Share News

AP Medical Council: ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి

ABN , Publish Date - Sep 13 , 2025 | 07:01 AM

ఆర్‌ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు అత్యవసర ప్రథమ చికిత్సలకే పరిమితం కావాలని.. పరిధి దాటి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌...

 AP Medical Council: ప్రథమ చికిత్సకే పరిమితం కావాలి

  • పరిధి దాటితే చట్టపరంగా చర్యలు తప్పవు

  • ఆర్‌ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులకు..ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ శ్రీహరిరావు హెచ్చరిక

  • ఐఎంఏ ప్రతినిధులతో కలసి తురకపాలెం సందర్శన

గుంటూరు మెడికల్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఆర్‌ఎంపీ, పీఎంపీ, గ్రామీణ వైద్యులు అత్యవసర ప్రథమ చికిత్సలకే పరిమితం కావాలని.. పరిధి దాటి వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ డాక్టర్‌ డీ శ్రీహరిరావు హెచ్చరించారు. డీఎంహెచ్‌వో డాక్టర్‌ కే విజయలక్ష్మీ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ గార్లపాటి నందకిశోర్‌, ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ విజిలెన్స్‌ అధికారి డాక్టర్‌ ఆశాకిరణ్‌తో కలసి శుక్రవారం ఆయన తురకపాలెంలో పర్యటించారు. గ్రామంలోని ఆర్‌ఎంపీ క్లినిక్‌లను సందర్శించారు. ‘కలుషిత సెలైన్‌ కాటేసిందా..?’ అనే శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రధాన సంచికలో గురువారం ప్రచురితమైన వార్తాకథనానికి ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ స్పందించింది. తురకపాలెంలో ఆర్‌ఎంపీ క్లినిక్‌లను సందర్శించిన డాక్టర్‌ శ్రీహరిరావు వారు రోగులకు ఇస్తున్న మందులను పరిశీలించారు. పలు క్లినిక్‌ల్లో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన స్టెరాయిడ్‌, యాంటీబయాటిక్స్‌ ఉండటాన్ని గుర్తించారు. అలాగే ఆర్‌ఎంపీలు తమ పేర్ల మందు డాక్టర్‌ అని రాసుకోవడాన్ని కూడా ఆయన గమనించారు.


విచక్షణరహితంగా మందుల వాడకం

ఈ సందర్భంగా చైర్మన్‌ డాక్టర్‌ శ్రీహరిరావు విలేకరులతో మాట్లాడుతూ... తురకపాలెంలో చనిపోయిన వారిలో చాలా మంది ఈ ప్రఽథమ చికిత్స కేంద్రంలో సెలైన్లు, యాంటీబయాటిక్స్‌ విచక్షణారహితంగా వాడినట్టు చెప్పారు. ఆర్‌ఎంపీ, పీఎంపీలు సెలైన్లు పెట్టడం, యాంటీబయాటిక్‌ మందులు రాయడం, స్టెరాయిడ్లు ఇవ్వడం ప్రజారోగ్యానికి ఎంతో హానికరమన్నారు. నకిలీ వైద్యులు నిర్వహించే ప్రథమ చికిత్స కేంద్రాలకు వెళ్లడం ఎంత మాత్రం మంచిది కాదని సూచించారు. డాక్టర్‌ నందకిశోర్‌ మాట్లాడుతూ.. గ్రామీణులు తమ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే పీహెచ్‌సీల్లో చికిత్సలు పొందాలని సూచించారు. తురకపాలెంలో గుర్తించిన బ్యాక్టీరియా అంత ప్రమాదకరం కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. తొలుత ఏపీ కౌన్సిల్‌, ఐఏంఏ ప్రతినిధులు గ్రామంలో ఆరోగ్యశాఖ నిర్వహిస్తున్న వైద్యశిబిరాన్ని సందర్శించి అక్కడ ప్రజలకు అందిస్తున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.


తురకపాలెంపై నిఘా పెంచండి: మంత్రి సత్యకుమార్‌

4 శాతం మందిలో మెలియోయిడోసిస్‌ గుర్తించిన అధికారులు

అమరావతి, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): తురకపాలెంలో మరణాలకు కారణాలపై వారంలో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ అధికారులను ఆదేశించారు. ఈ గ్రామంలో సీనియర్‌ వైద్యుల పర్యవేక్షణ కొనసాగతూనే ఉండాలని సూచించారు. తురకపాలెంలో మరణాలు, స్థానికుల నుంచి సేకరించిన రక్తనమూనాలు, వాటి ఫలితాల గురించి శుక్రవారం మధ్యాహ్నం సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆ గ్రామంలో నమోదైన వరుస మరణాల గురించి జిల్లా అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో విఫలమయ్యారని అన్నారు. ఈ గ్రామంలో 4శాతం మందిలోనే మెలియోయిడోసిస్‌ ఉన్నట్లు గుర్తించామని అధికారులు వివరించారు. తురకపాలెం సమీపంలోని కొత్తరెడ్డిపాలెం గ్రామస్తులకు కూడా పరీక్షలు చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ గ్రామంపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.

Updated Date - Sep 13 , 2025 | 07:02 AM