Higher Education Commission: ఆ 26 కోట్లు తిరిగి చెల్లించాల్సిందే
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:30 AM
విద్యార్థుల నుంచి భారీగా అదనపు ఫీజులు వసూలు చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీపై ఒత్తిడి పెరుగుతోంది.
మోహన్‌బాబు యూనివర్సిటీపై పెరుగుతున్న ఒత్తిడి
ముగిసిన హైకోర్టు మధ్యంతర స్టే గడువు
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల నుంచి భారీగా అదనపు ఫీజులు వసూలు చేసిన మోహన్‌బాబు యూనివర్సిటీపై ఒత్తిడి పెరుగుతోంది. అదనంగా వసూలు చేసిన రూ.26.17 కోట్లను 15 రోజుల్లో చెల్లించాలని ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ గత నెలలో ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. దానిపై యూనివర్సిటీ హైకోర్టును ఆశ్రయించగా.. మూడు అంశాలపై న్యాయస్థానం గత నెల 26న మధ్యంతర స్టే ఇచ్చింది. రూ.26.17 కోట్లు తిరిగి చెల్లింపు, యూనివర్సిటీ గుర్తింపు ఉపసంహరణకు చర్యలు, వర్సిటీ బాధ్యతలను శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి అప్పగించాలనే అంశాలపై మూడు వారాల పాటు స్టే విధించింది. అయితే ఆ గడువు తాజాగా ముగిసింది. స్టే పొడిగింపు లభించలేదు. కాగా, ఉన్నత విద్య కమిషన్ కౌంటర్ పిటిషన్‌లో ఇంప్లీడ్ కావాలని పేరెంట్స్ అసోసియేషన్ భావిస్తోంది.