Aqua Farmers: ఆక్వా రైతుకు ధరల స్థిరీకరణ అవసరం
ABN , Publish Date - Sep 12 , 2025 | 06:21 AM
దేశ వ్యాప్తంగా రొయ్యలు, చేపల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 70 శాతం. దేశానికి ఏడాదికి రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో రాష్ట్ర ఆక్వా రైతులు సమకూర్చుతున్నారు.
అమెరికా అధిక సుంకాలతో కుదేలు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిసారించాలి
సీడ్, ఫీడ్ మాఫియాపై చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సులో వక్తలు
విజయవాడ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘దేశ వ్యాప్తంగా రొయ్యలు, చేపల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 70 శాతం. దేశానికి ఏడాదికి రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని పన్నుల రూపంలో రాష్ట్ర ఆక్వా రైతులు సమకూర్చుతున్నారు. మార్కెట్ సెస్, ఇతర పన్నుల రూపంలో రాష్ర్టానికి రూ.30 వేల కోట్ల ఆదాయం వస్తోంది. రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తులు ప్రపంచంలోని 60 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఒక్క అమెరికా అధిక సుంకాలు వేసినందుకే వనామి, టైగర్ రొయ్యల ధరలు ఆమాంతం పడిపోయాయి. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిన్నకుండిపోవడం దురదృష్టకరం. రైతు ప్రభుత్వమని వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలే తప్ప, వాస్తవంగా రైతులను ఆదుకున్న దాఖలు కనిపించడం లేదని’’ పలువురు రైతు సంఘాలు, ఆక్వా రైతు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సదస్సు విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో గురువారం జరిగింది. రొయ్యల ధరలు నానాటికి క్షీణిస్తున్న తరుణంలో రాష్ట్రంలోని రైతులు ఈ సదస్సు ద్వారా వారి అభిప్రాయాలను వెల్లడించారు. భవిష్యత్తు ఆహార ఉత్పత్తుల అవసరాల దృష్ట్యా సాగు విస్తీర్ణం పెంచి, సబ్సిడీలు ఇచ్చి రైతులకు అండగా నిలిస్తే మరో 20 ఏళ్లలో ఏడాదికి రూ.6 లక్షల చొప్పున విదేశీమారక ద్రవ్యాన్ని సాధించవచ్చని రైతు సంఘ రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య తెలిపారు. రొయ్యలు, చేపల సాగు చాలా ఖర్చుతో కూడుకున్న కష్టతరమైనదని, సుంకాలకు భయపడకుండా మార్కెట్‌ను విస్తృతం చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్వేషించి రైతులకు అండగా నిలవాలని ఆక్వా రైతుల సంఘం నాయకులు బి.బలరామ్ విజ్ఞప్తి చేశారు. రొయ్యలు, చేపల ఉత్పత్తులపై స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రభుత్వాలు ఆలోచన చేయాలని జైభారత్ క్షీరరామ ఆక్వా రైతుల సంఘం కార్యదర్శి బోనం వెంకట నరసయ్య సూచించారు.
చాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర నాయకులు వక్కలగడ్డ భాస్కరరావు మాట్లాడుతూ.. యూరప్ దేశాల్లో సాగు విధానాలను అధ్యయనం చేశానని, ఆ దిశగా రైతులను ఆదుకోవాలని ఎన్నోసార్లు ఎన్నో ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశానని తెలిపారు. విదేశీ మాదకద్రవ్యాన్ని తీసుకొచ్చే ఆక్వా ఉత్పత్తులను పెంచేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. సీడ్, ఫీడ్, ఎక్స్‌పోర్ట్ కంపెనీలు సైబర్ మాఫియాగా తయారయ్యాయని వేటపాలెం ఆక్వా రైతుల సంఘ నాయకులు ఆమంచి స్వాములు ఆరోపించారు. 30, 40 కౌంట్ రొయ్యలు మాత్రమే ఆమెరికా వెళ్తాయని, ట్రంప్ సుంకాలను బూచిగా చూపించి 50, 60, 70, 80, 100 కౌంట్ రొయ్యల రేట్లను తగ్గించేసి, దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఆక్వా రైతులను విద్యుత్ శాఖ అధికారులు నిలువునా దోచుకుంటున్నాని ప్రకాశం జిల్లా ఆక్వా రైతుల సంఘం నాయకులు తేళ్ల రామయ్య మండిపడ్డారు.