Share News

Pregnant Woman Assault: గర్భిణి గొంతు నొక్కి.. కడుపుపై తన్ని..

ABN , Publish Date - Dec 23 , 2025 | 03:49 AM

రప్పా.. రప్పా..’, ‘గంగమ్మ జాతర..’ అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. తమ అధినేత జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా శాడిజాన్ని ప్రదర్శించారు. ‘టపాసులు పేల్చొదు.. నాకు ఇబ్బందిగా ఉంది..’

Pregnant Woman Assault: గర్భిణి గొంతు నొక్కి.. కడుపుపై తన్ని..

  • టపాసుల మోతతో ఇబ్బంది అన్నందుకు వైసీపీ మూకల దాష్టీకం

  • జగన్‌ పుట్టిన రోజు వేడుకల పేరిట అరాచకం

  • శ్రీ సత్యసాయి జిల్లాలో అమానవీయ ఘటన

  • ఏలూరు జిల్లాలోనూ రెచ్చిపోయిన శ్రేణులు

  • పోలీసుల కాలర్‌ పట్టుకున్న నలుగురు

  • రక్తాభిషేకాలు, రప్పా.. రప్పా.. కార్యకర్తలపై చర్యలు

  • చిత్తూరు, ఉమ్మడి అనంతలో 34 మందిపై కేసులు

తనకల్లు, ద్వారకాతిరుమల, రామకుప్పం, అమరావతి, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘రప్పా.. రప్పా..’, ‘గంగమ్మ జాతర..’ అంటూ రెచ్చిపోతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. తమ అధినేత జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా శాడిజాన్ని ప్రదర్శించారు. ‘టపాసులు పేల్చొదు.. నాకు ఇబ్బందిగా ఉంది..’ అని అడిగిన ఏడు నెలల గర్భిణిపై దౌర్జన్యానికి దిగారు. ఆమె గొంతు పట్టుకుని.. కడుపుపై కాలితో తన్నారు. దీంతో ఆమె ఆస్పత్రి పాలైంది. ఈ అమానవీయ ఘటన శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ముత్యాలవారిపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ గోపి తెలిపిన మేరకు... మాజీ సీఎం జగన్‌ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా గ్రామంలో వైసీపీ నాయకులు బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. ఆ భారీ శబ్ధాల ధాటికి తీవ్రంగా ఇబ్బంది పడిన గిరీశ్‌బాబు భార్య అయిన ఏడు నెలల గర్భిణి సంధ్యారాణి... తమ ఇంటివద్ద బాణసంచా కాల్చవద్దని వైసీపీ నేతలను కోరారు. దీంతో వైసీపీ వర్గీయులు గొడవకు దిగారు. ‘రోడ్డు మీ నాయనదా..?’ అని దూషిస్తూ అజయ్‌దేవ్‌ అనే వైసీపీ నాయకుడు సంధ్యారాణి గొంతు పట్టుకుని, కడుపు మీద కాలితో బలంగా తన్నాడు.


దీంతో ఆమె కుప్పకూలిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను 108లో తనకల్లు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. స్కానింగ్‌ చేయాలని కదిరి ప్రభుత్వ ఆస్పత్రికి పంపించారు. ప్రస్తుతం బాధితురాలు కదిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తన కడుపులోని శిశువు రాత్రి నుంచి కదలడం లేదని సంధ్యారాణి కన్నీరు పెట్టుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు సంధ్యారాణిని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంటకప్రసాద్‌ సోమవారం పరామర్శించారు. ఆందోళన చెందవద్దని, అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. దాడి చేసినవారిని చట్టపరంగా శిక్షించాలని పోలీసులను కోరారు.


వారిపై కఠిన చర్యలు తీసుకోండి: మహిళా కమిషన్‌

సత్యసాయి జిల్లాలో గర్భిణిపై దాడి ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ ఆగ్రహం వ్యక్తం చేశారు. గర్భిణిపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని సోమవారం ఆదేశించారు. జగన్‌ పుట్టినరోజు వేడుకల పేరిట.. టపాసులు పేల్చడమే కాకుండా.. గర్భిణి అని తెలిసినా ఆమెపై దాడికి పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి క్రూరత్వాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఘటనపై జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.

‘రక్తాభిషేకం’.. 34 మందిపై కేసులు

జగన్‌ పుట్టినరోజు వేడుకల్లో మూగజీవాలను బలి ఇచ్చి, ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. మొత్తం 34 మందిపై కేసులు నమోదు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీఐజీ షిమోషి ఆదేశాలతో మొత్తం 26 మందిపై కేసులు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి, స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించారు. మరో ముగ్గురిని తహసీల్దారు వద్ద బైండోవర్‌ చేశారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వీర్నమలలో జగన్‌ ఫ్లెక్సీ ఎదుట మేకను బలిచ్చిన 8 మందిపై కేసులు నమోదు చేశారు. టీడీపీ కార్యకర్త ప్రవీణ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు రామకుప్పం పోలీసులు.. వైసీపీ నేతలు మునస్వామి (మంచి), మణి, శశి, మురళీతో పాటు మరో నలుగురిపై కేసులు నమోదు చేశారు.


పోలీసులపై సర్పంచ్‌, వైసీపీ కార్యకర్తల దౌర్జన్యం

పోలీసుల విధులకు ఆటంకం కలిగించి దౌర్జన్యానికి దిగిన ముగ్గురు వైసీపీ కార్యకర్తలతో పాటు గ్రామ సర్పంచ్‌పై కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని దొరసానిపాడులో కొందరు పబ్లిక్‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ ఆదివారం రాత్రి 112 టోల్‌ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుధీర్‌, హోంగార్డు జయప్రకాష్‌ బాబు, ఇతర సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లారు. జగన్‌ పుట్టిన రోజును పురస్కరించుకుని దొరసానిపాడు పంచాయతీ ముందు వైసీపీ కార్యకర్త పి.మంగరాజు మోటార్‌ బైక్‌తో రోడ్డుపై విన్యాసాలు చేస్తున్నాడు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. ఆయన సర్పంచ్‌ లక్కాబత్తుల సిద్దిరాజు, లక్కాబత్తుల రాజు, మహేశ్‌తో కలిసి పోలీసులను దుర్భాషలాడుతూ కాలర్‌ పట్టుకుని పక్కకు నెట్టాడు. దీంతో ఈ నలుగురిపై కేసు నమోదు చేశారు. కాగా, ద్వారకాతిరుమల మండలం రామశింగవరంలో జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ‘‘మ్యాజిక్‌ ఫిగర్‌ 88 దాటగానే.. 2029లో గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా.. రప్పా నరుకుతాం.. ఒక్కొక్కడిని..’’ అని రాశారు. టీడీపీ కార్యకర్త దొప్పసాని బాబూరావు ఫిర్యాదు మేరకు.. ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన బిరుదుగడ్డ రాజు, కనికెళ్ల రవికిషోర్‌, మద్దాల దిలీ ప్‌కుమార్‌, మానుకొండ రాజ్‌కుమార్‌, కుండ శ్యాంబాబు, మానుకొండ హిమకుమార్‌లతో పాటు ఫ్లెక్సీని ముద్రించిన రాయల్‌ ఫ్లెక్స్‌ ప్రింటింగ్‌ షాపు యజమాని హేమంత్‌పై కేసు నమోదు చేశారు.

Updated Date - Dec 23 , 2025 | 03:51 AM