EX TTD EO Dharma Reddy: చైర్మన్ ఒత్తిడి తెచ్చారు
ABN , Publish Date - Nov 13 , 2025 | 03:29 AM
కల్తీ నెయ్యి సరఫరా విషయంలో అప్పటి టీటీడీ చైర్మన్ (వైవీ సుబ్బారెడ్డి), పాలకమండలిలో కొందరు సభ్యులు ఒత్తిడి తెచ్చారని టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది.
పాలకమండలిలో కొందరు సభ్యులు కూడా: ధర్మారెడ్డి
వారు చెప్పినట్లు చేయాలని ఉన్నత స్థాయి నుంచీ ఆదేశాలు
దాంతో మిన్నకుండిపోయానన్న టీటీడీ మాజీ ఈవో
తిరుమల కల్తీ నెయ్యి కేసులో వరుసగా రెండో రోజూ సుదీర్ఘ విచారణ
సింఘాల్, జవహర్‌రెడ్డిని ప్రశ్నించరేమంటూ ఎదురు ప్రశ్నలు
తిరుపతి/తిరుపతి (నేరవిభాగం), నవంబరు 12(ఆంధ్రజ్యోతి): కల్తీ నెయ్యి సరఫరా విషయంలో అప్పటి టీటీడీ చైర్మన్ (వైవీ సుబ్బారెడ్డి), పాలకమండలిలో కొందరు సభ్యులు ఒత్తిడి తెచ్చారని టీటీడీ మాజీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు తెలిసింది. వాళ్లు చెప్పినట్లు నడచుకోవాలంటూ ఉన్నత స్థాయి నుంచీ ఆదేశాలు వచ్చాయని.. దాంతో మిన్నకుండిపోవలసి వచ్చిందని వెల్లడించినట్లు సమాచారం. ఈ విషయం టీటీడీ ప్రొక్యూర్‌మెంట్ విభాగంతో పాటు జవహర్‌రెడ్డికి కూడా తెలుసని స్పష్టంచేశారని తెలిసింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసులో సిట్ బుధవారం వరుసగా రెండో రోజు కూడా ఆయన్ను విచారించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. విశాఖ సీబీఐ డీఐజీ మురళి రాంబా పలు అంశాలపై ధర్మారెడ్డిని సూటిగా ప్రశ్నించినట్లు తెలిసింది. ‘నెయ్యి కల్తీ వ్యవహారంలో బాధ్యులెవరు? ఈ వ్యవహారం నడిపించింది ఎవరు? టీటీడీ ఈవోగా పనిచేసిన మీరా.. లేక అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డా? కల్తీ వ్యవహారం తెలిశాక కూడా లడ్డూల తయారీకి ఆ నెయ్యిని మీరెలా అనుమతించారు’ అని అడిగినట్లు సమాచారం. ఓ దశలో సహనం కోల్పోయిన ధర్మారెడ్డి.. ఎందుకు పదేపదే ఇవే ప్రశ్నలు వేస్తున్నారని ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. అదనపు ఈవోగా ఉన్న తాను ఈవోగా బాధ్యతలు తీసుకోవడమే తాను చేసిన పాపమా అని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. కల్తీ గురించి తెలిశాక కూడా అదే నెయ్యిని ఎందుకు తెప్పించారని డీఐజీ మళ్లీ అడగడంతో ఆయన ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. ‘ఈ వ్యవహారంలో నా ప్రమేయం లేదు. నన్ను బాధ్యుడిని చేయొద్దు’ అని మాజీ ఈవో కోరినట్లు సమాచారం. సిట్ బృందం 9 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించింది.
ఉదయం 8.30 గంటలకు సిట్ కార్యాలయానికి చేరుకున్న ధర్మారెడ్డిని మొదట మధ్యాహ్నం 2 గంటల వరకూ విచారించారు. బోజనం విరామం తర్వాత తిరిగి 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ప్రశ్నించారు. మంగళవారం మధ్యాహ్నం భోజనం కోసం ఽధర్మారెడ్డి బయటకు వెళ్లిరావడానికి అనుమతించిన అధికారులు.. బుధవారం మాత్రం కార్యాలయానికే భోజనం తెప్పించారు.
కాగా, కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితులు, భోలేబాబా అధినేతలు పొమిల్ జైన్, విపిన్ జైన్‌లను సిట్ అధికారులు బుధవారం కూడా విచారించారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకూ సుదీర్ఘంగా ప్రశ్నించారు. నాలుగు రోజులుగా వారిని విచారిస్తున్నారు. ఇంకోవైపు.. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కడూరు చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్‌పై నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణ ఈ నెల 17వ తేదీకి వాయిదా పడింది.