President Murmu visit: పద్మావతి అమ్మవారి సేవలో రాష్ట్రపతి
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:47 AM
శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఆమె స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం....
రాత్రి తిరుమలలో బస, నేడు శ్రీవారి దర్శనం
అనంతరం హైదరాబాద్‌కు పయనం
తిరుపతి, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం తిరుమల చేరుకున్నారు. శుక్రవారం ఆమె స్వామి వారిని దర్శించుకోనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4.05 గంటలకు తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి రాష్ట్ర ప్రభుత్వం తరపున హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవదాయ శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్, తిరుపతి ఎంపీ గురుమూర్తి, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, కలెక్టర్ వెంకటేశ్వర్, ఐజీ రాజకుమారి, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు స్వాగతం పలికారు. అక్కడ నుంచి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గాన 4.40 గంటలకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోం శాఖ మంత్రి అనిత, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు ఆమెను స్వాగతించారు. ఆలయ మహద్వారం వద్ద అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి నమస్కరించిన అనంతరం రాష్ట్రపతి అమ్మవారి సన్నిధికి చేరుకుని మూలమూర్తిని దర్శించుకున్నారు. ఆపై ఆలయ మండపంలో వేద పండితులు, అర్చకులు ఆశీర్వచనం పలికి అమ్మవారి శేషవస్త్రాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆలయంలో సుమారు 45 నిమిషాల పాటు గడిపిన రాష్ట్రపతి తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, అదనపు ఈవో వెంకయ్య చౌదరిఆమెకు స్వాగతం పలికారు. ద్రౌపదీ ముర్ము రాత్రికి తిరుమలలోనే బస చేసి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు తొలుత వరాహ స్వామిని ఆ తర్వాత శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. 11 గంటలకు తిరుమల నుంచి బయలుదేరి తిరుపతి విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు వాయుసేన విమానంలో హైదరాబాదు వెళతారు. రాష్ట్రపతి వెంట కుమార్తె, మనవడు, మనవరాలు ఉన్నారు.