర్విరామంగా ప్రజాసేవలోనే ఉంటున్న అరుదైన నేత.దసరా నుంచి దీపావళి వరకు జీఎస్‌టీ సంస్కరణలను పండుగలా నిర్వహిస్తున్నాం. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 98 వేల కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించాం. జీఎస్‌టీ బచత్ ఉత్సవ్ కాస్తా ఇవాళ భరోసా ఉత్సవ్‌గా మారింది.
- సీఎం చంద్రబాబు
కర్నూలు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): ప్రధాని మోదీ తెచ్చిన సంస్కరణలు దేశానికే గేమ్ చేంజర్లుగా సీఎం చంద్రబాబు అభివర్ణించారు. ఈ 21వ శతాబ్దం ఆయనదేనన్నారు. గురువారం కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్‌టీ-సూపర్ సేవింగ్స్’సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. జీఎ్‌సటీ సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నందుకు.. ముఖ్యమంత్రిగా, ప్రధానిగా పాతికేళ్లుగా ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్నందుకు మోదీకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. సరైన సమయంలో సరైన చోట సరైన వ్యక్తి అయిన ప్రధాని మోదీ విశిష్ట వ్యక్తి అని ప్రశంసించారు. ప్రగతిశీల దేశంగా 2047 నాటికి భారత్ ప్రపంచానికి సూపర్ పవర్‌గా తయారవుతుందన్నారు. ఇంకా ఏమన్నారంటే..
మోదీ ఆల్‌టైమ్ రికార్డు..
దేశంలో 11 ఏళ్లలో 4 కోట్ల కుటుంబాలకు పక్కా ఇళ్లు.. 81 కోట్ల మందికి ఉచిత రేషన్, 144 వందే భారత్ రైళ్లు, 55 వేల కిలోమీటర్ల మేర కొత్తహైవేలు, 86 విమానాశ్రయాలు, 16 ఎయిమ్స్ ఆస్పత్రులు నిర్మించిన ఘనత మోదీదే. 7 ఐఐటీలు, 8 ఐఐఎంలను తీసుకువచ్చిన రికార్డు కూడా ఆయనదే. ఇది ఆల్‌టైమ్ రికార్డు. 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్.. ఆయన సంకల్పంతోనే నాలుగో స్థానానికి వచ్చింది. 2028 నాటికి మూడో అతిపెద్ద, 2038 నాటికి రెండో అతి పెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. ఆర్థికంగా మన బలమేంటో ఈ విజయాలు చెబితే.. సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సిందూర్ చాటింది.
ప్రతి కుటుంబానికీ ప్రయోజనకరం..
‘ఒకే దేశం-ఒకే పన్ను-ఒకే మార్కెట్’ విధానంతో తెచ్చిన జీఎస్‌టీ 2.0లో 99 శాతం వస్తువులు సున్నా, 5 శాతం శ్లాబుల పరిధిలోనే ఉన్నాయి. జీఎస్‌టీ తగ్గింపుతో నిత్యావసరాల వస్తువుల ధరలు తగ్గాయి. పేద, మధ్యతరగతి వర్గాలు, రైతులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు.. అన్ని వర్గాలకూ లబ్ధి కలిగింది. ఈ సంస్కరణల వల్ల ఏటా ఒక్కో కుటుంబానికి రూ.15,000 ఆదా అవుతోంది. డబుల్ ఇంజన్ సర్కారుతో డబుల్ ప్రయోజనాలు కలుగుతున్నాయి. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్‌టీతో ప్రజలకు సూపర్‌గా పొదుపు జరిగింది. ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేస్తున్న టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన ‘గర్వ్ సే కహో.. యే స్వదేశీ హై’ నినాదం బ్రహ్మాస్త్రంగా మారుతుంది. ఈ స్వదేశీ పిలుపును అందిపుచ్చుకుని సెమీ కండక్టర్ల నుంచి శాటిలైట్ల వరకూ చిప్‌ల నుంచి షిప్పుల వరకూ ఏపీలోనే ఉత్పత్తి చేసేలా కార్యాచరణ చేపట్టాం.
శంకుస్థాపనలు, ప్రారంభాలు..
విద్యుత్, రైల్వే, రోడ్డు, రక్షణ రంగాలకు చెందిన రూ.13,430 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రూ.4,922 కోట్ల విలువైన కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు శంకుస్థాపనలు చేశారు.
కేంద్రం సహకారంతోనే సూపర్ హిట్..
రాష్ట్రానికి 16 నెలలుగా ప్రధాని మోదీ అందిస్తున్న సాయం మరువలేనిది. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మెగా డీఎస్సీ, పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, తల్లికి వందనం, దీపం-2.0, పెన్షన్ల పంపిణీ వంటి సంక్షేమ పథకాలను కేంద్రం సహకారంతోనే సూపర్ హిట్ చేశాం. కేంద్రం సహకారంతోనే అమరావతిని నిలబెట్టాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అత్యధిక పెట్టుబడులు సాధిస్తోంది. ఉమ్మడి విశాఖలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పెడుతోంది. ఇప్పుడు విశాఖకు 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా హబ్ వస్తోంది. నెల్లూరులో బీపీసీఎల్ రిఫైనరీ వస్తోంది. రాయలసీమకు త్వరలో హైకోర్టు బెంచ్ రాబోతోంది. సీమకు ఇంకా ఉక్కు, అంతరిక్షం, రక్షణ, ఏరోస్పేస్, ఆటోమొబైల్, ఎలక్ర్టానిక్స్, డ్రోన్ల తయారీ, హరిత ఇంధనం, ఆహారశుద్ధి, సిమెంట్ పరిశ్రమలు వస్తున్నాయి. వీటితో పాటు సెమీకండక్టర్ యూనిట్లు, క్వాంటమ్ వ్యాలీ రావడానికి కారణమైన ప్రధానికి ప్రత్యేక ధన్యవాదాలు.
ఆ శక్తి మోదీకివ్వాలి..
శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట కొలువై ఉన్న దివ్యక్షేత్రం శ్రీశైలం. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుషాల గడ్డపై జీఎస్‌టీ బచత్ ఉత్సవ్ సభకు ప్రధాని రావడం సంతోషదాయకం. దేశానికి ప్రగతి దిశగా నడిపే శక్తిని మోదీకివ్వాలని శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జునస్వామిని ప్రార్థిస్తున్నాను. వికసిత భారత్ లక్ష్యంగా సాకారం కావాలని కోరుతున్నాను. మోదీ విజయయాత్ర నిరంతరం కొనసాగాలి. బిహార్ ఎన్నికల్లోనూ గెలుస్తుందని విశ్వసిస్తున్నాను.
వేల మంది శివ సేవకులు
మోదీ రాక సందర్భంగా శ్రీశైలంలో భక్తులతో పాటు శివ సేవకులు కాషాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. నంది మండపం సర్కిల్ నుంచి గంగాధర మండపం వరకు మోదీ కాన్వాయ్ వెళ్తుండగా.. అటుగా ఉన్న భక్తులు, వేల సంఖ్యలో శివసేవకులు హరహర మహాదేవ నినాదంతో హోరెత్తించారు. మోదీ వాహనంలో నుంచే అభివాదం చేశారు. ఇంకోవైపు.. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో సున్నిపెంట నుంచి శ్రీశైలం వరకు భారీ బందోబస్తు చేపట్టారు. 1,800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. భద్రతా ఏర్పాట్లను నంద్యాల ఎస్పీ సునీల్ షెరాన్, ఈగల్ చీఫ్ రవికృష్ణ, ఐపీఎస్ అధిరాజ్ సింగ్ రాణా పర్యవేక్షించారు.
