Share News

ధర లేక దిగాలు

ABN , Publish Date - Apr 23 , 2025 | 12:42 AM

ఈ ఏడాది మినుము రైతులు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి చివరి వారంలో క్వింటా మినుము రూ.7,800 వరకు ధర పలికింది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని ఆశించిన రైతులకు ధర రూ.7000లకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సారవంతమైన భూములు ఉన్న కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, తోట్లవల్లూరు, దివిసీమ ప్రాంతంలోని మండలాల్లో ఎకరానికి సరాసరిన ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తే ఈ ఏడాది నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమైంది. మినుము తీత పనులను పూర్తి చేసి, మంచి మద్దతు ధర వస్తే విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన సమయంలో ధరలు తగ్గడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ధర లేక దిగాలు

- మినుము క్వింటాకు ప్రభుత్వ మద్దతు ధర రూ.7,400

- రూ.7,000లకే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు

- పెట్టుబడి పెరిగి.. దిగుబడి తగ్గి ఇప్పటికే రైతుల డీలా!

- గతేడాది బహిరంగ మార్కెట్లో రూ.7,700 వరకు పలికిన ధర

- ఈ ఏడాది గిట్టుబాటు కూడా కావడం లేదని ఆవేదన

ఈ ఏడాది మినుము రైతులు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్చి చివరి వారంలో క్వింటా మినుము రూ.7,800 వరకు ధర పలికింది. రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందని ఆశించిన రైతులకు ధర రూ.7000లకు తగ్గిపోవడం ఆందోళన కలిగిస్తోంది. సారవంతమైన భూములు ఉన్న కంకిపాడు, ఉయ్యూరు, పామర్రు, తోట్లవల్లూరు, దివిసీమ ప్రాంతంలోని మండలాల్లో ఎకరానికి సరాసరిన ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేస్తే ఈ ఏడాది నాలుగైదు క్వింటాళ్లకే పరిమితమైంది. మినుము తీత పనులను పూర్తి చేసి, మంచి మద్దతు ధర వస్తే విక్రయించేందుకు సిద్ధంగా ఉంచిన సమయంలో ధరలు తగ్గడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది రబీ సీజన్‌లో 3.50 లక్షల ఎకరాల్లో మినుము పంటను రైతులు సాగు చేశారు. మార్చి నెలాఖరు నాటికి దాదాపు మినుము తీత పనులు పూర్తిచేశారు. మార్చి చివరి వారంలో క్వింటా మినుముకు బహిరంగ మార్కెట్‌లో రూ.7800 వరకు చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేశారు. గత 20 రోజులుగా మినుము ధరను వ్యాపారులు క్రమేపీ తగ్గిస్తూ వచ్చారు. ఇంటి అవసరాలు, లేదా గతంలో వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడుల నిమిత్తం తీసుకున్న అప్పులను తీర్చేందుకు రైతులు మినుము విక్రయించేందుకు వ్యాపారుల వద్దకు వెళితే క్వింటా మినుముకు రూ.7 వేలకు మించి ధర ఇవ్వలేమని తెగేసి చెబుతున్నారు. గుంటూరు, తెనాలికి చెందిన పెద్ద వ్యాపారులు మినుము ధరను తగ్గించి వేశారని, తమ చేతుల్లో ఏమీలేదని స్థానిక వ్యాపారులు అంటున్నారు.

జిల్లాలో 28 మినుము కొనుగోలు కేంద్రాలు

మార్చి నెల చివరిలో జిల్లాలోని 25 మండలాల్లోని మార్కెట్‌ యార్డులు, ఇతర ప్రాంతాల్లో 28 మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా రైతుల నుంచి మినుము కొనుగోలు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ గీతాంజలిశర్మ ప్రకటించారు. మినుము క్వింటాకు మద్దతు ధర రూ.7,400 ప్రభుత్వం ప్రకటించింది. రైతులు తమ వద్ద మినుమును విక్రయించాలంటే ముందస్తుగా ఆర్‌ఎస్‌కేలలో రిజిస్ర్టేషన్‌ చేయించుకోవాలని చెప్పారు. రిజిస్ర్టేషన్‌ పూర్తయిన తర్వాత మినుము శాంపిళ్లను కొనుగోలు కేంద్రాల వద్ద తీసుకువెళితే నాణ్యతను బట్టి ధరను నిర్ణయిస్తామని ప్రకటించారు. మార్చి చివరివారం వరకు మినుము మద్దతు ధర క్వింటాకు రూ.7,800 వరకు వ్యాపారులు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయడంతో రైతులు ఇంకా మినుము ధర పెరుగుతుందనే ఆశతో మినుమును విక్రయించకుండా తమ వద్దనే నిల్వ పెట్టారు. కొద్దిరోజులుగా మినుము ధరను రూ.7 వేలకు వ్యాపారులు తగ్గించి వేయడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది.

ఖాళీగా కొనుగోలు కేంద్రాలు

ప్రభుత్వం ఏర్పాటు చేసిన మినుము కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత పేరుతో అనేక ఆంక్షలు విధించడంతో రైతులు తమ వద్ద ఉన్న పంటను విక్రయించేందుకు ముందూ, వెనుక ఆలోచిస్తున్నారు. దీంతో ఇప్పటివరకు ఒక్క క్వింటా మినుమును కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా కొనలేదు. ఇక్కడ మద్దతు ధరకు కొనుగోలు చేస్తే బహిరంగ మార్కెట్‌లో ధర మరింతగా పెరుగుతుందని రైతులు అంటున్నారు. పెసలు కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఎనిమిది కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 800 టన్నుల పెసలను కొనుగోలు చేసినట్లు మార్క్‌ఫెడ్‌ అధికారులు చెబుతున్నారు. పెసలు క్వింటాకు మద్దతు ధర రూ.8,682 ప్రభుత్వం నిర్ణయించింది. బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.8 వేలు మాత్రమే పలుకుతుండటంతో రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

తగ్గిన దిగుబడి.. పెరిగిన ఖర్చు

రైతులు అన్ని జాగ్రత్తలు తీసుకుని మినుము పంటను సాగు చేస్తే ఎకరానికి కనీసంగా ఆరు క్వింటాళ్లు, అధికంగా ఎనిమిది క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది పంట సాగుకాలం కొంతమేర అనుకూలించకపోవడంతో అన్ని మండలాల్లో ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. ఈ ఏడాది మినుము సాగు చివరి దశ వరకు ఎకరానికి కనీసంగా రూ.30 వేలకుపైగా పెట్టుబడిగా రైతులు పెట్టారు. దిగుబడి మాత్రం ఎకరానికి నాలుగైదు క్వింటాళ్లు మాత్రమే వస్తుండటంతో రైతులకు ఖర్చులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మినుము మద్దతు ధర క్వింటాకు ఏడు వేలకు పడిపోయిందని, ఈ ధరలు ఇలానే కొనసాగితే సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాదని రైతులు వాపోతున్నారు. గతేడాది ఇదే రోజుల్లో మినుము బహిరంగ మార్కెట్‌లో క్వింటా రూ.7,700లకుపైగా విక్రయించామని, ఈ ఏడాది వ్యాపారులంతా కూడబలుక్కుని ధరలు తగ్గించివేశారని, ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Apr 23 , 2025 | 12:42 AM