Tirumala: శ్రీవారి సేవలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN , Publish Date - Nov 22 , 2025 | 05:11 AM
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని...
మహద్వారం వద్ద ఇస్తికఫాల్ స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో
తిరుమల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకుని గురువారం సాయంత్రం తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న ముర్ము రాత్రి తిరుమలలోనే బస చేశారు. శుక్రవారం ఉదయం వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరకున్న రాష్ట్రపతికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, అర్చక బృందం ఇస్తికఫాల్(ఆలయ మర్యాదలు)తో స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా ఆలయంలోకి వెళ్లిన ముర్ము, ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో రాష్ట్రపతికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా, టీటీడీ చైర్మన్ శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం పోటు సిబ్బంది ఇచ్చిన అన్నప్రసాదాలు స్వీకరించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఈవో రాష్ట్రపతికి శ్రీవారి చిత్రపటం, 2026 డైరీ, క్యాలెండర్లు అందజేశారు.
భక్తులను పలకరించిన రాష్ట్రపతి
శ్రీవారి దర్శనం అనంతరం రాష్ట్రపతి ముర్ము.. రాంభగీచ సర్కిల్ వద్ద భక్తులను చూసి వాహనాన్ని ఆపారు. భక్తుల వద్దకు నేరుగా వెళ్లి అభివాదం చేస్తూ పలకరించారు. అతిథిగృహానికి చేరుకుని కొంత సమయం విశ్రాంతి తీసుకుని తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు.