యథేచ్ఛగా ప్రభుత్వ, ఆసైన్డ్ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:28 AM
మచిలీపట్నం, కోడూరు మండలాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించి యథేచ్ఛగా రొయ్యల చెరువులను తవ్వేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.

యథేచ్ఛగా ప్రభుత్వ, ఆసైన్డ్ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలు
-కోడూరు, మచిలీపట్నం మండలాల్లో అక్రమార్కుల దుశ్చర్య
-చూసీ చూడనట్లు వదిలేస్తున్న రెవెన్యూ అధికారులు
-ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఆయా గ్రామాల ప్రజలు
మచిలీపట్నం, కోడూరు మండలాల్లో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ, అసైన్డ్ భూములను ఆక్రమించి యథేచ్ఛగా రొయ్యల చెరువులను తవ్వేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు మామూళ్లకు అలవాటుపడి చూసీచూడనట్లు వదిలేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు ఆయా గ్రామాల ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
బందరు వెస్ట్ రెవెన్యూ గ్రామ పరిధిలో ఇటీవల కాలంలో 20 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని ఎలాంటి అనుమతులు లేకుండా రొయ్యల చెరువులుగా తవ్వుతున్నారు. ఈ అంశంపై అధికారులకు ఫిర్యాదులు అందడంతో వారు ఘటనా స్థలానికి వెళ్లే లోపు యంత్రాలను అక్కడినుంచి తరలించేశారు. మచిలీపట్నం నార్త్ మండల పరిధిలోని కానూరు, పెదపట్నం గ్రామాలకు మధ్యన ఉన్న మడ అడవులను నరికి రొయ్యల చెరువులుగా తవ్వేస్తున్నారు. బంటుమిల్లి, మచిలీపట్నం నార్త్ మండలానికి సరిహద్దున నారాయణపురం, కానూరు గ్రామాల పరిధిలోని మడ అడవులను నరికి వేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించి చెరువులుగా మార్పు చేస్తున్నా అటవీశాఖ, రెవెన్యూ అధికారులు ఆవైపునకు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు వస్తున్నాయి.
కోడూరు మండలంలో..
కోడూరు మండలం రామకృష్ణాపురంలో ఇటీవల కాలంలో ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో రొయ్యల చెరువుల తవ్వకాలు ఊపందుకున్నాయి. భీమవరానికి చెందిన ఓ బడాబాబు ఈ ప్రాంతంలో 50 ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసి రొయ్యల చెరువులు తవ్వారు. అంతటితో ఆగకుండా ఈ చెరువుల పక్కనే ఉన్న ప్రభుత్వ, అసైన్డ్ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వకం ఇటీవల ప్రారంభించారు. ఈ విషయంపై గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రాంతాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి అనుమతులు లేకుండా చెరువులు తవ్వుతున్నట్లు గ్రహించి పనులను నిలిపివేయించారు. మందపాకల గ్రామం శివారు చింతకోళ్ల గ్రామం సమీపంలో 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ, అసైన్డ్ భూముల్లో రొయ్యల చెరువులు తవ్వుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలోని రొయ్యల చెరువుపై కలెక్టర్‌కు ఫిర్యాదు
మచిలీపట్నం దక్షిణ మండలం పరిధిలోని తుమ్మలచెరువు గ్రామ తాగునీటి చెరువునకు 150 మీటర్ల దూరంలో రొయ్యల చెరువును సాగుచేస్తున్నారు. ఈ రొయ్యల చెరువును ఇటీవల కాలంలో ఉప్పునీటితో నింపారు. గతంలో గ్రామం పక్కనే చెరువు తవ్వుతుంటే గ్రామస్తులు అడ్డుకున్నారు. అప్పట్లో వైసీపీ నాయకుల అండదండలతో చెరువును తవ్వి చేపలు సాగు చేశారు. ఈ ఏడాది చేపల సాగుకు బదులుగా రొయ్యల సాగు చేస్తూ, ఉప్పునీటిని చెరువులో నింపారు. దీంతో ఈ చెరువు పక్కనే ఉన్న పంట పొలాలు, తాగునీటి చెరువుకు, నివాసాలకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు చెప్పినా చెరువు యజమాని పట్టించుకోలేదు. దీంతో తాగునీటి చెరువుకు ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులంతా సోమవారం కలెక్టరేట్‌కు వచ్చి కలెక్టర్‌కు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. అధికారులను పంపి తుమ్మలచెరువులో తాగునీటి చెరువుకు, పంట పొలాలకు పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు.