African Locusts: ఆఫ్రికా నత్తల బెడదను నివారిద్దాం
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:17 AM
ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆశించి, విపరీతంగా నష్టం కలిగిస్తున్న ఆఫ్రికా నత్తల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సూచించారు.
అవి ఆశించడం వల్ల పంటలకు తీవ్ర నష్టం
కేరళ వక్క మొక్కల ద్వారా ఇక్కడికి వ్యాప్తి
ఒక్కో నత్త నెలకు 5 వేల పిల్లల్ని చేస్తాయి
రైతులు సామూహిక నివారణ చర్యలు చేపట్టాలి
ఉద్యానశాఖ డైరెక్టర్ శ్రీనివాసులు సూచనలు
అమరావతి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఉద్యాన, వ్యవసాయ పంటలపై ఆశించి, విపరీతంగా నష్టం కలిగిస్తున్న ఆఫ్రికా నత్తల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఉద్యానశాఖ డైరెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు సూచించారు. గ్రామాల్లో రైతులంతా సామూహికంగా నత్తల నివారణ చర్యలు పాటిస్తే.. మంచిదని పేర్కొన్నారు. కేరళ నుంచి తెస్తున్న వక్క మొక్కల ద్వారా ఆఫ్రికా నత్తలు వస్తున్నాయని, వాటిని తెచ్చేటప్పుడు ఉద్యాన అధికారులకు సమాచారం అందించాలని కోరారు. కేరళ ఉద్యానశాఖను కూడా అప్రమత్తం చేసినట్లు తెలిపారు. మన ప్రాంతంలో ఉండే తెల్ల నత్తల వల్ల పంటలకు నష్టం ఉందని, ఆఫ్రికా నత్తల వల్లే తీవ్ర నష్టమని చెప్పారు. వీటి నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలను శనివారం ఓ ప్రకటనలో వివరించారు. వందేళ్ల క్రితమే ఆఫ్రికా నుంచి భారత్‌లోకి వచ్చిన ఈ నత్తలు గాలి, వెలుతురు తలగని ప్రదేశాల్లో ఉండి.. జూలై నుంచి ఫిబ్రవరి మధ్య సంతోనోత్పత్తి చేస్తాయని, ఐదారేళ్లు జీవించే ఒక్కో నత్త నెలకు 100-400 గుడ్లు పెట్టి, కనీసం 5 వేల పిల్లల్ని చేస్తాయని పేర్కొన్నారు. అరటి, జామ, బొప్పాయి, వక్క, ఆయిల్‌పామ్ తోటల్ని, పత్తి, మొక్కజొన్న, కూరగాయ పంటల్ని ఆశించి, ఆపార నష్టం కలిగిస్తాయని తెలిపారు. గత మూడేళ్ల నుంచి కొందరు రైతులు కేరళ నుంచి వక్క మొక్కలను తీసుకొచ్చి నాటుకుంటున్నారని, ప్రస్తుతం కృష్ణా, అనంతపురం, అల్లూరి, మన్యం, గోదావరి జిల్లాల్లోనూ వక్క చెట్లు ఉన్నాయని, దీంతో మన రాష్ట్రంలోనూ ఆఫ్రికా నత్తలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు.
ఆఫ్రికా నత్తల నిర్మూలనకు సూచనలు..
రైతులు పంటలను నిండుగా వేసుకోకుండా.. గాలి, వెలుతురు సోకేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాలు, తోటల్లో తేమతో కూడిన చెత్త, కలుపు తొలగించడంతో పాటు ఎప్పటికప్పుడు అంతర సేద్యం చేయాలి. తోటలకు రాత్రిళ్లు నీరు పారించకుండా, పగటి సమయంలోనే నీరు పెట్టుకోవాలి.
తోటల్లో బాతులు, కోళ్లను పెంచితే అవి నత్తల్ని నాశనం చేయడంలో ఉపకరిస్తాయి. నత్త పిల్లలను బాతులు, కోళ్లు, ఇతర పక్షులు తింటాయి.
పొలం గట్లపై కిలో ఉప్పు కలిపిన 4 లీటర్ల నీటిలో ముంచిన గోనె సంచులు పరిస్తే.. నత్తల వలసలు ఆగుతాయి. గోనె సంచిలోని ఉప్పు ఘాడత నత్త శరీరంలో ఉండే నీటిని లాగేస్తాయి. చేతికి గ్లౌజులు వేసుకుని, కనిపించిన నత్తల్ని ఏరి ఉప్పు ద్రావణంలో పడేస్తే చనిపోతాయి.
25 కిలోల వరి తవుడు, 100 గ్రాముల థియోడికార్బ్ గుళికలు, 3 కిలోల బెల్లం, 100 గ్రాముల ఆముదం కలిపిన చిన్న ఉండలు, బొప్పాయి, క్యాబేజీ ఆకులను పొలాలు, తోటల్లో అక్కడక్కడా వేస్తే.. నత్తలు వచ్చి తిని, చనిపోతాయి. మెటల్డిహైడ్ గుళికలు ఎకరానికి 5 కిలోలు చల్లితే నత్తలు తిని, చనిపోతాయి.
సత్వర నివారణకు చిలేటెడ్ కాపర్ 3 గ్రాములు, ఫెర్రోమేగ్ 3 గ్రాములు లీటర్ నీటిలో కలిపి పిచికారి చేస్తే.. నత్తలు వెంటనే చనిపోతాయి. కొన్ని కదలికలో ఉంటే 4 లీటర్ల నీటిలో 5 కిలోల కల్లు ఉప్పు వేసి, కరిగించిన ద్రావణంలో నత్తల్ని పడేస్తే కచ్చితంగా చనిపోతాయి.