Polavaram Project: ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి సన్నాహాలు
ABN , Publish Date - Oct 15 , 2025 | 05:40 AM
పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన రాతి మట్టి డ్యాం.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి.
డయాఫ్రం వాల్ ప్యానెళ్ల వద్ద గైడ్‌వాల్స్ తొలగింపు
పోలవరం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన రాతి మట్టి డ్యాం.. ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ (ఈసీఆర్‌ఎఫ్) డ్యాం నిర్మాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. డయాఫ్రం వాల్‌లో పది ప్యానెళ్లకు ఇరువైపులా నిర్మించిన గైడ్‌వాల్స్‌ను ఇప్పటికే తొలగించారు. కొన్ని చోట్ల అవసరానికి మించి పైకి నిర్మించిన గోడను మిగిలిన ఎత్తుకు సమానంగా తొలగించి ఈసీఆర్‌ఎఫ్ డ్యాం నిర్మాణానికి అనువుగా సిద్ధం చేస్తున్నారు. వాల్‌కు సంబంధించి 373 ప్యానెళ్లకు గాను మంగళవారం నాటికి 190 ప్యానెళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 183 ప్యానెళ్లు కట్టాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి 1,397 మీటర్ల మేర డయాఫ్రంవాల్ నిర్మాణం పూర్తి చేయడానికి అవసరమైన ట్రెంచ్ కట్టర్ యంత్ర పరికరాలను ఉంచేందుకు ఆ ప్రాంతంలో గైడ్‌వాల్‌ను నిర్మించి ఫ్లాట్‌ఫాం సిద్దం చేశారు. ఈసీఆర్‌ఎఫ్ డ్యాం డ్రాయింగ్, డిజైన్లకు కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు రావలసి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలు, జలవనరుల శాఖ ప్రణాళికలకు అనుగుణంగా పనులు వేగవంతం చేస్తున్నట్లు ఎస్‌ఈ రామచంద్రరావు తెలిపారు.