Devotional Visit: మల్లన్న సేవలో ప్రధాని
ABN , Publish Date - Oct 17 , 2025 | 04:32 AM
శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవిని ప్రధాని మోదీ గురువారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భ్రమరాంబ, మల్లికార్జునలకు ప్రత్యేక పూజలు
సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి శ్రీశైలంలో 3 గంటల పర్యటన
పూర్ణకుంభంతో అర్చకుల స్వాగతం
పూజల అనంతరం వేదాశీర్వచనాలు, తీర్థప్రసాదాలు
స్వామివారి శేషవస్త్రాలు అందించిన చంద్రబాబు, పవన్
స్వామి సన్నిధిలో 40 నిమిషాలు
తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రం సందర్శన
1,800 మంది పోలీసులతో భారీ బందోబస్తు
నంద్యాల, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జునస్వామి, భ్రమరాంబికాదేవిని ప్రధాని మోదీ గురువారం దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని తొలుత కర్నూలు విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మోదీ, చంద్రబాబు, పవన్ ముగ్గురూ కలసి ఒకే హెలికాప్టర్లో శ్రీశైలంలోని సున్నిపెంట హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ నంద్యాల కలెక్టర్ రాజకుమారి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, జేసీ విష్ణుచరణ్ తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డుమార్గాన 10 కిలోమీటర్లు ప్రయాణించి మల్లన్న క్షేత్రానికి చేరుకున్నారు. ప్రధాన అర్చకుడు వీరన్న స్వామి నేతృత్వంలో ఆలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగానికి ప్రధాని ఏకవార రుద్రాభిషేకం, బిల్వార్చన, పుష్పార్చన, పంచామృతాలతో అభిషేకం చేశారు. అదే విధంగా భ్రమరాంబికకు ఖడ్గమాల, కుంకమార్చన పూజలు చేశారు. తర్వాత మల్లిక గుండమ్మ దర్శనం చేసుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాకార మండపంలో ప్రధానికి వేద పండితులు వేదాశీర్వచనాలు ఇచ్చారు. అనంతరం అర్చక స్వాములు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆయనకు స్వామివారి శేష వస్త్రాలు, స్వామి. అమ్మవార్ల చిత్ర పటం, ప్రసాదాలను అందజేశారు. శ్రీశైలంలో మొత్తంగా 3 గంటలు పర్యటించిన ప్రధాని.. 40 నిమిషాలు మల్లన్న సేవలో గడిపారు.
ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రంలో మోదీ
చంద్రబాబు, పవన్‌తో కలిసి ప్రధాని మధ్యాహ్నం 12:35 గంటలకు ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రానికి వెళ్లారు. ముందుగా శివాజీ దర్బార్, గోడలపై శివాజీ జీవిత చరిత్రపై శిల్పాలతో కూడిన చిత్ర మాలికలను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా శివాజీ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం స్ఫూర్తి కేంద్రం నిర్వాహకులు టీజీ వెంకటేశ్, సుబ్బారెడ్డి తదితరులు ఆయనకు స్ఫూర్తి కేంద్రం జ్ఞాపికను అందజేశారు.
