Land Acquisition: రాజధాని అమరావతిలో భూసేకరణకు సన్నాహాలు
ABN , Publish Date - Sep 09 , 2025 | 05:49 AM
ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన రైతులపై భూ సేకరణను ప్రయోగించడానికి సీఆర్‌డీఏ సిద్ధమయింది. ఈమేరకు సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభమయింది.
నిర్మాణానికి అడ్డంకిగా మారిన 1,800 ఎకరాలు
అందులో 1,300 ఎకరాల రైతులు అనుకూలురే
సీఆర్‌డీఏ అస్పష్ట విధానాలతోనే ఇవ్వలేదంటున్న రైతులు
సమస్యలను పరిష్కరిస్తే సమీకరణకు సై అంటున్న భూ యజమానులు
వ్యతిరేకులను తమనూ ఒకే గాటన కట్టొద్దంటూ విజ్ఞప్తి
విజయవాడ, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన రైతులపై భూ సేకరణను ప్రయోగించడానికి సీఆర్‌డీఏ సిద్ధమయింది. ఈమేరకు సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రక్రియ ప్రారంభమయింది. మొత్తం 1,800 ఎకరాలను రైతులు తమ వద్దే ఉంచుకున్నారు. ఇది రాజధాని నిర్మాణానికి అడ్డంకిగా మారింది. రాజధాని నిర్మాణాన్ని వచ్చే నాలుగేళ్లలో ఒక కొలిక్కి తీసుకురావాలన్న కృతనిశ్చయంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఆమేరకు ఒకింత కఠినంగానే వ్యవహరించాలని భావిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల జరిగిన 52వ సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం భూ సేకరణకు ఆమోదముద్ర వేసింది. మినిట్స్ చేతికి అంది, వాటికి క్యాబినెట్ ఆమోదం లభించగానే భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెలువరించటానికి వీలుగా సీఆర్‌డీఏ అధికారులు పూర్తి స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు.
దూకుడును తప్పుపడుతున్న రైతులు
కేవలం 500 ఎకరాలకు చెందిన రైతులు మాత్రమే భూ సమీకరణకు, రాజధానికి వ్యతిరేకంగా ఉన్నారు. మిగిలిన 1,300 ఎకరాల రైతులు రాజధానికి, సమీకరణకూ అనుకూలమే. వారంతా ఇప్పటికే తమ భూమిలో మూడు వంతులు రాజధానికి ఇచ్చారు. ఒక వంతు మాత్రమే ఇవ్వకుండా తమ వద్ద ఉంచుకున్నారు. గ్రామ కంఠం పరిధిని నిర్ణయించి భూ సమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వడంలో సీఆర్‌డీఏ అధికారులు ఒక్కో గ్రామానికి ఒక్కో రకంగా వ్యవహరించడంతో ఈ సమస్య తలెత్తింది. సీఆర్‌డీఏ వ్యవహారశైలితో వచ్చిన ఇబ్బందులను పరిష్కరించాల్సిన అధికారులు ఆ వైపుగా దృష్టిపెట్టకుండా దూకుడుగా వ్యవహరించాలని నిర్ణయించడాన్ని వారు తప్పు పడుతున్నారు. రాజధాని అనుకూల, వ్యతిరేక వర్గాలను ఒకే గాటిన కట్టడాన్ని ఎత్తిచూపుతున్నారు.
మినహాయింపులు ఇలా అనిర్దిష్టంగా...
గ్రామకంఠం మినహాయింపులను ఒకసారి పరిశీలిస్తే... నెక్కల్లులో భూసమీకరణ కింద భూములు ఇస్తామన్న భూ యజమానులందరికీ 10 సెంట్లను మాత్రమే గ్రామకంఠం కింద మినహాయించారు. తుళ్లూరులో 253 మంది రైతులకు 10 సెంట్ల నుంచి 1 ఎకరం వరకు మినహాయింపు ఇచ్చారు. దీనిని నెక్కల్లు రైతులు తప్పుపడుతున్నారు. మందడంలో ఓ రైతుకు 8 ఎకరాల వరకు భూ సమీకరణ నుంచి మినహాయింపు ఇవ్వగా... బోరుపాలెంలో 52 మంది రైతులకు, అబ్బరాజుపాలెంలో 23 మంది రైతులకు, రాయపూడి గ్రామంలో 66 మంది రైతులకు, లింగాయపాలెం గ్రామంలో 13 మంది రైతులకు, నేలపాడులో 67 మంది రైతులకు, అనంతవరంలో 35 మంది రైతులకు 10 సెంట్ల నుంచి ఒక ఎకరం లోపు వరకు మినహాయింపు ఇచ్చారు. నిర్దిష్ట విధానం లేకుండా మినహాయింపులు ఇవ్వడంతో నష్టపోతున్నామని భావించిన రైతులు అసంతృప్తితో 1,300 ఎకరాలను ఇవ్వకుండా ఆపారు.
జరీబు సమస్య మరో కారణం
మూడు పంటలు పండే అత్యంత విలువైన జరీబు భూములకు భూసమీకరణలో ప్యాకేజీ ఎక్కువగా ఉంది. జగన్ ప్రభుత్వం జరీబు భూములను డీ క్లాసిఫికేషన్ చేసింది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో చేసిన డీ క్లాసిఫికేషన్‌ను కూటమి ప్రభుత్వం కూడా కొనసాగిస్తుండటంతో ఆ రైతులు భూములను అప్పగించకుండా ఉండిపోయారు. మరికొన్ని భూముల విషయంలో జరీబు అవునా? కదా? అన్న అంశంపై రైతులకు, సీఆర్‌డీఏకి మధ్య అభిప్రాయ భేదాలున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం జరగకపోవడం వల్ల ప్రజా రాజధానికి అనుకూలమైన రైతులే అయినప్పటికీ భూములను ఇవ్వకుండా తమవద్దే ఉంచుకున్నారు.
హక్కు చిక్కులపైనా లేని స్పష్టత
భూయాజమాన్య హక్కుల విషయంలో కొన్ని భూములపై తగాయిదాలున్నాయి. వాటిపై ఇప్పటికే కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టు తీర్పునకు అనుగుణంగా భూయజమానికి భూ సమీకరణ ఫలితాలను అందిస్తామన్న ప్రకనటతో ఆ భూములను తీసుకోవాల్సిన సీఆర్‌డీఏ ఆ దిశగా ప్రయత్నం చేయకుండా వాటిని కూడా భూ సేకరణ కిందకు తీసుకువస్తోంది. వీలైనంతవరకూ వ్యతిరేకతలను తగ్గించుకుని భూసమీకరణ ద్వారా ప్రజా రాజధాని నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అధికారులు ఆదిశగా అడుగులు వేయడం లేదు. రైతుల కష్టనష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా అందరినీ ఒకే గాటిన కట్టి కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే దిశగా వ్యవహరిస్తున్నారని 1,300 ఎకరాల రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించాల్సి ఉంది. అదే జరిగితే మెజారిటీ భూమి సాఫీగా సీఆర్‌డీఏకు బదిలీ అయ్యే అవకాశం ఉంది.